
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దుండగులు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : పటమట బందరు రోడ్డులోని ఓ జ్యూయలరీ షాపులో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సాయికిరణ్ జ్యూయలరీ షాపులో చొరబడి బంగారు, వెండి వస్తువులను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హెస్కూల్ రోడ్డు సమీపంలో ఉన్న జ్యూయలరీ షాపులో జరిగింది. షాపులోని 352 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి వస్తువులను అపహరించారు. పటమట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జ్యూయలరీ షాపు వెనుక భాగంలో రంధ్రం చేసి లోనికి ప్రవేశించారు. షాపులో ఉన్న బంగారు, వెండి వస్తువులను పట్టుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. కొన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సాయంత్రం డాగ్ స్క్వాడ్‌తో షాపును, పరిసరాలను పరిశీలించారు. వేలిముద్రల్ని తీసుకున్నారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి దొంగల్ని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఇది తెలిసిన వారి పనేనని భావిస్తున్నారు. జ్యూయలరీ షాపు పక్కనే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడి కార్మికులు ఈ పని చేసి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు.
పాత తరహాలో దొంగతనం?
ఇదిలా ఉండగా చోరీ పాత తరహాలో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇళ్లకు కన్నం వేసి దొంగతనం చేసిన ఘటనలు ఈ ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment