నిండు బతుకులు బైపాస్‌కు బలి | road accidents on anakapalli bypass road | Sakshi
Sakshi News home page

నిండు బతుకులు బైపాస్‌కు బలి

Published Wed, Jan 24 2018 9:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

road accidents on anakapalli bypass road - Sakshi

‘పండుగ పూట మా ఇంటి దీపం ఆరిపోయింది. నాకు, పిల్లలకు దిక్కెవరు. ఈ రోడ్డుపై ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియడం లేదు. అందుకే ప్రమాదం జరిగింది. నా భార్య లారీ కింద నలిగిపోయింది’... ఈ నెల 14న భోగి రోజున పినగాడి కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన త్రివేణి మృతదేహం వద్ద భర్త ఎరకన్నపాత్రుడు విలపించిన తీరు.

‘పండుగకు పుట్టింటికి వచ్చిన నా కూతురికి అరగంట క్రితమే సామాగ్రి మూట కట్టి సాగనంపాను. మరికొన్ని నిమిషాల్లో నా బిడ్డ మెట్టినింటికి వెళ్లిపోయేది. కానీ ఈ రోడ్డు నా గౌరమ్మను మింగేసింది’... ఈ నెల 17న బొర్రమ్మగెడ్డ వద్ద ప్రమాదంలో మరణించిన గౌరి తల్లి గుండె రంపపు కోతతో రోదన ఇది.

‘నా కొడుక్కి పోలీస్‌ ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డాం. ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. త్వరలో ఓ ఇంటివాడిని చేద్దామని ఆలోచిస్తున్నాం. ఇంతలో నా కొడుకు డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడనుకుంటే... రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్నాడు. ఇదెక్కడి ఖర్మ మాకు’... సోమవారం రాత్రి శివగణేష్‌ మరణవార్త విని తల్లిదండ్రుల ఆక్రందన.

వారే కాదు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి వందలాది కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. ఎంతో మంది గుండెలను ముక్కలు చేసింది. ఎందరో తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. అయినప్పటికీ అధికారులు, పాలకుల అలసత్వం వల్ల ఆ బైపాస్‌ రహదారి రక్తదాహాం తీరడం లేదు.

విశాఖపట్నం, పెందుర్తి: ఆనందపురం – అనకాపల్లి బైపాస్‌ రహదారిని విస్తరించకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దాదాపు 15 ప్రమాదాల్లో పది మంది మృత్యువాత పడగా తాజాగా వారం రోజుల వ్యవధిలో ఐదు ప్రమాదాల్లో నలుగురు రోడ్డుకు బలయ్యారు. రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నియంత్రణకు సంబంధిత అధికారులు, పాలకులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రహదారి విస్తరణ అంటూ ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నా ఇంకా ఆ ప్రక్రియ నత్తనడకనే సాగుతోంది. రహదారిని విస్తరించే క్రమంలో ఇంకా పూర్తిస్థాయి భూసేకరణ ప్రక్రియే పూర్తి కాలేదు.

మలుపులే మృత్యు ద్వారాలు  
ఆనందపురం – అనకాపల్లి జాతీయ రహదారి(బైపాస్‌) దాదాపు 38 కిలో మీటర్లు మేర విస్తరించి ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి అత్యంత ప్రమాదకరమైంది. ఈ రహదారికి వెడల్పు చాలా చోట్ల కేవలం 20 అడుగులు మాత్రమే. కిలోమీటర్ల మేర రోడ్డు అంచులు కోరుకుపోయాయి. ఈ రహదారిపై ప్రమాదాలకు కారణం అత్యంత ప్రమాదకరమైన మలుపులే. దారి పొడవునా పదుల సంఖ్యలో మలుపులు ఉన్నాయి.
ఆనందపురం దాటాక శొంఠ్యాం, పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం, సబ్బవరం సమీపంలోని బొర్రమ్మగెడ్డ, సబ్బవరం పాతరోడ్డు, అసకపల్లి కూడలి, మర్రిపాలెం, అనకాపల్లి సమీపంలోని గ్యాస్‌ గొడౌన్‌ వద్ద అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి.
కూడళ్ల వద్ద కూడా తగిన రక్షణ చర్యలు లేవు. కూడళ్లు, మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం.
రహదారిపై ఎక్కడా విద్యుత్‌ దీపాల సౌకర్యం లేదు.
రోడ్డుపై గోతులు పడినా నెలల తరబడి మరమ్మతులు చేపట్టడం లేదు.
ముఖ్యంగా మలుపులు, వంతెనల వద్ద ఎక్కడా హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయలేదు. హైవే పెట్రోలింగ్‌ కూడా ఈ రహదారిపై లేదు.

ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు
గత ఏడాది ఏడాది మార్చి 18న సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో లక్ష్మి అనే వివాహిత, ఆరు నెలల వయసున్న ఆమె కుమార్తె మృత్యువాతపడ్డారు.
అదే ఏడాది ఏప్రిల్‌లో సబ్బవరం బొర్రమ్మగెడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. అదే నెలలో సబ్బవరంలో జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. ఆ నెలలోనే పెందుర్తి వంతెనపై జరిగిన ప్రమాదంలో అప్పారావు అనే వ్యక్తి మరణించాడు.
గత ఏడాది మే నెల 18న పినగాడి వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీను, గణేష్‌ అనే ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
తాజాగా ఈ నెల 14న పినగాడి వద్ద త్రివేణి అనే వివాహిత, 17న బొర్రమ్మగెడ్డ వద్ద గౌరి అనే గృహిణి, సోమవారం రాత్రి సాధూమఠం వద్ద కానిస్టేబుల్‌ శివగణేష్‌ రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.

నివేదికలు వస్తే పరిహారం ప్రకటిస్తాం..
భూ సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రోడ్డు విస్తరించే క్రమంలో అటవీ, ఉద్యానవన శాఖ, ఆర్‌ అండ్‌ బీ అధికారుల నుంచి వారి ఆస్తులకు సంబంధించిన నివేదికలు రావాలి. అవి వచ్చాక ఉన్నతాధికారులు భూ యజమానులతోపాటు అన్ని వర్గాలకు పరిహారాన్ని ప్రకటిస్తారు. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే టెండర్ల ప్రక్రియ మా పరిధిలోనిది కాదు. సాధ్యమైనంత త్వరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. – సుబ్బరాజు, రహదారి విస్తరణ భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement