టార్చ్‌లైట్‌ సినిమాలాగే మహిళను ఎరగా వేసి.. | Robbery Gang Arrest in PSR Nellore | Sakshi
Sakshi News home page

మహిళను ఎరగా వేసి..దొరికినంత దోచేసి!

Published Thu, May 16 2019 1:02 PM | Last Updated on Thu, May 16 2019 1:02 PM

Robbery Gang Arrest in PSR Nellore - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ మహిళను ఎరవేసి అటుగా రాకపోకలు సాగించే వాహనదారులను దోచేస్తున్న ముఠా గుట్టును నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని మహిళతోపాటు ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్‌ మండలం ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు అలియాస్‌ శ్రీను, అయ్యప్పగుడి టీచర్స్‌ కాలనీకి చెందిన వి.బాలవర్దన్‌ అలియాస్‌ బాలు అలియాస్‌ బాలాజీలు ఆటోడ్రైవర్లు. వీరు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆటో నడుపుతుండేవారు. రామ్‌నగర్‌కు చెందిన ఎం.అనిల్‌ రాత్రివేళల్లో నగరంలో తిరుగుతుండేవాడు. ఈక్రమంలో అతనికి శ్రీను, బాలవర్దన్‌లతో పరిచయమైంది. అనిల్‌ ద్వారా సంతపేటకు చెందిన రమాదేవి అలియాస్‌ రమ వారికి పరిచయమైంది. చెడువ్యసనాలకు అలవాటుపడిన వారికి ఆటో ద్వారా వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. రమాను ఎరగా వేసి జాతీయ రహదారిపై వాహనచోదకులను దోచేయాలని పథకం పన్నారు.

మాటు వేసి..
జాతీయ రహదారిపై నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని అడ్డాగా చేసుకున్నారు. రాత్రి వేళల్లో నలుగురు కలిసి హైవేపైకి చేరుకుని రమాను నిలబెట్టేవారు. మిగిలిన వారు ఆటోలో చీకట్లో నక్కి ఉండేవారు. ఆమెను చూసి ఆకర్షితులైన లారీడ్రైవర్లు, ప్రయాణికులు వాహనాలు దూరంగా ఆపి దగ్గరికి వచ్చేవారు. ఆమె వారిని మాటల్లో దించి చెట్టు పొదల్లోకి తీసుకెళ్లేది. అప్పటికే అక్కడ మాటేసి ఉన్న శ్రీనివాసులు, బాలవర్దన్, అనిల్‌లు లారీడ్రైవర్, ప్రయాణికులపై దాడిచేసి నగదు, ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకుని ఆటోలో పరారయ్యేవారు. దూర ప్రాంతాలకు చెందిన డ్రైవర్లు, ప్రయాణికులు ఈ విషయం బయటపడితే తమ పరువుపోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వెళ్లేవారు. దీంతో పోలీసుల దృష్టి ముఠాపై పడకపోవడంతో జాతీయ రహదారిపై వారు కొంతకాలంగా అనేకమంది దోపిడీ చేశారు.

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ, చిత్రంలో సీఐ, ఎస్సై
వెలుగులోకి ఇలా..
ఎప్పటిలాగే ముఠా సభ్యులు ఈనెల 7వ తేదీ తెల్లవారుజామున సుందరయ్యకాలనీ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో మాటేశారు. రమ రోడ్‌పై టార్చ్‌లైట్‌ పెట్టుకుని వాహనచోదకులను ఆకట్టుకునే పనిలో ఉంది. తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు నుంచి జగయ్యపేటకు వెళుతున్న బొగ్గులోడు లారీ ఆ ప్రాంతానికి చేరుకుంది. రమాను చూసి ఆకర్షితుడైన డ్రైవర్‌ లారీ నుంచి కిందకుదిగి ఆమెతో మాట్లాడాడు. అనంతరం రమ సదరు లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఖాళీ స్థలాలవైపు తీసుకెళ్లి మాట్లాడుతుండగా శ్రీనివాసులు, బాలవర్దన్, అనిల్‌లు అతనిపై దాడిచేశారు. రూ.5 వేల నగదు, వెండి బ్రాస్‌లెట్, ఉంగరం దోచుకుని అక్కడినుంచి అందరూ కలిసి ఆటోలో పరారయ్యారు. బాధిత డ్రైవర్‌ వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు సంఘటనపై కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇన్‌స్పెక్టర్‌కు ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు ఆటోలో సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించి వారిని విచారించగా లారీ డ్రైవర్‌పై దాడిచేసి నగదు దోచుకెళ్లామని అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్‌ చేసి దోపిడీ సొత్తుతోపాటు నేరాలకు ఉపయోగించిన ఆటోను స్వా«ధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. జాతీయ రహదారిపై ఇలాంటి మోసాలు అధికంగా జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు, ఎస్సై పుల్లారెడ్డి, ఏఎస్సై ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్స్‌ సుధా, గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement