
సాక్షి, పరిగి : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. పక్కన ఇళ్లకు గొళ్లాలు పెట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలు పగలగొట్టి దొరికిన కాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన పరిగి మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మౌలానా కుటుంబసభ్యులు మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లగా ఆయన ఒక్కడే రాత్రి ఓ గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు.
అతను పడుకున్న గదికి గొళ్లెం పెట్టి పక్కగది తాళాలు విరగ్గొట్టారు. బీరువాను పగలగొట్టి రూ.30 వేల నగదు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. ఇల్లంతా చిందరవందర చేశారు. మౌలానా తెల్లారి లేచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఇంటికి గొళ్లెం పెట్టి ఉంది. దీంతో ఆయన పక్కింటి వారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు వచ్చి గొళ్లెం తీశారు. అదే గ్రామానికి చెందిన సాయి అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు.
అతనొక్కడే గ్రామంలో ఉంటుండగా తల్లిదండ్రులు కూలి పనుల కోసం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. సాయి మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి పక్కింట్లో స్నేహితుడి వద్ద నిద్రించడానికి వెళ్లాడు. అయితే తెల్లారి లేచి చూస్తే ఇల్లు తెరచి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న రూ.10,500, అరతుల బంగారం కనిపించలేదు. అదే గ్రామానికి చెందిన ఎండీ ఖాజా ఇంటి తాళాలు కూడా పగలగొట్టారు. కాని ఇంట్లో ఏమి దొరకకపోవటంతో వస్తువులు చిందరవందర చేసి వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment