అప్పు తిరిగి చెల్లించ లేదని అతని భార్యను.. | Road Accident turn to Murder Case In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అప్పే యమపాశమైంది

Published Wed, Feb 6 2019 12:31 PM | Last Updated on Wed, Feb 6 2019 12:31 PM

Road Accident turn to Murder Case In Tamil Nadu - Sakshi

అరెస్టయిన కాళిరాజ్, అళగుకన్నన్‌

అన్నానగర్‌: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. తీసుకున్న  అప్పు తిరిగి చెల్లించకపోవడంతోనే స్కూటర్‌పై వెళుతున్న మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లుగా తొమ్మిది నెలల తరువాత వెలుగుచూసింది. వివరాలు.. విరుదునగర్‌ జిల్లా శివకాశి తాలూకా ఎరిచ్ఛనత్తం ప్రాంతానికి చెందిన మోహన్‌. ఇతని భార్య సరణ్య. వీరు కోవై జిల్లా సూలూరులో నివసిస్తూ వస్తున్నారు. మోహన్‌ కన్నం పాళయంలో ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. శరణ్య సూలూరులో సెల్‌ఫోన్‌ దుకాణంలో పని చేస్తూ వచ్చింది. ఈ స్థితిలో గత సంవత్సరం ఏప్రిల్‌ 20న శరణ్య భర్త పనిచేస్తున్న పరిశ్రమకు వెళ్లి అక్కడినుంచి స్కూటర్‌పై ఇంటికి బయలుదేరింది.

పల్లపాళయం వెళ్లే దారి వద్ద గుర్తు తెలియని వాహనం స్కూటర్‌ను ఢీకొనడంతో శరణ్య మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. పోస్టుమార్టం నివేదికలో మృతదేహంపై కత్తి గాయాలు ఉన్నట్లుగా తెలిసింది. ఇదిలాఉండగా భార్య మృతిలో అనుమానం ఉన్నట్లుగా మోహన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా శరణ్య హత్యకు గురైనట్టు తెలిసింది. ఈ స్థితిలో తొమ్మిది నెలల తరువాత సోమవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు శరణ్యని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. మోహన్, శరణ్య ఇద్దరు శివకాశికి చెందిన కాళిరాజ్‌ (34) వద్ద నగదు అప్పు తీసుకున్నారు. తరువాత అప్పు తిరిగి చెల్లించకుండా  కోవైకి వచ్చారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న కాళిరాజ్‌ తన బంధువు అళగుకన్నన్‌ (22)తో కోవైకి చేరుకుని మోహన్, శరణ్యను హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో స్కూటర్‌పై ఒంటరిగా వచ్చిన శరణ్యను కారుతో ఢీకొట్టి కిందపడిన ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement