
బాక్సులో పొద్దున్నే అమ్మ పెట్టిన అన్నం మెతుకులు ఎర్రటి నెత్తుటి ముద్దలయ్యాయి. రాత్రి పూట బ్యాగులో నాన్న సర్దిన పుస్తకాలు రక్తపు మరకల్లో తడిచి ఛిద్రమయ్యాయి. పగిలిన తలలు పెట్టిన ఆర్తనాదాలు ఉషోదయాన విషాదగీతికలై నలుమూలలా ప్రతిధ్వనించాయి. ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీకటి మంచాన లేచి అక్షరాలు దిద్దుదామని బయలుదేరిన నలుగురు విద్యార్థులతోపాటు ఆటోడ్రైవర్ బతుకులు తెల్లారిపోయాయి. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు చక్రాలు.. తల్లిదండ్రుల కంటి పాపలను శాశ్వతంగా చిదిమేశాయి. కుటుంబ సభ్యులకు నూరేళ్లకు సరిపడా గుండె పగిలే విషాదాన్ని మిగిల్చాయి. ప్రభాత వేళ నెత్తుటి కళ్లాపి చూడలేక సూర్య కిరణాలు సైతం మంచు తెరల మాటుకెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాయి.
సాక్షి, గుంటూరు: ఫిరంగిపురం సమీపంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫిరంగిపురం మండలం రేపూడి, మేడికొండూరు మండలం పేరేచర్ల మధ్యలో ఐదు నెలల వ్యవధిలో పాఠశాల విద్యార్థులను చేరవేస్తున్న బస్సులు, ఆటో ప్రమాదాలు మూడు చోటు చేసుకున్నాయి. తాజాగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, ఓ డ్రైవర్ మృతిచెందగా మరో ముగ్గురు విద్యార్థినులు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో 12 మంది విద్యార్థులు, ముగ్గురు మహిళలు గాయాలపాలై ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఫిరంగిపురం మండలంలోని గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు పేరేచర్లలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో అధిక శాతం మంది స్కూల్ బస్సుల్లో వెళుతుండగా, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రం ముందుగా క్లాసులకు హాజరవ్వాలని ఆటోలను ఆశ్రయిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను హాస్టళ్లల్లో ఉంచి చదివిస్తుండగా, ఆర్థిక భారం మోయలేని అనేక మంది రోజూ ఆటోలు, బస్సుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లల చదువులు వారి ప్రాణాల మీదకు తెస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదాలకు కేరాఫ్‌గా రోడ్డు..
గుంటూరు – కర్నూలు ప్రధాన రహదారిలో పేరేచర్ల – నుదురుపాడు మధ్యలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన ఫిరంగిపురం మండలం వేములూరుపాడు శివారులో ఉన్న తులసీ సీడ్స్ ఎదురుగా ఆగి ఉన్న స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు, ముగ్గురు మహిళలు, స్కూల్‌బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన తొమ్మిది రోజులకు అంటే ఆగస్టు 19వ తేదీన ఫిరంగిపురం మండలం రేపూడి శివారులో విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న ఓప్రైవేటు కళాశాల బస్సును ఓవర్ స్పీడ్‌తో వచ్చిన పెట్రోలు ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుంటూరుకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు విద్యార్థులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, పామిశెట్టి తేజశ్వని (16) అనే విద్యార్థిని మాత్రం తలభాగంలో తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతూ ఆగస్టు 29వ తేదీన మృతిచెందింది. ఈ మార్గంలో మామూలుగానే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నప్పటికీ సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి వదిలేస్తున్నారే తప్ప, ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పొగమంచు..డ్రైవర్ల నిర్లక్ష్యం!
ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులు తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఆటోలో పాఠశాలకు వెళుతుండగా రేపూడి శివారులో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, ఆటోడ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు కావడంతో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ బస్సు మితిమీరిన వేగంతో ఓవర్‌టేక్ చేస్తూ పొగమంచులో సరిగా కనిపించక ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment