
హైదరాబాద్ : బంగారం కొనేందుకు మైసూర్ నుంచి తెచ్చిన రూ.1.26 కోట్లు అపహరణకు గురైన ఘటన శనివారం రాత్రి నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలను అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర బంగారం వ్యాపారి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో బంగారం వ్యాపారం చేస్తున్నారు. బంగారం కొనుగోలు నిమిత్తం 1.26 కోట్ల రూపాయలు ఇచ్చి తన పనిమనుషులు సంకిత్, సప్నిల్, సంగప్పను మైసూర్ నుంచి హైదరాబాద్ పంపారు.
వారు శనివారం మధ్యాహ్నం నగరానికి చేరుకుని బషీర్‌బాగ్‌లోని స్కైలాన్‌అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్–202లో దిగారు. అయితే, బంగారం తాను ఆశించిన రేటుకు లభించే అవకాశం లేనందున తిరిగి మైసూర్ వచ్చేయండంటూ రాజేంద్ర అదేరోజు రాత్రి పనివాళ్లకు ఫోన్ చేశారు. దీంతో సంకిత్, సప్నిల్, సంగప్ప వెనుదిరిగేందుకు బయలుదేరారు. అపార్ట్‌మెంటు లిఫ్ట్‌లో నుంచి పార్కింగ్ వైపు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వీరిని అడ్డగించారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు.. ఆ బ్యాగులో ఏముందంటూ..వారిని బెదిరించి, కొట్టి బ్యాగును లాక్కున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సంకిత్, సప్నిల్, సంగప్పల నుంచి నగదు బ్యాగును బలవంతంగా లాక్కుని ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఇక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయనందున నిందితులను ఇంతవరకు గుర్తించలేకపోయామని ఏసీపీ పేర్కొన్నారు.
అదుపులో నగదు, నిందితులు?
నగదు అపహరణకు గురైన తరువాత నాలుగు టీంలుగా దిగిన నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటి ద్వారా నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులతోపాటు సుమారు రూ.కోటి నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment