narayanguda
-
భార్యను చెల్లి అని పిలవమన్నాడు.. ఆ తర్వాత..
హిమాయత్‌నగర్: తన భార్యను పెళ్లి చేసుకున్నదే కాకుండా ఆమెను చెల్లి అని పిలవాలంటూ ఆర్తీ రెండో భర్త నాగరాజు.. నాగులసాయిని బెదిరించాడు. ఈ నెల 7న నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నాగులసాయిని అడ్డగించిన నాగరాజు తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఇకపై ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుంది కాబట్టి చెల్లి అని పిలవాలని చెప్పాడు. ఈ కారణంతోనే తాను అతడిపై దాడి చేశానంటూ నిందితుడు నారాయణగూడ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మంగళవారం నిందితుడు నాగుల సాయిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగులసాయి వృతి రీత్యా బ్యాండ్ వాయిస్తుంటాడు. బ్యాండ్ పని లేనప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఇతని స్నేహితుడి ద్వారా చిక్కడపల్లికి చెందిన ఆర్తీ పరిచయమైంది. దీంతో 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో వారు కొద్దిరోజుల వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్తీ అన్న జితేంద్రపై నాగుల సాయి దాడి చేసి ఏడాది పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జితేంద్ర భార్య ఆర్తీకి నాగరాజును పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు విష్ణు జన్మించాడు. మంటల్లో గాయపడిన విష్ణు దాడి మరుసటి రోజు చనిపోయాడు. గర్భంలో ఉన్న శిశువు మృతి.. అందర్నీ ఒకేసారి చంపాలనే ఉద్దేశంతో కుమారుడితో సహా ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పుడు పెట్రోల్ పోశాడు. ఈ దాడిలో పది నెలల విష్ణు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగరాజు సైతం చనిపోగా.. సోమవారం రాత్రి ఆర్తి గర్భంలో ఐదు నెలల శిశువు మృతి చెందింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గాంధీ వైద్యులు వెల్లడించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం
-
బీజేపీకి చెందిన రూ.8 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) చెందిన భారీ మొత్తాన్ని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జారీ చేసిన సెల్ఫ్ చెక్ ద్వారా డ్రా అయిన రూ.8 కోట్లును టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి అంగీకరించిన బ్యాంకు మేనేజర్‌ను సైతం ప్రశ్నిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులూ దృష్టి పెట్టారు. ఈ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి నగదు అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ, పక్కా సమాచారం ఆధారంగా దాడులు చేసి నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం వరుసగా బ్యాంకులకు సెలవు రావడంతో సోమవారం భారీ స్థాయిలో లావాదేవీలు జరిగే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసుల అనుమానించారు. దీంతో నగరంలోని అనేక బ్యాంకుల వద్ద మాటు వేసి అక్కడ జరిగే లావాదేవీలను డేగ కంటితో పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ వెర్నా కారు (ఏపీ 10 బీఈ 1234) నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు డబ్బుతో వెళ్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేసింది. అందులో ఉన్న రూ.2 కోట్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని తోతిరెడ్డి ప్రదీప్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్ గుండు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ డబ్బును తనకు నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ వద్ద నందిరాజు గోపి అనే వ్యక్తి అప్పగించినట్లు బయటపెట్టారు. అతడి వద్ద మరికొంత మొత్తం ఉందనీ వెల్లడించాడు. దీంతో సదరు బ్యాంక్ వద్దకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో రూ.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నందిరాజు గోపీతో పాటు జి.సుకుమార్‌రెడ్డి, ఎస్.చలపతిరాజు, జె.ఇందు శేఖర్‌రావు ఆర్.బ్రహ్మంలను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నందిరాజు గోపి, ఎస్ చలపతిరావును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు బయటపడింది. మిగిలిన ఐదుగురిలో ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్, వ్యాపారులు ఉన్నారు. గోపి, చలపతిరావుల్ని ప్రశ్నించిన పోలీసులు వారి వద్ద ఉన్న రూ.8 కోట్ల చెక్కునకు సంబంధించిన జిరాక్సు ప్రతిని స్వాధీనం చేసుకున్నారు. దానిపై ‘సెల్ఫ్’ అని రాసి, లక్ష్మణ్ సంతకం ఉండటాన్ని గుర్తించారు. నగదుతో పాటు ఏడుగురినీ నారాయణగూడ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉంటుంది. దీని ప్రకారం రూ.2 లక్షలకు మించి బ్యాంకు నుంచి డ్రా చేయడానికి, రూ.50 వేలకు మించి తరలించడానికి ఆస్కారం లేదు. అయితే సెల్ఫ్ చెక్‌పై రూ.8 కోట్లు డ్రా చేసుకోవడానికి అంగీకరించి. ఆ మొత్తాన్ని అందించిన ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సైతం ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా (నెం.406743774) భారతీయ జనతా పార్టీ పేరుతో ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి సెల్ఫ్ చెక్ (నెం.059198) ఇచ్చిన లక్ష్మణ్ పైనా కేసు నమోదు చేయడానికి పోలీసులు యోచిస్తున్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితుల్లోనూ రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేయడానికి ఆస్కారం లేదు. అలాంటిది ఎన్నికల సీజన్లో, పోలింగ్ సమీపిస్తుండగా ఈ డబ్బును ఎందుకు డ్రా చేశారు?. ఎక్కడకు తరలిస్తున్నారు?. అనే అంశాలను గుర్తించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. -
సమ్‌థింగ్ స్పెషల్ రెడ్డి కాలేజ్
నిజాం రాజ్యంలో ఉర్దూ మీడియం తప్ప మరో భాషలో చదువుకునేందుకు అవకాశంలేని రోజుల్లో ఉదయించిన తెలుగు చదువుల దివ్వె.. బాలికల పైచదువులు కొడగడుతున్న తరుణంలో ఆవిర్భవించిన విద్యాసంస్థ. వారు బాలురతో సమానంగా విజ్ఞానవంతులై అన్ని రంగాల్లో రాణించాలనే ప్రగాఢమైన ఆకాంక్షతో 64 ఏళ్ల క్రితం బర్కత్‌పురాలో ఆవిర్భవించిన ‘ఆంధ్ర బాలికా పాఠశాల’.. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలగా రూపాంతరం చెందింది. ‘రెడ్డి కళాశాల’గా పేరుపొందిన ఈ ప్రాంగణంలో చదువుకున్న ఎంతోమంది యువతులు దేశవిదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సరస్వతీ దేవాలయం వజ్రోత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి,సిటీబ్యూరో: నిజాం నియంతృత్వ రాజ్యంలో ఉర్దూ మీడియం తప్ప మరో భాషలో చదువుకునేందుకు అవకాశం లేని రోజుల్లో ఉదయించిన తెలుగు చదువుల దివ్వె అది. అమ్మాయిల ఉన్నత చదువుకు ఆస్కారం లేని తరుణంలో ఆవిర్భవించిన విద్యా సంస్థ అది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ బాగా చదువుకొని విజ్ఞానవంతులు కావాలని, అన్ని రంగాల్లో రాణించాలనే మహోన్నతమైన ఆశయంతో దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితమే మాతృభాషలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నర్సింహారావు, అహల్యాబాయి మల్లన్న తదితర ప్రముఖుల కృషితో ఆవిర్భవించిన ‘ఆంధ్ర బాలికా పాఠశాల’ అంచెలంచెలుగా ఎదిగింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలగా డిగ్రీ, పీజీలలో అనేక కోర్సులు నిర్వహిస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవే ధ్యేయంగా పనిచేసే అధ్యాపకులు, పాలకమండలి కృషితో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఉన్నత విద్యను అందజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ కళాశాల ఎంతో అండగా నిలుస్తోంది. సరిగ్గా 64 ఏళ్ల క్రితంఆవిర్భవించిన రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల రెండేళ్ల క్రితమే డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంపై అనేక సదస్సు, చర్చలు, గోష్టులు, వివిధ అంశాల్లో పిల్లలకు పోటీలు నిర్వహించారు. బుధవారం బర్కత్‌పురాలోని కళాశాలలో డైమండ్ జూబ్లీ ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఎందరో మహానుభావులు... నగరంలో బాలికలు, మహిళల విద్య కోసం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ హైదరాబాద్ మహిళా విద్యా సంఘం. ఉర్దూ తప్ప మరో భాషలో చదివేందుకు వీల్లేకుండా అప్పటి నిజాం ఒక ప్రత్యేక ఫర్మానా తెచ్చారు. దీంతో ఆ రోజుల్లో హైదరాబాద్‌లోనే కాకుండా మొత్తం తెలంగాణలో తెలుగు, మరాఠీ, కన్నడం భాషల్లోని సుమారు 5,000 పాఠశాలలను మూసివేశారు. అలాంటి సమయంలో 1928లో బాలికల విద్య కోసం ముందుకొచ్చింది ఈ సంఘం. మాడపాటి నేతృత్వంలో నిజాం నీడలకు దూరంగా కోఠిలోని సుల్తాన్ బజార్లో ‘ఆంధ్ర బాలికా పాఠశాల’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాఠశాల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మాడపాటి హనుమంతరావు పాఠశాలగా అమ్మాయిలకు విద్యనందిస్తోంది. ఆ తరువాత నిజాం నియంతృత్వపు అడ్డంకులను అధిగమించేందుకు అప్పటి నగర పోలీస్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డికి 1933లో హైదరాబాద్ మహిళా విద్యా సంఘం సారథ్య బాధ్యతలను అప్పగించారు. మాడపాటితో పాటు బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాప్‌రెడ్డి, వి.నరసింహారావు, అహల్యాబాయి మల్లన్నల కార్యవర్గంలో ఈ కమిటీ పని చేసింది. 1949లో బాలికల పాఠశాల విద్యకే పరిమితం కాకుండా ఉన్నత విద్యను సైతం అందజేయాలని తీర్మానించారు. 1953లో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి కన్నుమూశారు. బూర్గుల సారథ్యంలో కమిటీ పని చేసింది. 1954లో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల ఊపిరి పోసుకుంది. ఆ ఏడాది జనవరి 3న అప్పటి ప్రధాని నెహ్రూ బర్కత్‌పురాలోని కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. 1955 జనవరి 6న సర్వేపల్లి రాధాకృష్ణ ఈ కళాశాలను ప్రారంభించారు. అలాగే 1965లో నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవానికి ఇంది రాగాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మాయిలకు ఉన్నత విద్యనందజేయడమే లక్ష్యంగా 40 మంది జీవితకాల సభ్యులు, 15 మంది పాలకమండలి సభ్యుల బృందంతో కళాశాల ముం దుకు సాగుతోంది. జస్టిస్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత కమిటీకి అధ్యక్షులు కాగా ప్రొఫెసర్ ముత్యంరెడ్డి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ విద్యాసేవలో భాగస్వాములుగా నిలిచారు. కోర్సులివీ... నగరంలో మరే విద్యా సంస్థలోనూ లభించని బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ లాంటి అరుదైన కోర్సులతో పాటు బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, ఎమ్మెస్సీ, ఎంబీఏ తదితర కోర్సులను అందజేస్తున్నారు. 2,700 మంది అమ్మాయిలు వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలతో పాటు అమ్మాయిల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని, ఫార్మసీ కళాశాలను సైతం ఏర్పాటు చేశారు. నేడే వేడుక.. డైమండ్ జూబ్లీ ముగింపు ఉత్సవాలు బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. అదే లక్ష్యం... ఎంతోమంది మహానుభావులు హైదరాబాద్ మహిళా విద్యా సంఘం బాధ్యతలను చేపట్టారు. కళాశాల నిర్వహణకు సారథ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే లక్ష్యం... పేదరికం, ఇతర కారణాలతో అమ్మాయిలు ఉన్నత చదువులకు దూరం కావద్దు. తమకు నచ్చిన భాషలో చదువుకునే అవకాశం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. – ప్రొఫెసర్ ముత్యంరెడ్డి, కార్యదర్శి -
కళ్ల ముందే ‘కొట్టేశారు’!
-
కళ్ల ముందే ‘కొట్టేశారు’!
హైదరాబాద్ : బంగారం కొనేందుకు మైసూర్ నుంచి తెచ్చిన రూ.1.26 కోట్లు అపహరణకు గురైన ఘటన శనివారం రాత్రి నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలను అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర బంగారం వ్యాపారి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో బంగారం వ్యాపారం చేస్తున్నారు. బంగారం కొనుగోలు నిమిత్తం 1.26 కోట్ల రూపాయలు ఇచ్చి తన పనిమనుషులు సంకిత్, సప్నిల్, సంగప్పను మైసూర్ నుంచి హైదరాబాద్ పంపారు. వారు శనివారం మధ్యాహ్నం నగరానికి చేరుకుని బషీర్‌బాగ్‌లోని స్కైలాన్అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్–202లో దిగారు. అయితే, బంగారం తాను ఆశించిన రేటుకు లభించే అవకాశం లేనందున తిరిగి మైసూర్ వచ్చేయండంటూ రాజేంద్ర అదేరోజు రాత్రి పనివాళ్లకు ఫోన్ చేశారు. దీంతో సంకిత్, సప్నిల్, సంగప్ప వెనుదిరిగేందుకు బయలుదేరారు. అపార్ట్మెంటు లిఫ్ట్‌లో నుంచి పార్కింగ్ వైపు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వీరిని అడ్డగించారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు.. ఆ బ్యాగులో ఏముందంటూ..వారిని బెదిరించి, కొట్టి బ్యాగును లాక్కున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సంకిత్, సప్నిల్, సంగప్పల నుంచి నగదు బ్యాగును బలవంతంగా లాక్కుని ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఇక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయనందున నిందితులను ఇంతవరకు గుర్తించలేకపోయామని ఏసీపీ పేర్కొన్నారు. అదుపులో నగదు, నిందితులు? నగదు అపహరణకు గురైన తరువాత నాలుగు టీంలుగా దిగిన నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటి ద్వారా నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులను నిందితులుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులతోపాటు సుమారు రూ.కోటి నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ ఆగడం
హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నారాయణగూడ మేల్కోటే పార్కు వద్ద చోటు చేసుకుంది. విద్యార్థినిని బలవంతంగా ఆటో ఎక్కించుకునేందుకు ఆటోడ్రైవర్ ప్రయత్నించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో నంబరు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోకిరీల ఆగడాలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఆ రెండు హుక్కా సెంటర్లపై దాడులు
హిమాయత్‌నగర్: పోలీసుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నారాయణగూడ ఠాణా పరిధిలో కొనసాగుతున్న రెండు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. సీఐ భీమ్‌రెడ్డి ఎస్సై నాగార్జునరెడ్డి కథనం ప్రకారం... నగరంలో హుక్కా సెంటర్లపై నిషేధం ఉంది. అయితే, స్టేషన్ పరిధిలో ఫిల్టర్ హుక్కా–స్నూకర్ పాయింట్, అక్స్ హుక్కాసెంటర్– స్నూకర్ పాయింట్ల పేరిట రెండు హుక్కా సెంటర్లను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ రెండు సెంటర్లపై దాడి చేశారు. అక్రమంగా నిర్వహించడమే కాకుండా మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. రెండు సెంటర్లలో ఆ సమయమంలో హుక్కా సేవిస్తున్న 8 మంది బాలురను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, హుక్కా సెంటర్ల నిర్వాహకులు నోమాన్, పి.అభివన్లను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.