
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి .
మానుకోలేని విలాసాలు...వ్యాపారంలో నష్టాలు.. వెరసి ఆర్థిక సమస్యలు. చివరకు ఏమి చేయాలో పాలుపోక ఏకంగా స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. 51 తులాల బంగారం, రూ.50 వేల నగదు తస్కరించి.. సీసీ ఫుటేజీల్లో చిక్కి చివరకు కటకటాల పాలయ్యాడు. చిక్కడపల్లి పరిధిలో జరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితున్ని పట్టుకున్నారు.
ముషీరాబాద్: బాకారం ప్రాంతంలో గత 2న సినీఫక్కీలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. చిన్ననాటి స్నేహితుడే అప్పుల బాధ భరించలేక స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసినట్లు గుర్తించారు. చిక్కడపల్లి ఏపీసీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ రాంచంద్రారెడ్డి, డిఐ సంతోష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. శ్రీనివాసాచారి, బాతుల విజయ్‌కుమార్ చిన్ననాటి స్నేహితులు. శ్రీనివాసాచారి బాకారం వెస్లీ చర్చి ఎదురుగా ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో బంగారు ఆభరణాలు తయారీ, పాన్‌బ్రోకర్ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి షాపు మూసిన తర్వాత బంగారం, నగదును ఇంట్లోనే ఉన్న బీరువాలో దాచి ఎన్‌ఎఫ్‌సి కాలనీలోని తన ఇంటికి వెళ్లేవాడు. అదే ప్రాంతంలో ఉండే విజయ్‌కుమార్ ఎలక్ట్రిషన్‌గా పని చేసేవాడు. తన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో మౌలాలి ఆంధ్రాబ్యాంక్‌లో రూ. 15లక్షలు రుణం తీసుకుని పాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
వీటి నుంచి గట్టెక్కేందుకు బంగారం వ్యాపారం చేసి శ్రీనివాసచారిపై దృష్టి పెట్టాడు. తరచూ శ్రీనివాసచారి షాపునకు వెళ్లే అతను బంగారం, నగదు అధిక మొత్తంలో ఉండడాన్ని గుర్తించాడు. శ్రీనివాసచారి దుకాణం మూసిన తర్వాత బంగారు ఆభరణాలను ఎక్కడ పెట్టేది గమనించాడు. దీంతో ఇంటి గ్రిల్స్, ఇంటి డోర్‌కు డూప్లికేట్ తాళాలను తయారు చేయించాడు. ఈ నెల 4న శ్రీనివాసచారి వెళ్లిపోయిన తర్వాత డూప్లికేట్ కీలతో ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం చెవులు తీసుకుని బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లాడు. అనుమానం రాకుండా కారంపొడి చల్లాడు. తీసుకెళ్లిన నగదుతో ఆంధ్రాబ్యాంకులో వాయిదాల రూ. 1.5 లక్షలు, బైక్ లోన్ రూ.6వేలు చెల్లించాడు. శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడు బాతుల విజయ్‌కుమార్‌ను గుర్తించారు. అతని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు.
31తులాలు పోయిందని ఫిర్యాదు..51తులాలు రికవరీ...
మొదట బంగారం ఎంత దొంగతనానికి గురైనదనే దానిపై యజమానికి కూడా స్పష్టత లేదు. వినియోగదారుల రషీదులను పరిశీలించిన తర్వాత 31తులాలు చోరీకి గురైనట్లు ముషీరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత 51 తులాలుగా లెక్కతేలింది. కేసును చేధించిన డిఐ సంతోష్‌కుమార్, డిఎస్‌ఐ బాలరాజ్, క్రైం స్టాఫ్ జయరాజ్, విశ్వనాథ్, కృష్ణ, కళ్యాణ్, అవినాష్‌లకు రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment