నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ పాస్‌పోర్టులను మీడియాకు చూపిస్తున్న అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్ : అర్హత, అవకాశం లేకున్నా స్టడీ, విజిట్, బిజినెస్, నివాసం కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారి పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేసి వీసా ప్రాసెసింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాన్సులేట్ల వద్ద ఇమ్మిగ్రేషన్ డేటా అందుబాటులో ఉండదనే చిన్న లూప్‌హోల్‌ను క్యాష్ చేసుకున్న ఈ గ్యాంగ్ ఏడాదిలో దాదాపు 450 వీసాలు ప్రాసెసింగ్ చేసి రూ.కోటి వరకు అక్రమార్జన చేసిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠా కెనడా, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ కాన్సులేట్‌లను మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జైల్లో దొరికిన లింకుతో...
హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీముద్దీన్ 2010లో సైదాబాద్‌లోని సన ప్యాలెస్‌లో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం ఇదే నేరంలో లంగర్‌హౌస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇదే నగర నేర పరిశోధన విభాగం అధికారులు చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని వేరే కేసులో రిమాండ్‌కు తరలించారు. ఇతని ద్వారా రహీముద్దీన్‌కు చెన్నై రాయపురం ప్రాంతానికి చెందిన, పాస్‌పోర్టుల ట్యాంపర్‌లో నిపుణుడైన మహ్మద్ షేక్ ఇలియాస్ పరిచయమయ్యాడు. రహీముద్దీన్ జైలు నుంచి బయటకు వచ్చి ఇలియాస్‌తో కలసి కొత్త దందాకు శ్రీకారం చుట్టాడు. తమ ముఠాలో గోల్కొండకు చెందిన ఖాలిద్ ఖాన్, టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ ఒమ్రాన్, ఫలక్‌నుమా వాసి మహ్మద్ జహీరుద్దీన్‌ను కలుపుకున్నారు.
‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’ఖరీదు...
కాలం చెల్లిన పాస్‌పోర్టులతో పాటు ఇతర దేశాల్లో రిజెక్ట్ స్టాంప్ పడిన వాటిని దళారుల నుంచి ఈ గ్యాంగ్ రూ.5 వేలిచ్చి ఖరీదు చేసేది. పైన ఉండే కవర్, ఇతర సెక్యూరిటీ ఫీచర్స్‌ను వాడుకునేవారు. వీసా ప్రాసెసింగ్ కోసం పాస్‌పోర్టుల్ని ట్యాంపర్ చేసే ఈ గ్యాంగ్ అనుబంధ పత్రాలైన బ్యాంకు స్టేట్‌మెంట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్స్, ఐటీ రిటర్న్స్, ప్రాపర్టీ వాల్యూషన్ సర్టిఫికెట్లు లాంటి ఫామ్స్‌ను ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు తయారు చేసేవారు. చెత్తబజార్‌లో సుప్రీం గ్రాఫిక్స్ నిర్వహించే ఒమ్రాన్ కొంత కమీషన్ తీసుకుని ఈ బాధ్యతలు నిర్వహించేవాడు. వీరికి అవసరమైన స్టాంపుల్ని మహ్మద్ జహీరుద్దీన్ తయారు చేసి అందించేవాడు.
పాస్‌పోర్ట్‌ల ట్యాంపర్ ఇలా...
జమ్మూకశ్మీర్, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాలతో పాటు ఇంకొందరికి అమెరికా, కెనడా తదితర దేశాలతో పాటు యూరప్ దేశాల వీసాలు లభించవు. ఇలాంటి వారు దళారుల ద్వారా రహీముద్దీన్‌ను సంప్రదించేవారు. వారి నుంచి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేసి పాస్‌పోర్ట్ ట్యాంపరింగ్‌కు శ్రీకారం చుట్టేవాడు. ఇందులో భాగంగా ఆయా పాస్‌పోర్ట్‌లకు చెందిన వ్యక్తి వివరాలు ఉండే మొదటి, చివరి పేజీలను అట్టతో సహా వేరు చేసేవారు. సదరు వ్యక్తులకు ఆయా దేశాల వీసాలు రావాలంటే అక్కడకు గతంలో వెళ్లి వచ్చినట్లో, శాశ్వత నివాసి అయినట్లో ఆధారాలు చూపాలి. దీని కోసం రహీముద్దీన్ గ్యాంగ్ దళారుల నుంచి ఖరీదు చేసిన ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’కు చెందిన మొదటి, ఆఖరి పేజీలను వాడుతోంది. ఆఖరి పేజీలో మాత్రం సదరు పాస్‌పోర్ట్ లండన్, లేదా అమెరికాలో రీ–ఇష్యూ అయినట్లు పొందుపరుస్తున్నారు. సాధారణంగా ఆ దేశంలో పాస్‌పోర్ట్ పోయినా, ఎక్స్‌పైరైనా అక్కడి భారత రాయబార కార్యాలయాలు ఇలా రీ–ఇష్యూ చేస్తాయి. ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ లోపల కూడా ‘సెకండ్ హ్యాండ్ పాస్‌పోర్ట్’నుంచి తీసిన పేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై ఆయా దేశాల వీసాతో భారత్‌లోకి వచ్చినట్లు బోగస్ ఇమ్మిగ్రేషన్ స్టాంపులు వేస్తున్నారు. ఇలా ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్ ఆధారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి వీసా కోసం కాన్సులేట్లకు దరఖాస్తు చేస్తున్నారు. వీటి వద్ద పాస్‌పోర్ట్‌ల డేటా ఉంటున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ డేటా ఉండట్లేదు. దీంతో పాస్‌పోర్ట్ నంబర్ ఆధారంగా చెక్ చేస్తే ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించలేకపోతున్నారు. ఆయా దేశాలకు వెళ్లిరాలేదని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న కాన్సులేట్ అధికారులు వీసా జారీ చేస్తున్నారు.
పంపే ముందు పాతవి పెట్టేసి...
వీసా పొందిన వారు ఆయా దేశాలకు ప్రయాణించాలంటే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోగస్ ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులున్న పాస్‌పోర్ట్‌తో వెళితే ఇమ్మిగ్రేషన్‌కు చిక్కే అవకాశం ఉంటుంది. దీంతో రహీముద్దీన్ గ్యాంగ్ వీసా వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి చెందిన ట్యాంపర్ చేసిన పాస్‌పోర్ట్‌లో ముందు తొలగించినవి పెట్టేస్తూ, అదనంగా జోడించిన స్టాంపులతో కూడిన పేజీలను తీసేస్తున్నారు. ఇలా పాస్‌పోర్ట్ మళ్లీ మొదటి స్థితికే వచ్చేస్తోంది. ఈ పని చేసిన తర్వాత రహీముద్దీన్ ఒక్కొక్కరి నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి ముఠా సభ్యులకు పంచుతున్నాడు. ఈ వీసాలతో ఇతర దేశాలకు వెళ్తున్న వారిలో కొంతమంది దొరికేసి డిపోర్టేషన్‌పై వస్తున్నారు. ఇలా ఏడాదిలో రూ.కోటి సంపాదించిన రహీముద్దీన్ అల్వాల్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్, షహీన్‌నగర్‌లో ఇల్లు, షాద్‌నగర్‌లో ప్లాట్ కొనుగోలు చేశాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డి వరుస దాడులు చేసి రహీముద్దీన్ సహా ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి 150 రబ్బర్ స్టాంపులు, 80 పాస్‌పోర్టులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment