కత్తులతో ఫోజులిచ్చి కటకటాల్లోకి! | north zone police arrest Illegal weapons young man | Sakshi
Sakshi News home page

కత్తులతో ఫోజులిచ్చి కటకటాల్లోకి!

Published Sat, Jan 27 2018 9:32 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

north zone police arrest Illegal weapons young man - Sakshi

రాహుల్‌,సాయి, అర్జున్‌,స్వాధీనం చేసుకున్న డాగర్లు

సాక్షి, సిటీబ్యూరో: చట్ట విరుద్దమని తెలిసో తెలియకో వివిధ మార్గాల్లో డాగర్లుగా పిలిచే పదునైన కత్తులను సేకరించారు. వాటితో బర్త్‌డే పార్టీల్లో వాటితో ఫోజులిచ్చారు... ఈ చిత్రాలను సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేశారు... ఈ విషయం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ వద్దకు చేరడంతో ముగ్గురు యువకులూ ప్రస్తుతం కటకటాల్లోకి వెళ్లారు. ఒకరిని పంజగుట్ట, ఇద్దరిని బోయిన్‌పల్లి పరిధిల్లో పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రాహుల్‌ ప్రకాష్‌ ఓ ఫైనాన్స్‌ సంస్థలో పని చేస్తుంటాడు. గతేడాది నవంబర్‌లో ఈ–కామర్స్‌ సైట్‌ స్నాప్‌డీల్‌ ద్వారా రూ.999 వెచ్చించి ఓ డాగర్‌ ఖరీదు చేశాడు. అలాగే కన్‌స్ట్రక్షన్‌ రంగంలో పని చేసే న్యూ బోయిన్‌పల్లి వాసి సాయి యాదవ్, ఓ హోటల్‌లో పని చేస్తున్న అల్వాల్‌కు చెందిన అర్జున్‌ దాస్‌ స్నేహితులు. అర్జున్‌ దాస్‌ కొన్నాళ్ళ క్రితం సికింద్రాబాద్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి డాగర్‌ ఖరీదు చేసి తన వద్ద ఉంచుకున్నాడు. దీనిని ఇటీవల సాయి యాదవ్‌ తీసుకున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారం ఇంత వరకు గుట్టుగానే ఉన్నా... ఇటీవల జరిగిన వేర్వేరు పుట్టిన రోజు పార్టీల్లో పాల్గొన్న రాహుల్, సాయి కత్తులతో ఫోటోలు దిగడంతో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్‌ చేసుకున్నారు. ఇవి సోషల్‌మీడియా ద్వారా వైరల్‌ అయ్యాయి. 

రాయదుర్గం ఉదంతంతో..
రాయదుర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ నెల మొదటి వారంలో  ఎంగేజ్‌మెంట్‌ బారాత్‌లో చేసిన కత్తి విన్యాసం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన ఈ ‘కత్తుల సంస్కృతి’ సిటీకి పాకడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా సోషల్‌మీడియాపై నిఘా ఉంచిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దృష్టికి రాహుల్, సాయిలు పోస్ట్‌ చేసిన ఫొటోలు వచ్చాయి. దీంతో ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్‌ శుక్రవారం వలపన్ని వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు పరిశీలించగా నిబంధనలకు విరుద్ధమని, అక్రమాయుధాలుగా తేలింది. సాయి విచారణలో అర్జున్‌ పేరు వెలుగులోకి రావడంతో ముగ్గురినీ అరెస్టు చేశారు. 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్న, పదునైన అంచులతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం ఆయుధ చట్ట ప్రకారం నేరమని డీసీపీ రాధాకిషన్‌రావు స్పష్టం చేస్తున్నారు. వీటిని విక్రయిస్తున్న ఆన్‌లైన్‌ సంస్థలు, డెలివరీ చేస్తున్న కొరియర్‌ సంస్థలకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించామని, వారినీ విచారిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement