
ఒంగోలు క్రైం:పదిహేను ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణ శివారు ప్రాంతాల్లో చోటు చేసుకున్న కిరాతక కాండలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అప్పట్లో దశరాజుపల్లి రోడ్డు, కొత్తపట్నం రోడ్డు, అగ్రహారం రోడ్డు, వెంగముక్కపాలెం రోడ్డు, పేర్నమిట్ట శివారు ప్రాంతం, త్రోవగుంట శివారు ప్రాంతం, చెరువుకొమ్ముపాలెం రోడ్డు శివారు ప్రాంతాలంటే చీకటి పడితే ఒంటరిగా అయినా, జంటగా అయినా వెళ్లాలంటే భీతిల్లిపోయేవారు. దాడులు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు ఇలా ఒకటేమిటి రౌడీలు, ఆకతాయిలు, తాగుబోతుల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. దశరాజుపల్లె రోడ్డు అయితే మరీ దారుణాలు జరిగేవి. అందుకే ఆ గ్రామం 80 శాతం ఖాళీ అయింది. ప్రస్తుతం సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న దారుణాలు అప్ప టి పరిస్థితులను జ్ఞప్తికి తెస్తున్నాయి. శివారు ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంత మండలాల్లోని ఏకాంత ప్రాం తాలు కిరాతకులకు అడ్డాగా మారాయి.
సీసీఎస్ పోలీసులు ఐదారు రోజుల క్రితం చిన్నపాటి దొంగను విచారించేందుకు తీసుకొచ్చారు. ఆ దొంగ చెప్పిన దారుణాలు విన్న నేరవిభాగం పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. చీమకుర్తిని కేంద్రంగా చేసుకొని ఓ ముఠా సాగిస్తున్న అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దాడుల విషయం తెలుసుకొని దర్యాప్తు ప్రారంభిస్తే రక్తం ఉడికింది. చదువు, సంధ్యాలేని ఒక కిరాతకుడు సాగిస్తున్న దారుణ దమనకాండ, కిరాతకాలు, రాక్షసత్వాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.æ జిల్లా చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ఎన్నడూ లేని విధంగా సాగించిన రాక్షసత్వాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఆ నరహంతక ముఠాకు నాయకుడు పాలపర్తి ఏసు. రెండేళ్ల వరకూ కుందేళ్లు, అడవి పందులు పట్టుకుంటూ జీవనం సాగించే ఏసు కన్ను సాగర్ కాలువపై ఏకాంతంగా గడిపేందుకు వచ్చే యువ జంటలపై పడింది. వాళ్ల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మొదట లక్ష్యంగా చేసుకున్నాడు. అందుకోసం తాను ఒక్కడినే అయితే సాధ్యం కాదని ఆలోచించి సాగర్ కాలువలపై చేపల వేటకు వచ్చే సంచార జాతులకు చెందిన యువకులను చేరదీశాడు. కొండలు, శ్రీను, గంగయ్య అనే యువకులను అక్కడ నుంచి అతని కిరాతక పర్వానికి శ్రీకారం చుట్టాడు. జంటగా వచ్చే వారిని గుర్తించి తొలుత యువకుడిపై దాడి చేసి తీవ్రంగా రాళ్లతో, కర్రలతో కొట్టేవారు. ఆ తరువాత యువతిపై అత్యాచారం చేసేవాడు. మిగతా వాళ్లతో కూడా అత్యాచారం చేయించేవాడు. ఆ తరువాత వాళ్ల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, నగదును లాక్కొనేవాడు. నలుగురిగా ఉన్న ముఠాను పదిమందికి పెంచా డు. ఏడాదిన్నరగా ఈ ముఠా చేయని అకృత్యాలు లేవు.
30కి పైగా అత్యాచారాలు: ఏసు ముఠా దాదాపు ఏడాదిన్నరగా సాగిస్తున్న అత్యాచారాల సంఖ్య 30కి పైగా దాటిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందులో 25 మందికిపైగా పెళ్లికాని యువతులు, విద్యార్థినులు ఉన్నారని తెలియటంతో పోలీసులు నోరెళ్ల బెట్టారు. వీరి అఘాయిత్యాల బారిన పడిన మహిళల్లో పెళ్లికాని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని తేలింది. మొదట దాడులు, ఆ తరువాత అత్యాచారాలు, అనంతరం దోపిడీలు వీరికి నిత్యకృత్యంగా మారింది. ఇంత దారుణాలు చేస్తూ విలాసవంతమైన జీవనం గడుపుతున్నా పోలీసులు మాత్రం ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదంటే పోలీస్ నిఘా వైఫల్యం ఏమేరకు ఉందో అట్టే అర్థమవుతోంది. దోచుకున్న బంగారాన్ని చీమకుర్తితో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు బంగారు కుదువకట్టు వ్యక్తుల వద్ద కొంత, బంగారు తాకట్టు పెట్టే ఫైనాన్స్ కంపెనీల్లో కొంత తాకట్టు పెట్టి జల్సాగా జీవనాన్ని సాగిస్తున్నారు.
సాగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహాల వెనుక వీరి పాత్ర...:తొలుత సాగర్ కాలువపై రాక్షస క్రీడను ప్రారంభించిన ఏసు ముఠా కొందరిని హతమార్చి కాలువలో పడేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. జంటగా వచ్చిన వారిపై తొలుత దాడి చేసిన ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించిన వారిని విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయినట్లు సమాచారం. చివరకు కొనఊపిరితో ఉన్నా కాలువలో పడేసినట్టు తెలుస్తోంది. సాగర్ కాలువలో రెండేళ్ల నుంచి గుర్తు తెలియని మృతదేహాల వెనుక పాలపర్తి ఏసు ముఠా హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతులు చనిపోయినా అత్యాచారం చేయాల్సిందే. బంగారు ఆభరణాలు దోచుకోవాల్సిందే. భర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టి చెట్లకు కట్టేసి అతని ముందే అత్యాచారం చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక స్నేహితుని ముందు ప్రియురాలిని, అన్న, తమ్ముడు ముందు సోదరిని, తండ్రి ముందు కుమార్తెను ఇలా ఈ ముఠా చేయని దురాగతాలు లేవంటే నమ్మశక్యం కాదు. ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు మొత్తం పది మంది ఏసు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించటంతోపాటు దోచుకున్న బంగారు ఆభరణాలు, సొత్తును స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిర్భయంగా బాధితులు ముందుకు వస్తే మరిన్ని దారుణాలు వెలుగు చూస్తాయి.
పరువు కోసం బయటకు రావటానికి ఇష్ట పడని బాధితులు
పరువు కోసం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవటానికి ఇప్పటికీ బాధితులు ముందుకు రావటం లేదు. ఒకరిద్దరు ముందుకు వచ్చినా పూర్తి విషయాలు చెప్పకుండా దోచుకున్న బంగారు ఆభరణాల వరకు మాత్రమే చెప్పి వదిలేస్తున్నారు. సోమవారం ఒక ప్రభుత్వ ఉద్యోగిని తనకు జరిగిన అన్యాయాన్ని సీసీఎస్ పోలీసులకు చెప్పింది. అయితే ఆ బాధితురాలు చెప్పని నిజాన్ని పాలపర్తి ఏసు ముఠా చెప్పటంతో పోలీసులు నివ్వెరబోయారని తెలిసింది. ఆ ఉద్యోగినిపై అత్యంత దారుణంగా ఐదుగురు కలిసి లైంగికదాడి చేశారు. గత ఏడాది మల్లవరం డ్యాం వద్ద లైంగికదాడి జరిగింది. అప్పట్లో ఆ ఘటనను “సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ ఘటనను పోలీసుల చాలా తేలిగ్గా తీసుకున్నారు. అప్పట్లోనే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఉంటే ఆ తరువాత ఎంతో మంది ఏసు ముఠా బారి నుంచి బయట పడేవాళ్లు. ఎక్కువ మంది బాధితులు ఒంగోలు నగరంతో పాటు టంగుటూరు, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలు మండలం, నాగులుప్పలపాడు, పొదిలి, మర్రిపూడి, అద్దంకి, దర్శి మండలాలకు చెందిన వారే. వీరితో పాటు వివిధ కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థినులు కూడా వీరి అకృత్యాలకు బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment