కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి..  | Robbery in Kurnool Bangalore Highway | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టి.. కత్తులతో బెదిరించి.. 

Published Sat, Sep 7 2019 6:33 AM | Last Updated on Sat, Sep 7 2019 6:33 AM

Robbery in Kurnool Bangalore Highway - Sakshi

గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో రోడ్డు దిగి ఖాళీ స్థలంలో ఆగిన బాధితుల కారు. ఇన్‌సెట్‌లో దొంగలు వాడిన కత్తి

సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై గురువారం అర్ధరాత్రి దారిదోపిడీ జరిగింది. వెల్దుర్తి మండల పరిధిలోని మంగంపల్లె, సూదేపల్లె స్టేజ్‌ల మధ్య(అమకతాడు టోల్‌గేట్‌ సమీపంలో) చోటుచేసుకున్న ఈ ఘటన సినీ ఫక్కీని తలపించింది. బాధితుల కథనం మేరకు..  మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా ఓటికి చెందిన స్వాప్నిక్‌ తన స్నేహితులు అమర్, మయూర్‌తో కలిసి కారులో మైసూరులో ఉంటున్న అన్న వద్దకు బయలుదేరారు.

వీరంతా పాలిష్‌ కటింగ్‌ మేస్త్రీలు. గురువారం అర్ధరాత్రి మంగంపల్లె, సూదేపల్లె స్టేజ్‌ల మధ్య కారు వెళ్తుండగా వెనుక నుంచి మరో కారు వచ్చి స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో స్వాప్నిక్, స్నేహితులు వెళుతున్న కారు రోడ్డు నుంచి ఎడమవైపునకు దిగిపోయి పక్కన ఖాళీ స్థలంలో ఆగింది. ఇంతలోనే వెనుక నుంచి ఢీకొన్న కారులోంచి(నంబరు లేని రెడ్‌ కలర్‌ కారు) ఐదుగురు దుండగులు దిగి.. స్వాప్నిక్, స్నేహితులు ఉన్న కారు వద్దకు వచ్చారు. వచ్చీ రావడంతోనే  కారు ముందు అద్దాన్ని తమ వద్ద ఉన్న పిడిబాకు, కత్తులతో బాది హంగామా చేశారు. ‘పైసా నికాల్‌’ అంటూ స్వాప్నిక్‌పై దాడికి దిగారు. మొహంపై బాదారు. కత్తులతో బెదిరించారు.

స్వాప్నిక్‌తో పాటు అతని స్నేహితులు భయభ్రాంతులకు గురయ్యారు. తమ వద్ద ఉన్న రూ.10వేల నగదు ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా వారి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లు, మూడు బ్యాగులు, కారు తాళం చెవి తీసుకుని తమ కారులో టోల్‌గేట్‌ వైపు ఉడాయించారు.  కారు ఢీకొనడం, రోడ్డు దిగి వెళ్లిపోవడాన్ని అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు గుర్తించి.. సమీపంలోని టోల్‌గేట్‌ సిబ్బందికి సమాచారమందించారు. వారు వచ్చి విషయం తెలుసుకుని వెల్దుర్తి పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి సంఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

పిడిబాకులు, కత్తులతో కారు అద్దాలపై దాడి చేసిన సందర్భంగా ఒక కత్తి పిడి వరకు విరగ్గా..దాన్ని అక్కడే పడేశారు.దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. డోన్‌ రూరల్‌ సీఐ సుధాకర్‌ రెడ్డి, డోన్‌ రూరల్‌ ఎస్‌ఐ మధుసూదన్‌ రావ్‌తో కలిసి మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్దుర్తి ఎస్‌ఐ తెలిపారు. టోల్‌గేట్లలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు గతంలో ఇలాంటి దోపిడీలు చేసిన వారిపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

గతంలోనూ దోపిడీలు 
సూదేపల్లె, మంగంపల్లె స్టేజ్‌ల సమీపాన గతంలోనూ పలుమార్లు దారి దోపిడీలు జరిగాయి. దుండగులు వృద్ధురాలిపై దాడికి పాల్పడి, వివస్త్రను చేసిన ఘటనతో పాటు లారీలను అటకాయించి డ్రైవర్లు, క్లీనర్లపై దాడులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఆ కేసులను ఇప్పటి వరకు పోలీసులు ఛేదించిన దాఖలాలు లేవు. మళ్లీ ఆలాంటి ఘటన చోటుచేసుకోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇది చదవండి : పెద్దాసుపత్రిలో దొంగలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement