Cryptocurrency: నకిలీ క్రిప్టో యాప్స్‌ దందా.. రూ.17 కోట్లు సీజ్‌ | Seize Money Fraudulently Through Fake Cryptocurrency App | Sakshi
Sakshi News home page

Cryptocurrency: నకిలీ క్రిప్టో యాప్స్‌ దందా.. రూ.17 కోట్లు సీజ్‌

Published Tue, Apr 19 2022 6:49 AM | Last Updated on Tue, Apr 19 2022 6:49 AM

Seize Money Fraudulently Through Fake Cryptocurrency App - Sakshi

బనశంకరి:  ప్రజల అమాయకత్వం, ఆశను అనువుగా చేసుకుని కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ముఠా చివరకు కటకటాల పాలైంది. త్వర­గా సంపన్నులు కావచ్చని వీరిని నమ్మిన వేలాది మందికి కడగండ్లే మిగిలాయి. క్రిప్టో కరెన్సీ పేరుతో మో­సాలకు పాల్పడుతున్న నలుగురు బడా నేరగాళ్లను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.17 కోట్ల నగదు, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ తెలిపా­రు. సోమవారం జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రమ­ణ్‌­గుప్తాతో కలిసి కమల్‌పంత్‌ మీడియాతో మాట్లాడారు.  

నకిలీ యాప్‌ల ద్వారా దందా..  
రమేశ్‌ ఉల్లాఖాన్, శీతల్‌ బస్త్వాడ్, ఇమ్రాన్‌ రియాజ్, జబీఉల్లాఖాన్‌ అనే నలుగురు 2021లో  కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో క్రిప్టో కరెన్సీ లాభాలతో పాటు క్రిప్టో మైనింగ్‌ యంత్రం ఇస్తామని ప్రజలకు వాట్సప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సంప్రదించేవారు. వీరందరూ కూడా కర్ణాటకకు చెందినవారే. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా షేర్‌ హ్యాశ్‌ అనే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోమనేవారు. దాని ద్వారా ప్రజల నుంచి నగదును పెట్టుబడి పెట్టించేవారు. తరువాత ఆ డబ్బును వివిధ నకిలీ కంపెనీల ఖాతాలకు మళ్లించేవారు. 2022 జనవరిలో షేర్‌హ్యాశ్‌ యాప్‌లో ఖాతాదారులకు లాగిన్‌ లోపం తలెత్తిందని తెలిపారు.

దీంతో షేర్‌హ్యాశ్‌ 2.0 యాప్‌ను మదుపుదారులతో డౌన్‌లోడ్‌ చేయించారు. ఆ యాప్‌ కూడా పనిచేయలేదు. కంపెనీ సిబ్బందిని సంప్రదిస్తే సమాధానం రాలేదు. దీంతో తమ డబ్బు ఇరుక్కుపోవడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న సుమారు రూ.17 కోట్లను సీజ్‌ చేశారు. 1.6 కేజీల బంగారు నగలు, రూ.70 లక్షల నగదును, కొన్ని మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీసీపీ శరణప్ప పాల్గొన్నారు. 

ఇది చదవండి: కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement