fake agency
-
పాన్ అప్డేట్ అంటూ సందేశాలు.. క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా!
ఆధార్ అప్డేట్, పాన్ కార్డు అప్డేట్ వంటివి వినియోగదారులు ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది అప్డేట్ యువర్ పాన్ అనే సందేశంతో కొన్ని ఫేక్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై క్లిక్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశిస్తోంది. గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో కొన్ని ఫేక్ మెసేజిలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇవి నకిలీ సందేశాలైనప్పటికీ @TheOfficialSBI అనే పేరుతో రావడం గమనార్హం. ఇందులో మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందని ఉంటుంది. దీనికి భయపడి కొంతమంది దానిపైన క్లిక్ చేసి సైబర్ దాడులకు బలైపోతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలపై ఎవరూ క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. SBI ఎప్పుడూ మీ పర్సనల్ డీటైల్స్, అకౌంట్ వివరాలు సందేశాల ద్వారా అడగదు, కావున వినియోగదారుడు తప్పకుండా వీటిని గమనించి జాగ్రత్త వహించాలి. ఇదిలా ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కూడా ఫేక్ మెసేజస్ వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్‌ల ప్రీ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్లుగా ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపించలేదని, దానికి ఎవరూ స్పందించవద్దని అధికారులు చెబుతున్నారు. A #Fake message issued in the name of @TheOfficialSBI is asking recipients to update their PAN on a suspicious link to prevent their account from getting expired.#PIBFactCheck ✅ Beware of such frauds. ✅ SBI never sends emails/SMS asking for personal/banking details. pic.twitter.com/1u8tFywQcf — PIB Fact Check (@PIBFactCheck) March 24, 2023 -
Cryptocurrency: నకిలీ క్రిప్టో యాప్స్ దందా.. రూ.17 కోట్లు సీజ్
బనశంకరి: ప్రజల అమాయకత్వం, ఆశను అనువుగా చేసుకుని కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ముఠా చివరకు కటకటాల పాలైంది. త్వరగా సంపన్నులు కావచ్చని వీరిని నమ్మిన వేలాది మందికి కడగండ్లే మిగిలాయి. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు బడా నేరగాళ్లను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.17 కోట్ల నగదు, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. సోమవారం జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్గుప్తాతో కలిసి కమల్‌పంత్ మీడియాతో మాట్లాడారు. నకిలీ యాప్‌ల ద్వారా దందా.. రమేశ్ ఉల్లాఖాన్, శీతల్ బస్త్వాడ్, ఇమ్రాన్ రియాజ్, జబీఉల్లాఖాన్ అనే నలుగురు 2021లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిప్టో కరెన్సీ లాభాలతో పాటు క్రిప్టో మైనింగ్ యంత్రం ఇస్తామని ప్రజలకు వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా సంప్రదించేవారు. వీరందరూ కూడా కర్ణాటకకు చెందినవారే. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా షేర్ హ్యాశ్ అనే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోమనేవారు. దాని ద్వారా ప్రజల నుంచి నగదును పెట్టుబడి పెట్టించేవారు. తరువాత ఆ డబ్బును వివిధ నకిలీ కంపెనీల ఖాతాలకు మళ్లించేవారు. 2022 జనవరిలో షేర్‌హ్యాశ్ యాప్‌లో ఖాతాదారులకు లాగిన్ లోపం తలెత్తిందని తెలిపారు. దీంతో షేర్‌హ్యాశ్ 2.0 యాప్‌ను మదుపుదారులతో డౌన్లోడ్ చేయించారు. ఆ యాప్ కూడా పనిచేయలేదు. కంపెనీ సిబ్బందిని సంప్రదిస్తే సమాధానం రాలేదు. దీంతో తమ డబ్బు ఇరుక్కుపోవడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న సుమారు రూ.17 కోట్లను సీజ్ చేశారు. 1.6 కేజీల బంగారు నగలు, రూ.70 లక్షల నగదును, కొన్ని మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీసీపీ శరణప్ప పాల్గొన్నారు. ఇది చదవండి: కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం -
నకిలీ వ్యాపార ప్రకటనలను నమ్మొద్దు: రామ్రాజ్ కాటన్
హైదరాబాద్: తమ సంస్థ పేరుకు కళంకం తెచ్చే కళంకం దురుద్దేశంతో కొందరు గతవారం నుంచి ఆన్లైన్ ద్వారా నకిలీ వ్యాపార ప్రకటనలను చేస్తున్నారని రామ్రాజ్ కాటన్ సంస్థ ఆరోపించింది. అలాంటి మోసపూరిత నకిలీ వార్తలను నమ్మొద్దని కస్టమర్లను కంపెనీ కోరింది. ‘‘కొంతమంది రామ్రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో వాట్సప్ యాప్ ద్వారా కొన్ని లింకులను అందిస్తూ క్రిస్మస్, కొత్త ఏడాది ఆఫర్ బహుమతిగా రూ.20,000 లభిస్తాయనే అనే వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. కస్టమర్లు ఈ మోసపూరిత లింకులను నమ్మి ఓపెన్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక పరమైన నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇటువంటి సమాచారాన్ని పంచుకోవద్దు. వ్యాప్తి చేయవద్దు’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మోసగాళ్లను వెదికి పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. -
నకిలీ సంఘాల దొంగాట..
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ క్రీడా సంఘాలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటలాడిస్తామంటూ ఆశ చూపించే కేటుగాళ్లు.. ట్రస్టులను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటూ.. గుర్తింపు లేని ఆటలు ఆడిస్తూ ఆటను వ్యాపారంగా మారుస్తున్నారీ బడా బాబులు. జాతీయ స్థాయిలో తమ సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందంటూ.. భారత క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం అనుమతి ఉందని నమ్మబలుకుతూ ఏటా లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి నకిలీ సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర, జాతీయ క్రీడా సంఘాలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి, ఖమ్మం: జిల్లాలోని నకిలీ క్రీడా సంఘాలు ఆటల పేరుతో అమాయక క్రీడాకారులను దోపిడీ చేస్తున్నాయి. జాతీయస్థాయిలో ఏర్పాటైన క్రీడా సంఘం తొలుత రాష్ట్రస్థాయిలో తమకు అనువైన క్రీడాంశానికి సంబంధించిన సీనియర్ క్రీడాకారులతో పరిచయం పెంచుకుని.. రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి.. తర్వాత జిల్లాస్థాయిలో సంఘ ఏర్పాటుకు పూనుకుంటుంది. జిల్లాలో ఏర్పాటైన క్రీడా సంఘం బాధ్యులు.. పేరున్న జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మాయమాటలు చెప్పి పావులుగా వాడుకుంటున్నారు. అయితే తమ సంఘం ద్వారా అందించే సర్టిఫికెట్లు క్రీడాకారులకు పనికి రావని రాష్ట్ర, జాతీయ సంఘం బాధ్యులకు మాత్రం తెలుసు. జిల్లాస్థాయి బాధ్యులకు ఆ విషయం తెలియనీయకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తీరా తెలిశాక వారితోపాటు మోసపోయిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏటా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు క్రీడాకారులను తీసుకెళ్తున్నామని.. తామే ఖర్చులు భరించి.. తమ సంస్థ ద్వారా ఎంతో మందిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దామని మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులతోపాటు అర్హత లేని వారిని భారత జట్టుకు ఎంపిక చేసి.. వారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. అవగాహన లేని వారికే.. సంబంధిత క్రీడ పట్ల అవగాహన లేని వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తీసుకెళ్లి.. అక్కడ ఒకటో రెండో మ్యాచ్‌లు తూతూ మంత్రంగా ఆడించి తిరిగి ఇంటికి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 29 క్రీడా సంఘాలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. ఇందులోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వారున్నారంటే వేళ్లమీద లెక్కించొచ్చు. అదే నకిలీ క్రీడా సంఘాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారి సంఖ్య కూడా జిల్లాలో గణనీయంగానే ఉంది. కొన్ని క్రీడా సంస్థలు క్రీడలపై అవగాహన లేని వారికి మాయమాటలు చెప్పి.. టోర్నీలో పాల్గొంటే మంచి భవిష్యత్ ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇందులో సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉండడం గమనార్హం. మీడియా కంట పడకుండా నకిలీ క్రీడా సంఘాల నిర్వాహకులు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులకు ఆశ చూపించి.. మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా.. నకిలీ క్రీడా సంస్థలు ఢిల్లీ, హర్యాన, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. నకిలీ క్రీడా సంఘం ముసుగులో దోపిడీ జరుగుతుందనే దానికి జిల్లాలో జరిగిన పలు సంఘటనలే నిదర్శనం. పాఠశాల స్థాయిలో ఆడుతున్న ఓ క్రీడాకారుడు నకిలీ క్రికెట్ సంస్థ వలలో చిక్కుకున్నాడు. అతడిని శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ సరదాగా ఒక మ్యాచ్ ఆడించి.. నిర్వాహకులు తయారు చేసిన అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ను సదరు క్రీడాకారుడికి ఇచ్చారు. అంతేకాక ఆ క్రీడాకారుడి వద్ద నుంచి రూ.లక్ష వరకు నిర్వాహకులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు స్పాన్సర్ల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా లండన్, నేపాల్‌కు పలువురు క్రికెటర్లను తీసుకెళ్లి ఇలాగే డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. నగరంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడిని నేపాల్ దేశంలో అంతర్జాతీయ కబడ్డీ పోటీలు ఉన్నాయని, ఇది అధికారిక సంఘం తరఫున జరుగుతుందని చెప్పి నమ్మించారు. దీంతో ఈ క్రీడాకారుడు తనతోపాటు మరో పది మంది క్రీడాకారులను ఈ వలలో చిక్కుకునేలా చేశాడు. ఇదంతా నమ్మిన వారి తల్లిదండ్రులు నిర్వాహకుల మాటలు నమ్మి వేలాది రూపాయలు చెల్లించగా.. తీరా వారిచ్చిన సర్టిఫికెట్ల నకిలీవని తేలడంతో నోరెళ్లబెట్టారు. నగరంలోని బూర్హన్పురానికి చెందిన చిరు వ్యాపారికి ఇద్దరు పిల్లలు. ఉన్నట్టుండి పరిచయమైన ఓ వ్యక్తి క్రీడారంగంలో అత్యున్నత అవకాశాలు ఉన్నాయని, తమ క్రీడా సంఘం ద్వారా ఆడిస్తే సర్టిఫికెట్లు రావడంతోపాటు పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మబలికాడు. ముందుగా రూ.25వేలు తీసుకుని పిల్లాడిని తమ వెంట తీసుకెళ్లారు. తర్వాత కొద్ది రోజులకే జాతీయస్థాయిలో మీ వాడు ప్రథమ స్థానంలో నిలిచాడని సమాచారం అందించారు. వెంటనే అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలని చెప్పడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. అయితే కొద్దిరోజుల తర్వాత తెలిసింది అవన్నీ ఉత్తుత్తి సర్టిఫికెట్లని, ఈ విషయంలో తాము మోసపోయామని లబోదిబోమన్నారు. ‘నకిలీ’పై అప్రమత్తంగా ఉండాలి.. జిల్లాలో కొన్ని నకిలీ క్రీడా సంఘాల పేరిట జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీలకు తీసుకెళ్తున్నామని నమ్మబలుకుతున్న వారి పట్ల క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర, జిల్లా స్పోర్ట్స్ అథారిటీలకు అనుబంధంగా ఉన్న క్రీడా సంఘాలు నిర్వహించే టోర్నీల్లో మాత్రమే పాల్గొనాలి. ఎటువంటి గుర్తింపు లేని క్రీడా సంఘాల బాధ్యులు చెప్పే మాటలు నమ్మొద్దు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడాలనుకునే వారు ముందుగా తమను సంప్రదిస్తే అన్ని విషయాలు తెలియపరుస్తాం. – ఎం.పరంధామరెడ్డి, డీవైఎస్ఓ, ఖమ్మం -
మోడల్‌ను చేస్తామని నిండా ముంచారు..
హైదరాబాద్: మోడల్ కావాలని ఆశించిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వల్లో పడి నిండా మునిగాడు. ఏకంగా రూ.9.63 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లికి చెందిన ఓ యువకుడు (17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మోడల్ కావాలన్నది అతడి ఆకాంక్ష. ఈ క్రమంలో ఎల్యూమనేటరీ సొసైటీ విషయం ఇతడికి తెలిసింది. వివిధ రంగాల్లో ప్రతిభ ఉండి, ఉన్నతస్థాయికి చేరాలని ఆశించే వారిని ఈ సొసైటీ సభ్యులుగా చేర్చుకుంటుంది. నామ మాత్రపు ఫీజుతో తగిన తోడ్పాటు అందిస్తుంటుంది. అయితే నగర విద్యార్థి మాత్రం ఈ సొసైటీ వెబ్‌సైట్‌ను పోలిన బోగస్ సైట్‌కు ఈ-మెయిల్ పంపాడు. దీన్ని సృష్టించిన సైబర్ నేరగాళ్లు తక్షణం స్పందించారు. సభ్యత్వ నమోదు అంటూ 599 డాలర్లు (దాదాపు రూ.40 వేలు) వసూలు చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్తూ రూ.9.63 లక్షలు దండుకున్నారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు. కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో డబ్బు డిపాజిట్ చేసిన మూడు ఖాతాల్లో రెండు ముంబై, మరోకటి లక్నోకు చెందినదిగా గుర్తించారు. ఇది నైజీరియన్ గ్యాంగ్ పనిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.