నెల్లూరు జిల్లాలో లారీ కిందకు దూసుకెళ్లిన కారు
బి.కొత్తకోట/పెద్దతిప్పసముద్రం/నెల్లూరు (మినీ బైపాస్)/పెదకాకాని (గుంటూరు): భోగి పండుగ రోజైన ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదిమంది దుర్మరణం చెందారు. చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో కాలినడకన తిరుమలకు బయలుదేరిన బృందాన్ని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలం ఎంపార్లపల్లి మిట్టపై జరిగింది. పీటీఎం మండలం వరికసువుపల్లికి చెందిన బయ్యమ్మ, యు.బయ్యారెడ్డి, లక్ష్మి, లలితమ్మ, చెన్నకేశవ, ఈశ్వరమ్మ, టి.బయ్యారెడ్డి ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలినడకన బూర్లపల్లెకు బయలుదేరారు. సోమవారం ఉదయం అక్కడి గ్రామస్తులతో కలిసి నడక మార్గంలో తిరుమలకు వెళ్లాల్సి ఉంది. వీరు పోతుపేట సమీపంలోని ఎంపార్లపల్లె మిట్ట దిగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనాలు వీరిని ఢీకొన్నాయి. దీంతో బయమ్మ(48), యు.బయ్యారెడ్డి (45) అక్కడికక్కడే మరణించారు. కర్ణాటకలోని ఉప్పకుంటపల్లికి చెందిన మోటార్‌సైక్లిస్ట్ అనిల్‌కుమార్ (23)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కాలినడకన వస్తున్న వారిలో భార్యాభర్తలు ఈశ్వరమ్మ(38), చెన్నకేశవులు (40), టి.బయ్యారెడ్డి (55), ద్విచక్ర వాహనాల్లో వస్తున్న రాంకుమార్(30), లోకేష్ (28)కు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో రాంకుమార్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని 108, ప్రైవేట్ వాహనాల్లో మదనపల్లెకు తరలించారు.
నెల్లూరులో ప్రాణాలు తీసిన పొగమంచు
నెల్లూరులోని ఎన్‌టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ముత్యాల మల్లికార్జున, సర్పంచ్ నరసమ్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో తమిళనాడులోని నాగపట్నానికి బయల్దేరారు. ఒక కారులో డ్రైవర్ జాఫర్, మల్లికార్జున, నరసమ్మ, ముత్యాల అశోక్, ముత్యాల ప్రేమసాగర్, ముత్యాల అనిల్, పామంజి మంజులమ్మ, పామంజి పోలమ్మ ప్రయాణిస్తున్నారు. వారికి ముందు రెండు లారీలు, ఓ కంటైనర్ వెళ్తున్నాయి. పొగమంచు కారణంగా కంటైనర్ డ్రైవర్ వేగాన్ని తగ్గించడంతో వెనకనున్న సిమెంట్ లారీ కంటైనర్‌ను ఢీకొంది. దీంతో సిమెంట్ లారీ వెనకే వస్తున్న మరో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో జాఫర్ నడుపుతున్న కారు లారీని ఢీకొట్టింది. కారులోని జాఫర్, నరసమ్మ, మంజులమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ముత్యాల మల్లికార్జున, ముత్యాల అనిల్, పామంజి పోలమ్మకు తీవ్రగాయాలయ్యాయి.
ప్రైవేట్ బస్సు ఢీకొని మరో ఇద్దరు..
మరో ఘటనలో.. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో వారిలో ఇద్దరు మృతిచెందారు. నెల్లూరు ప్రశాంతినగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామునే ఈ దుర్ఘటనా చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఎం.సుబ్రహ్మణ్యం (40), పి.వెంకటేష్ (28) మృతిచెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రమాదానికి కారణమైన బస్సును తగులబెట్టారు.
గుంటూరు జిల్లాలో లారీ అదుపుతప్పి..
గుంటూరు జిల్లా పెదకాకాని మండల శివారులోని మద్దిరాల రాజేశ్వరరావు కాలనీ వద్ద ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఆటోనగర్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో గుంటూరు వైపు నుంచి వస్తున్న ఓ లారీని మరో లారీ ఓవర్‌టేక్ క్రమంలో బైక్ పైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాదచారి షేక్ ఇర్ఫాన్‌ను కూడా ఢీకొంది. ఈ ఘటనలో మనోజ్‌కుమార్(20), షేక్ ఇర్ఫాన్ (27) అక్కడికక్కడే మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment