శ్రీవారి దర్శనార్థం తమిళనాడు నుంచి తిరుమలకు కుటుంబ సభ్యులతో వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత చుట్టు పక్కల దేవాలయాలనూ సందర్శించి మొక్కులు చెల్లించారు. తిరుగు ప్రయాణంలో విధి నిద్రమత్తు రూపంలో వారిని ప్రమాదానికి గురి చేసింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును తమిళనాడు వాసుల క్వాలిస్ ఢీకొనడంతో కుటుంబ యజమాని దుర్మరణం చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సాక్షి, పూతలపట్టు(చిత్తూరు) : తమిళనాడులోని వాలాజా తాలూకా, మాంధాగల్‌కు చెందిన హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో క్వాలిస్‌లో సోమవారం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యమైన ఆలయాలను సందర్శించి బుధవారం తిరుగు పయనమయ్యారు. పూతలపట్టు మండలంలోని బాలాజీ కల్యాణ మండపం వద్ద వారి వాహనం ప్రమాదానికి గురైంది. తమిళనాడు దిండిగల్ నుంచి తిరుమలకు వెళ్తున్న ప్రైవేటు బస్సును అదుపు తప్పి ఢీకొంది. ఈ దుర్ఘటనలో క్వాలిస్‌ను నడుపుతున్న హరికృష్ణ(32)తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న అతడి తల్లి వల్లియమ్మ(60), భార్య ప్రియ(21), మరదళ్లు రేణుక(17), రేవతి(17), పిన్నమ్మ రాధ (36), రాధ కుమార్తె అభినయ(10)లకు తీవ్రగాయాలయ్యాయి. రెండు వాహనాల ముందరి భాగాలు బాగా దెబ్బతిన్నాయి. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఈ ప్రమాదం సంభవించడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. వల్లియమ్మ, రేవతి పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరులో ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. పూతలపట్టు ఏఎస్‌ఐ వడివేలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment