![అరెస్టయిన హుక్కాసెంటర్ల నిర్వాహకులు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61472662788_625x300.jpg.webp?itok=hExyVjjL)
అరెస్టయిన హుక్కాసెంటర్ల నిర్వాహకులు
హిమాయత్‌నగర్: పోలీసుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నారాయణగూడ ఠాణా పరిధిలో కొనసాగుతున్న రెండు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. సీఐ భీమ్‌రెడ్డి ఎస్సై నాగార్జునరెడ్డి కథనం ప్రకారం... నగరంలో హుక్కా సెంటర్లపై నిషేధం ఉంది. అయితే, స్టేషన్ పరిధిలో ఫిల్టర్ హుక్కా–స్నూకర్ పాయింట్, అక్స్ హుక్కాసెంటర్– స్నూకర్ పాయింట్‌ల పేరిట రెండు హుక్కా సెంటర్లను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఈ రెండు సెంటర్లపై దాడి చేశారు. అక్రమంగా నిర్వహించడమే కాకుండా మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. రెండు సెంటర్లలో ఆ సమయమంలో హుక్కా సేవిస్తున్న 8 మంది బాలురను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, హుక్కా సెంటర్ల నిర్వాహకులు నోమాన్, పి.అభివన్‌లను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.