మోడల్‌ను చేస్తామని నిండా ముంచారు..
హైదరాబాద్: మోడల్ కావాలని ఆశించిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వల్లో పడి నిండా మునిగాడు. ఏకంగా రూ.9.63 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లికి చెందిన ఓ యువకుడు (17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మోడల్ కావాలన్నది అతడి ఆకాంక్ష. ఈ క్రమంలో ఎల్యూమనేటరీ సొసైటీ విషయం ఇతడికి తెలిసింది.
వివిధ రంగాల్లో ప్రతిభ ఉండి, ఉన్నతస్థాయికి చేరాలని ఆశించే వారిని ఈ సొసైటీ సభ్యులుగా చేర్చుకుంటుంది. నామ మాత్రపు ఫీజుతో తగిన తోడ్పాటు అందిస్తుంటుంది. అయితే నగర విద్యార్థి మాత్రం ఈ సొసైటీ వెబ్‌సైట్‌ను పోలిన బోగస్ సైట్‌కు ఈ-మెయిల్ పంపాడు. దీన్ని సృష్టించిన సైబర్ నేరగాళ్లు తక్షణం స్పందించారు. సభ్యత్వ నమోదు అంటూ 599 డాలర్లు (దాదాపు రూ.40 వేలు) వసూలు చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్తూ రూ.9.63 లక్షలు దండుకున్నారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు. కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో డబ్బు డిపాజిట్ చేసిన మూడు ఖాతాల్లో రెండు ముంబై, మరోకటి లక్నోకు చెందినదిగా గుర్తించారు. ఇది నైజీరియన్ గ్యాంగ్ పనిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.