North Zone police
-
'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..
సాక్షి, హైదరాబాద్: బట్టతలను కవర్‌చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని మోసం చేశాడో యువకుడు. వివరాల్లోకెళ్తే.. కార్తీక్ వర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. తనకు వివాహం కాలేదంటూ సోషల్ మీడియాలో కార్తీక్ వర్మ విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. ఆ ఫొటోలను చూసి చాలా మంది అమ్మాయిలు అతని వల్లో పడ్డారు. వీరితో కొద్దికాలం సన్నిహితంగా ఉండేవాడు. చదవండి: (కాంట్రాక్ట్ ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. భరించలేక చివరికి..) అనంతరం యువతుల ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బయపెడుతూ వారి వద్ద నుంచి డబ్బులు లాగేవాడు. అలా ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంది అమ్మాయిలనుమోసం చేశాడు. తాజాగా కూకట్‌పల్లిలో కూడా ఓ అమ్మాయితో చనువుగా ఉంటూ ఇలానే డబ్బులు లాగేసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న నార్త్‌జోన్ పోలీసులు కార్తీక్ వర్మను అరెస్ట్ చేశారు. అతడిపై పీడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులు మచ్చేందర్, రాజేష్, సంతోష్, జయంత్‌ల నుంచి పదోతరగతికి చెందిన 13 నకిలీ మెమోలు, ఓ లాప్ టాప్, పోస్టల్ డిపార్ట్ మెంట్‌కు చెందిన నకిలీ పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారి మచ్చేందర్ నుంచి జయంత్ గతంలో నకిలీ సర్టిఫికేట్లు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించి జయంత్ పోస్టల్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం పొందాడు. కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం గాంధీ నగర్ పోలీసులకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. -
నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం
-
బీజేపీకి చెందిన రూ.8 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) చెందిన భారీ మొత్తాన్ని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జారీ చేసిన సెల్ఫ్ చెక్ ద్వారా డ్రా అయిన రూ.8 కోట్లును టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి అంగీకరించిన బ్యాంకు మేనేజర్‌ను సైతం ప్రశ్నిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులూ దృష్టి పెట్టారు. ఈ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి నగదు అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తూ, పక్కా సమాచారం ఆధారంగా దాడులు చేసి నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం వరుసగా బ్యాంకులకు సెలవు రావడంతో సోమవారం భారీ స్థాయిలో లావాదేవీలు జరిగే అవకాశం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసుల అనుమానించారు. దీంతో నగరంలోని అనేక బ్యాంకుల వద్ద మాటు వేసి అక్కడ జరిగే లావాదేవీలను డేగ కంటితో పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ వెర్నా కారు (ఏపీ 10 బీఈ 1234) నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు డబ్బుతో వెళ్తున్నట్లు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని బృందం ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేసింది. అందులో ఉన్న రూ.2 కోట్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని తోతిరెడ్డి ప్రదీప్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్ గుండు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌రెడ్డిని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ డబ్బును తనకు నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ వద్ద నందిరాజు గోపి అనే వ్యక్తి అప్పగించినట్లు బయటపెట్టారు. అతడి వద్ద మరికొంత మొత్తం ఉందనీ వెల్లడించాడు. దీంతో సదరు బ్యాంక్ వద్దకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో రూ.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నందిరాజు గోపీతో పాటు జి.సుకుమార్‌రెడ్డి, ఎస్.చలపతిరాజు, జె.ఇందు శేఖర్‌రావు ఆర్.బ్రహ్మంలను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నందిరాజు గోపి, ఎస్ చలపతిరావును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు బయటపడింది. మిగిలిన ఐదుగురిలో ఉద్యోగులు, ఈవెంట్ మేనేజర్, వ్యాపారులు ఉన్నారు. గోపి, చలపతిరావుల్ని ప్రశ్నించిన పోలీసులు వారి వద్ద ఉన్న రూ.8 కోట్ల చెక్కునకు సంబంధించిన జిరాక్సు ప్రతిని స్వాధీనం చేసుకున్నారు. దానిపై ‘సెల్ఫ్’ అని రాసి, లక్ష్మణ్ సంతకం ఉండటాన్ని గుర్తించారు. నగదుతో పాటు ఏడుగురినీ నారాయణగూడ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) అమలులో ఉంటుంది. దీని ప్రకారం రూ.2 లక్షలకు మించి బ్యాంకు నుంచి డ్రా చేయడానికి, రూ.50 వేలకు మించి తరలించడానికి ఆస్కారం లేదు. అయితే సెల్ఫ్ చెక్‌పై రూ.8 కోట్లు డ్రా చేసుకోవడానికి అంగీకరించి. ఆ మొత్తాన్ని అందించిన ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సైతం ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు బ్యాంకు ఖాతా (నెం.406743774) భారతీయ జనతా పార్టీ పేరుతో ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తం డ్రా చేయడానికి సెల్ఫ్ చెక్ (నెం.059198) ఇచ్చిన లక్ష్మణ్ పైనా కేసు నమోదు చేయడానికి పోలీసులు యోచిస్తున్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితుల్లోనూ రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేయడానికి ఆస్కారం లేదు. అలాంటిది ఎన్నికల సీజన్లో, పోలింగ్ సమీపిస్తుండగా ఈ డబ్బును ఎందుకు డ్రా చేశారు?. ఎక్కడకు తరలిస్తున్నారు?. అనే అంశాలను గుర్తించడంపై పోలీసులు దృష్టి పెట్టారు. -
మార్చి.. ఏమార్చి
సాక్షి, హైదరాబాద్ : అర్హత, అవకాశం లేకున్నా స్టడీ, విజిట్, బిజినెస్, నివాసం కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారి పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేసి వీసా ప్రాసెసింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాన్సులేట్ల వద్ద ఇమ్మిగ్రేషన్ డేటా అందుబాటులో ఉండదనే చిన్న లూప్‌హోల్‌ను క్యాష్ చేసుకున్న ఈ గ్యాంగ్ ఏడాదిలో దాదాపు 450 వీసాలు ప్రాసెసింగ్ చేసి రూ.కోటి వరకు అక్రమార్జన చేసిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠా కెనడా, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ కాన్సులేట్లను మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జైల్లో దొరికిన లింకుతో... హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీముద్దీన్ 2010లో సైదాబాద్‌లోని సన ప్యాలెస్‌లో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం ఇదే నేరంలో లంగర్‌హౌస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇదే నగర నేర పరిశోధన విభాగం అధికారులు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని వేరే కేసులో రిమాండ్‌కు తరలించారు. ఇతని ద్వారా రహీముద్దీన్‌కు చెన్నై రాయపురం ప్రాంతానికి చెందిన, పాస్‌పోర్టుల ట్యాంపర్‌లో నిపుణుడైన మహ్మద్ షేక్ ఇలియాస్ పరిచయమయ్యాడు. రహీముద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి ఇలియాస్‌తో కలసి కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. తమ ముఠాలో గోల్కొండకు చెందిన ఖాలిద్ ఖాన్, టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ ఒమ్రాన్, ఫలక్‌నుమా వాసి మహ్మద్ జహీరుద్దీన్‌ను కలుపుకున్నారు. ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’ఖరీదు... కాలం చెల్లిన పాస్‌పోర్టులతో పాటు ఇతర దేశాల్లో రిజెక్ట్ స్టాంప్ పడిన వాటిని దళారుల నుంచి ఈ గ్యాంగ్ రూ.5 వేలిచ్చి ఖరీదు చేసేది. పైన ఉండే కవర్, ఇతర సెక్యూరిటీ ఫీచర్స్‌ను వాడుకునేవారు. వీసా ప్రాసెసింగ్ కోసం పాస్‌పోర్టుల్ని ట్యాంపర్ చేసే ఈ గ్యాంగ్ అనుబంధ పత్రాలైన బ్యాంకు స్టేట్మెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్స్, ఐటీ రిటర్న్స్, ప్రాపర్టీ వాల్యూషన్ సర్టిఫికెట్లు లాంటి ఫామ్స్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు తయారు చేసేవారు. చెత్తబజార్‌లో సుప్రీం గ్రాఫిక్స్ నిర్వహించే ఒమ్రాన్ కొంత కమీషన్ తీసుకుని ఈ బాధ్యతలు నిర్వహించేవాడు. వీరికి అవసరమైన స్టాంపుల్ని మహ్మద్ జహీరుద్దీన్ తయారు చేసి అందించేవాడు. పాస్‌పోర్ట్‌ల ట్యాంపర్ ఇలా... జమ్మూకశ్మీర్, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాలతో పాటు ఇంకొందరికి అమెరికా, కెనడా తదితర దేశాలతో పాటు యూరప్ దేశాల వీసాలు లభించవు. ఇలాంటి వారు దళారుల ద్వారా రహీముద్దీన్‌ను సంప్రదించేవారు. వారి నుంచి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసి పాస్‌పోర్ట్ ట్యాంపరింగ్‌కు శ్రీకారం చుట్టేవాడు. ఇందులో భాగంగా ఆయా పాస్‌పోర్ట్‌లకు చెందిన వ్యక్తి వివరాలు ఉండే మొదటి, చివరి పేజీలను అట్టతో సహా వేరు చేసేవారు. సదరు వ్యక్తులకు ఆయా దేశాల వీసాలు రావాలంటే అక్కడకు గతంలో వెళ్లి వచ్చినట్లో, శాశ్వత నివాసి అయినట్లో ఆధారాలు చూపాలి. దీని కోసం రహీముద్దీన్ గ్యాంగ్ దళారుల నుంచి ఖరీదు చేసిన ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’కు చెందిన మొదటి, ఆఖరి పేజీలను వాడుతోంది. ఆఖరి పేజీలో మాత్రం సదరు పాస్‌పోర్ట్ లండన్, లేదా అమెరికాలో రీ–ఇష్యూ అయినట్లు పొందుపరుస్తున్నారు. సాధారణంగా ఆ దేశంలో పాస్‌పోర్ట్ పోయినా, ఎక్స్‌పైరైనా అక్కడి భారత రాయబార కార్యాలయాలు ఇలా రీ–ఇష్యూ చేస్తాయి. ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ లోపల కూడా ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’నుంచి తీసిన పేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై ఆయా దేశాల వీసాతో భారత్‌లోకి వచ్చినట్లు బోగస్ ఇమ్మిగ్రేషన్ స్టాంపులు వేస్తున్నారు. ఇలా ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ ఆధారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి వీసా కోసం కాన్సులేట్లకు దరఖాస్తు చేస్తున్నారు. వీటి వద్ద పాస్‌పోర్ట్‌ల డేటా ఉంటున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ డేటా ఉండట్లేదు. దీంతో పాస్‌పోర్ట్ నంబర్ ఆధారంగా చెక్ చేస్తే ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించలేకపోతున్నారు. ఆయా దేశాలకు వెళ్లిరాలేదని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న కాన్సులేట్ అధికారులు వీసా జారీ చేస్తున్నారు. పంపే ముందు పాతవి పెట్టేసి... వీసా పొందిన వారు ఆయా దేశాలకు ప్రయాణించాలంటే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోగస్ ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులున్న పాస్‌పోర్ట్‌తో వెళితే ఇమ్మిగ్రేషన్‌కు చిక్కే అవకాశం ఉంటుంది. దీంతో రహీముద్దీన్ గ్యాంగ్ వీసా వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి చెందిన ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్‌లో ముందు తొలగించినవి పెట్టేస్తూ, అదనంగా జోడించిన స్టాంపులతో కూడిన పేజీలను తీసేస్తున్నారు. ఇలా పాస్‌పోర్ట్ మళ్లీ మొదటి స్థితికే వచ్చేస్తోంది. ఈ పని చేసిన తర్వాత రహీముద్దీన్ ఒక్కొక్కరి నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి ముఠా సభ్యులకు పంచుతున్నాడు. ఈ వీసాలతో ఇతర దేశాలకు వెళ్తున్న వారిలో కొంతమంది దొరికేసి డిపోర్టేషన్‌పై వస్తున్నారు. ఇలా ఏడాదిలో రూ.కోటి సంపాదించిన రహీముద్దీన్ అల్వాల్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్, షహీన్‌నగర్‌లో ఇల్లు, షాద్‌నగర్‌లో ప్లాట్ కొనుగోలు చేశాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వరుస దాడులు చేసి రహీముద్దీన్ సహా ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 150 రబ్బర్ స్టాంపులు, 80 పాస్‌పోర్టులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. -
వ్యభిచార దందా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర మండల పరిధిలోని కార్ఖానాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిర్వాహకుల సహా నలుగురిని అరెస్టు చేశామని, ఒడిశాకు చెందిన ఓ యువతిని రెస్క్యూ చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన లక్ష్మి వ్యభిచార దందా నిర్వహిస్తోంది. ఈమెతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రాజమండ్రికి చెందిన విజయకుమారి హైదరాబాద్‌కు మకాం మార్చి, కార్ఖానాలోని రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన శంకర్‌తో కలిసి దందా ప్రారంభించింది. దళారుల సాయంతో వారానికి రూ.10 వేలు చెల్లిస్తూ ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తోంది. వీరు ఇటీవలే ఒడిస్సా నుంచి ఓ యువతిని తీసుకువచ్చారు. దీనిపై సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం ఫ్లాట్‌పై దాడి చేశారు. నిర్వాహకులు విజయకుమారి, శంకర్‌లతో పాటు, విటులు విజయ్, దీపక్‌లను అరెస్టు చేసి యువతిని రెస్క్యూ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కార్ఖానా పోలీసులకు అప్పగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో.. నాచారం: రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై నాచారం పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన మల్లిఖార్జున్ హబ్సిగూడలోని హరిప్రియా కాంప్లెక్స్‌లో శ్రీ సుధా రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. కాసోజు సుధా అలియాస్ ఫాతిమాతో కలిసి గత కొన్ని రోజులుగా ఆన్లైన్ ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. వీరు ముంబాయి నుండి అమ్మాయిలను తీసుకువచ్చినట్లు సమాచారం అందడంతో నాచారం పోలీసులు దాడి చేసి నిర్వాహకులు మల్లిఖార్జున్, ఫాతిమాలతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి తెలిపారు. -
అలీ బాబా.. డజను దొంగలు!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఘరానా దొంగలు.. మొదటి చోరుడి తల్లిదండ్రులు, అన్న, అక్క, చెల్లి.. రెండో దొంగ అక్క, తల్లి.. షెల్టర్ చూపించేందుకు కామన్ ఫ్రెండ్.. చోరీ సొత్తు కొనేందుకు ఇద్దరు రిసీవర్లు.. ఇలా ఏర్పడిన 12 మంది సభ్యుల ముఠా. పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లను గుర్తించడం.. రాత్రికి కొల్లగొట్టడం.. ఈ ముఠా పని. ఇలా 2015 నుంచి రాష్ట్ర రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 34 దొంగతనాలు చేసింది. ఆరు కేజీల బంగారం, 18 కేజీల వెండి సహా రూ.3 కోట్ల విలువైన సొత్తును ఎత్తుకుపోయింది. ఈ ఘరానా దొంగల ముఠాను నార్త్‌జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరి నుంచి ఐదు కేజీల బంగారం, 12.5 కేజీల వెండి సహా రూ.2 కోట్ల విలువైన సొత్తు రికవరీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. చిన్నప్పటినుంచే.. మౌలాలికి చెందిన మహ్మద్ సద్దాం అలీ అలియాస్ ఇమ్రాన్, మోక పోతురాజు ఒకే ఏరియాలో ఉండేవాళ్లు. చిన్న వయసులో ఓ చెరువులో ఈత కొట్టడానికి వెళ్లేటప్పుడు ఇరువురికీ పరిచయం ఏర్పడింది. సద్దాం అన్న అన్వర్ వెల్డింగ్ షాపులో కొన్నాళ్లు ఇద్దరూ పని చేశారు. ఆ ఆదాయంతో తృప్తి చెందక చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2010లో మైనర్లుగా ఉన్నప్పుడే చోరబాట పట్టారు. మల్కాజ్గిరి పోలీసుస్టేషన్ పరిధిలో 4 దొంగతనాలు చేసి జైలుకెళ్లారు. 2013, 2015, 2016ల్లోనూ మల్కాజ్గిరి, కీసరల్లో చోరీలు చేసి పోలీసులకు చిక్కారు. ఇక్కడ నిఘా పెరగడంతో గతేడాది వరంగల్‌కు మకాం మార్చారు. అక్కడి ఆజంజాహి మిల్స్ కాలనీ, పర్వతగిరి, సుబేదారీ, పర్కాల్, హన్మకొండ, కాకతీయ వర్సిటీ, జనగాంల్లో వరుసగా 12 నేరాలు చేసి పట్టుబడ్డారు. దొంగతనానికి వీరు ధనవంతుల కాలనీలనే ఎంచుకుంటారు. పగలు బైక్‌పై తిరుగుతూ తాళం వేసున్న ఇళ్లను గుర్తిస్తారు. రాత్రికి అక్కడకు చేరుకుని వెనుక తలుపు లేదా కిటికీ పగులకొట్టి లోపలికి వెళతారు. ఒకరు కాపలా ఉండగా మరొకరు లోపలకు ప్రవేశించి ‘పని’పూర్తి చేస్తారు. సీసీ కెమెరాలు ఉంటే వాటి వైర్లు కత్తిరించడం లేదా డిజిటల్ వీడియో రికార్డర్‌ను ధ్వంసం చేయడం చేస్తుంటారు. ఒకే ప్రాంతంలో వరుసపెట్టి నేరాలు చేయాలని భావిస్తే అక్కడ ఓ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు. చోరీ సొత్తు సొమ్ము చేసేది కుటుంబీకులే.. వీరిద్దరికీ కుటుంబీకుల పూర్తి ‘మద్దతు’ఉంది. చోరీ చేసి తీసుకువచ్చిన సొత్తును ఇమ్రాన్ తల్లి సలీమబేగం, తండ్రి ఖాసింఅలీ, అక్క ఆసియా, అన్న అన్వర్, చెల్లి నజియాబేగంతో పాటు పోతురాజు సోదరి మమత, అతడి తల్లి దాచిపెట్టడం, అదనుచూసి విక్రయించడం చేసేవారు. మల్కాజ్గిరి, కవాడిగూడ ప్రాంతాలకు చెందిన చంద్రకాంత్మోహితే, బాపుఆనంద్అర్జున్లకు చోరీ సొత్తు అమ్మి సొమ్ము చేసుకునేవారు. ఇమ్రాన్, పోతురాజుల స్నేహితుడు మహ్మద్రుస్తుం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసేవాడు. అమ్మిన సొత్తుతో సఫిల్‌గూడ ప్రాంతంలో ఆసియాబేగం పేరుతో ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, నాలుగు ద్విచక్ర వాహనాలు ఖరీదు చేశారు. ఇంట్లోకి అవసరమైన గృహోపకరణాలు సమకూర్చుకున్నారు. రూ.2 కోట్ల సొత్తు రికవరీ... ఈ ముఠా కదలికలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి బేగంపేట ఏసీపీ ఎస్.రంగారావు నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇమ్రాన్, పోతురాజులను ఈ బృందం అదుపులోకి తీసుకుంది. వీరి వేలిముద్రలను ‘పాపిల్లన్ సాఫ్ట్వేర్’లో పరిశీలించగా.. ఓయూ పరిధిలో ఓ నేరస్థలంలో దొరికిన వాటితో సరిపోలాయి. లోతుగా విచారించగా.. 2015 నుంచి చేసిన 34 చోరీలతో పాటు సహకరిస్తున్న కుటుంబీకులు, రిసీవర్లు, షెల్టర్ ఇచ్చిన వ్యక్తి వివరాలు బయటపెట్టాడు. ప్రత్యేక బృందాలు పోతురాజు తల్లి మినహా మిగిలిన పది మందినీ పట్టుకున్నారు. 12 మందినీ అరెస్టు చేసి.. వీరి నుంచి ఐదు కేజీల బంగారు ఆభరణాలు, 12.5 కేజీల వెండి వస్తువులు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, ఫ్లాట్ డాక్యుమెంట్లు రికవరీ చేశారు. వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. మానసికంగా సమస్య ఎదుర్కొంటున్న మరో సోదరుడు షౌకత్‌అలీని ఇమ్రాన్ చోరీల కోసం ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి 34 కేసుల్లో షౌకత్ ప్రమేయం లేదని నిర్ధారించారు. ఈ ముఠాను పట్టుకున్న అధికారులకు పోలీసు కమిషనర్ ప్రత్యేక రివార్డులు అందించారు. -
కత్తులతో ఫోజులిచ్చి కటకటాల్లోకి!
సాక్షి, సిటీబ్యూరో: చట్ట విరుద్దమని తెలిసో తెలియకో వివిధ మార్గాల్లో డాగర్లుగా పిలిచే పదునైన కత్తులను సేకరించారు. వాటితో బర్త్‌డే పార్టీల్లో వాటితో ఫోజులిచ్చారు... ఈ చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు... ఈ విషయం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ వద్దకు చేరడంతో ముగ్గురు యువకులూ ప్రస్తుతం కటకటాల్లోకి వెళ్లారు. ఒకరిని పంజగుట్ట, ఇద్దరిని బోయిన్పల్లి పరిధిల్లో పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన రాహుల్ ప్రకాష్ ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తుంటాడు. గతేడాది నవంబర్‌లో ఈ–కామర్స్ సైట్ స్నాప్‌డీల్ ద్వారా రూ.999 వెచ్చించి ఓ డాగర్ ఖరీదు చేశాడు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసే న్యూ బోయిన్పల్లి వాసి సాయి యాదవ్, ఓ హోటల్లో పని చేస్తున్న అల్వాల్‌కు చెందిన అర్జున్ దాస్ స్నేహితులు. అర్జున్ దాస్ కొన్నాళ్ళ క్రితం సికింద్రాబాద్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి డాగర్ ఖరీదు చేసి తన వద్ద ఉంచుకున్నాడు. దీనిని ఇటీవల సాయి యాదవ్ తీసుకున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారం ఇంత వరకు గుట్టుగానే ఉన్నా... ఇటీవల జరిగిన వేర్వేరు పుట్టిన రోజు పార్టీల్లో పాల్గొన్న రాహుల్, సాయి కత్తులతో ఫోటోలు దిగడంతో పాటు ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్ చేసుకున్నారు. ఇవి సోషల్‌మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. రాయదుర్గం ఉదంతంతో.. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో ఎంగేజ్మెంట్ బారాత్‌లో చేసిన కత్తి విన్యాసం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన ఈ ‘కత్తుల సంస్కృతి’ సిటీకి పాకడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా సోషల్‌మీడియాపై నిఘా ఉంచిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి రాహుల్, సాయిలు పోస్ట్ చేసిన ఫొటోలు వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ శుక్రవారం వలపన్ని వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు పరిశీలించగా నిబంధనలకు విరుద్ధమని, అక్రమాయుధాలుగా తేలింది. సాయి విచారణలో అర్జున్ పేరు వెలుగులోకి రావడంతో ముగ్గురినీ అరెస్టు చేశారు. 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్న, పదునైన అంచులతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం ఆయుధ చట్ట ప్రకారం నేరమని డీసీపీ రాధాకిషన్‌రావు స్పష్టం చేస్తున్నారు. వీటిని విక్రయిస్తున్న ఆన్లైన్ సంస్థలు, డెలివరీ చేస్తున్న కొరియర్ సంస్థలకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించామని, వారినీ విచారిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. -
నగరంలో రైస్ పుల్లింగ్ ముఠా
సాక్షి, హైదరాబాద్: నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. నార్త్ జోన్ పరిధిలో ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి రూ. 34 లక్షల నగదు, కారు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మైనర్లు పదిహేను మందే.. !
- 55 మందిని ఇంటికి పంపిన పోలీసులు - ఏజెంట్ల కోసం ఆరా సికింద్రాబాద్ : శనివారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 70 మంది కార్మికుల్లో పదిహేను మంది మాత్రమే మైనర్లుగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో 200 మంది బాలకార్మికులు వస్తున్నట్టు బాలల హక్కుల కమిషన్ ప్రతినిధులకు అదే రైలులోని ఓ ప్రయాణికుడు సమాచారం అందించారు. స్పందించిన కమిషన్ ప్రతినిధులు 150 మంది పోలీసుల సహకారంతో జన్మభూమి రైలులో వచ్చిన 70 మందిని అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చత్తీస్ఘడ్, ఒడిసా, బిహార్‌కు చెందిన వారంతా నగరంలోని దోమల మందు, ప్లాస్టిక్ వస్తువుల తయారీ కర్మాగారాల్లో పనిచేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఒక్కో బాలుడితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐదు నుంచి పదివేల వేతనానికి ఏడాది కాలం పనిచేసేందుకు తమను తమ తల్లిదండ్రులే ఏజెంట్ల ద్వారా ఇక్కడికి పంపినట్టు పలువురు బాలలు తెలిపారు. బాలకార్మికుల వద్ద అందుబాటులో ఉన్న ఆధార్‌కార్డుల ఆధారంగా పోలీసులకు పట్టుబడిన 55 మందికి 18 సంవత్సరాల వయసు దాటినట్టు గుర్తించారు. వారందరిని తమతమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందిగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. హోమ్‌కు 15 మంది.. పది హేను మంది బాలలను దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారంతో కూకట్‌పల్లిలోని ‘స్వధార్’ సంస్థకు చెందిన బాలల ఆశ్రమానికి తరలించారు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు స్వీకరించి వారికి సమాచారం అందించామని, వారిని నగరానికి రప్పించి బాలలను అప్పగిస్తామని డీసీపీ ప్రకాష్‌రెడ్డి చెప్పారు.