సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) చెందిన భారీ మొత్తాన్ని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జారీ చేసిన సెల్ఫ్ చెక్ ద్వారా డ్రా అయిన రూ.8 కోట్లును టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి అంగీకరించిన బ్యాంకు మేనేజర్‌ను సైతం ప్రశ్నిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులూ దృష్టి పెట్టారు. ఈ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి నగదు అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ, పక్కా సమాచారం ఆధారంగా దాడులు చేసి నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం వరుసగా బ్యాంకులకు సెలవు రావడంతో సోమవారం భారీ స్థాయిలో లావాదేవీలు జరిగే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసుల అనుమానించారు. దీంతో నగరంలోని అనేక బ్యాంకుల వద్ద మాటు వేసి అక్కడ జరిగే లావాదేవీలను డేగ కంటితో పరిశీలించారు.
ఈ నేపథ్యంలోనే ఓ వెర్నా కారు (ఏపీ 10 బీఈ 1234) నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు డబ్బుతో వెళ్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేసింది. అందులో ఉన్న రూ.2 కోట్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని తోతిరెడ్డి ప్రదీప్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్ గుండు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ డబ్బును తనకు నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ వద్ద నందిరాజు గోపి అనే వ్యక్తి అప్పగించినట్లు బయటపెట్టారు. అతడి వద్ద మరికొంత మొత్తం ఉందనీ వెల్లడించాడు. దీంతో సదరు బ్యాంక్ వద్దకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో రూ.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నందిరాజు గోపీతో పాటు జి.సుకుమార్‌రెడ్డి, ఎస్.చలపతిరాజు, జె.ఇందు శేఖర్‌రావు ఆర్.బ్రహ్మంలను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నందిరాజు గోపి, ఎస్ చలపతిరావును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు బయటపడింది. మిగిలిన ఐదుగురిలో ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్, వ్యాపారులు ఉన్నారు. గోపి, చలపతిరావుల్ని ప్రశ్నించిన పోలీసులు వారి వద్ద ఉన్న రూ.8 కోట్ల చెక్కునకు సంబంధించిన జిరాక్సు ప్రతిని స్వాధీనం చేసుకున్నారు. దానిపై ‘సెల్ఫ్’ అని రాసి, లక్ష్మణ్ సంతకం ఉండటాన్ని గుర్తించారు. నగదుతో పాటు ఏడుగురినీ నారాయణగూడ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉంటుంది. దీని ప్రకారం రూ.2 లక్షలకు మించి బ్యాంకు నుంచి డ్రా చేయడానికి, రూ.50 వేలకు మించి తరలించడానికి ఆస్కారం లేదు. అయితే సెల్ఫ్ చెక్‌పై రూ.8 కోట్లు డ్రా చేసుకోవడానికి అంగీకరించి. ఆ మొత్తాన్ని అందించిన ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సైతం ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా (నెం.406743774) భారతీయ జనతా పార్టీ పేరుతో ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి సెల్ఫ్ చెక్ (నెం.059198) ఇచ్చిన లక్ష్మణ్ పైనా కేసు నమోదు చేయడానికి పోలీసులు యోచిస్తున్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితుల్లోనూ రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేయడానికి ఆస్కారం లేదు. అలాంటిది ఎన్నికల సీజన్‌లో, పోలింగ్ సమీపిస్తుండగా ఈ డబ్బును ఎందుకు డ్రా చేశారు?. ఎక్కడకు తరలిస్తున్నారు?. అనే అంశాలను గుర్తించడంపై పోలీసులు దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment