నిజాం రాజ్యంలో ఉర్దూ మీడియం తప్ప మరో భాషలో చదువుకునేందుకు అవకాశంలేని రోజుల్లో ఉదయించిన తెలుగు చదువుల దివ్వె.. బాలికల పైచదువులు కొడగడుతున్న తరుణంలో ఆవిర్భవించిన విద్యాసంస్థ. వారు బాలురతో సమానంగా విజ్ఞానవంతులై అన్ని రంగాల్లో రాణించాలనే ప్రగాఢమైన ఆకాంక్షతో 64 ఏళ్ల క్రితం బర్కత్‌పురాలో ఆవిర్భవించిన ‘ఆంధ్ర బాలికా పాఠశాల’.. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలగా రూపాంతరం చెందింది. ‘రెడ్డి కళాశాల’గా పేరుపొందిన ఈ ప్రాంగణంలో చదువుకున్న ఎంతోమంది యువతులు దేశవిదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సరస్వతీ దేవాలయం వజ్రోత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
సాక్షి,సిటీబ్యూరో: నిజాం నియంతృత్వ రాజ్యంలో ఉర్దూ మీడియం తప్ప మరో భాషలో చదువుకునేందుకు అవకాశం లేని రోజుల్లో ఉదయించిన తెలుగు చదువుల దివ్వె అది. అమ్మాయిల ఉన్నత చదువుకు ఆస్కారం లేని తరుణంలో ఆవిర్భవించిన విద్యా సంస్థ అది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ బాగా చదువుకొని విజ్ఞానవంతులు కావాలని, అన్ని రంగాల్లో రాణించాలనే మహోన్నతమైన ఆశయంతో దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితమే మాతృభాషలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నర్సింహారావు, అహల్యాబాయి మల్లన్న తదితర ప్రముఖుల కృషితో ఆవిర్భవించిన ‘ఆంధ్ర బాలికా పాఠశాల’ అంచెలంచెలుగా ఎదిగింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలగా డిగ్రీ, పీజీలలో అనేక కోర్సులు నిర్వహిస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవే ధ్యేయంగా పనిచేసే అధ్యాపకులు, పాలకమండలి కృషితో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఉన్నత విద్యను అందజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ కళాశాల ఎంతో అండగా నిలుస్తోంది. సరిగ్గా 64 ఏళ్ల క్రితంఆవిర్భవించిన రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల రెండేళ్ల క్రితమే డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంపై అనేక సదస్సు, చర్చలు, గోష్టులు, వివిధ అంశాల్లో పిల్లలకు పోటీలు నిర్వహించారు. బుధవారం బర్కత్‌పురాలోని కళాశాలలో డైమండ్ జూబ్లీ ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
ఎందరో మహానుభావులు...
నగరంలో బాలికలు, మహిళల విద్య కోసం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ హైదరాబాద్ మహిళా విద్యా సంఘం. ఉర్దూ తప్ప మరో భాషలో చదివేందుకు వీల్లేకుండా అప్పటి నిజాం ఒక ప్రత్యేక ఫర్మానా తెచ్చారు. దీంతో ఆ రోజుల్లో హైదరాబాద్‌లోనే కాకుండా మొత్తం తెలంగాణలో తెలుగు, మరాఠీ, కన్నడం భాషల్లోని సుమారు 5,000 పాఠశాలలను మూసివేశారు. అలాంటి సమయంలో 1928లో బాలికల విద్య కోసం ముందుకొచ్చింది ఈ సంఘం. మాడపాటి నేతృత్వంలో నిజాం నీడలకు దూరంగా కోఠిలోని సుల్తాన్ బజార్‌లో ‘ఆంధ్ర బాలికా పాఠశాల’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాఠశాల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మాడపాటి హనుమంతరావు పాఠశాలగా అమ్మాయిలకు విద్యనందిస్తోంది.
ఆ తరువాత నిజాం నియంతృత్వపు అడ్డంకులను అధిగమించేందుకు అప్పటి నగర పోలీస్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డికి 1933లో హైదరాబాద్ మహిళా విద్యా సంఘం సారథ్య బాధ్యతలను అప్పగించారు. మాడపాటితో పాటు బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాప్‌రెడ్డి, వి.నరసింహారావు, అహల్యాబాయి మల్లన్నల కార్యవర్గంలో ఈ కమిటీ పని చేసింది. 1949లో బాలికల పాఠశాల విద్యకే పరిమితం కాకుండా ఉన్నత విద్యను సైతం అందజేయాలని తీర్మానించారు. 1953లో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి కన్నుమూశారు. బూర్గుల సారథ్యంలో కమిటీ పని చేసింది. 1954లో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల ఊపిరి పోసుకుంది. ఆ ఏడాది జనవరి 3న అప్పటి ప్రధాని నెహ్రూ బర్కత్‌పురాలోని కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. 1955 జనవరి 6న సర్వేపల్లి రాధాకృష్ణ ఈ కళాశాలను ప్రారంభించారు. అలాగే 1965లో నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవానికి ఇంది రాగాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మాయిలకు ఉన్నత విద్యనందజేయడమే లక్ష్యంగా 40 మంది జీవితకాల సభ్యులు, 15 మంది పాలకమండలి సభ్యుల బృందంతో కళాశాల ముం దుకు సాగుతోంది. జస్టిస్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత కమిటీకి అధ్యక్షులు కాగా ప్రొఫెసర్ ముత్యంరెడ్డి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ విద్యాసేవలో భాగస్వాములుగా నిలిచారు.
కోర్సులివీ...
నగరంలో మరే విద్యా సంస్థలోనూ లభించని బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ లాంటి అరుదైన కోర్సులతో పాటు బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, ఎమ్మెస్సీ, ఎంబీఏ తదితర కోర్సులను అందజేస్తున్నారు. 2,700 మంది అమ్మాయిలు వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలతో పాటు అమ్మాయిల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని, ఫార్మసీ కళాశాలను సైతం ఏర్పాటు చేశారు.
నేడే వేడుక..
డైమండ్ జూబ్లీ ముగింపు ఉత్సవాలు బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
అదే లక్ష్యం...
ఎంతోమంది మహానుభావులు హైదరాబాద్ మహిళా విద్యా సంఘం బాధ్యతలను చేపట్టారు. కళాశాల నిర్వహణకు సారథ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే లక్ష్యం... పేదరికం, ఇతర కారణాలతో అమ్మాయిలు ఉన్నత చదువులకు దూరం కావద్దు. తమకు నచ్చిన భాషలో చదువుకునే అవకాశం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నాం.
– ప్రొఫెసర్ ముత్యంరెడ్డి, కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment