Jhilam Chattaraj: అమ్మ చీర ఓ అందమైన కథావల్లరి.. నాన్న మరణిస్తే కూతురి.. తల వెంట్రుకలు కూడా ఏడుస్తాయి.. ఆడవారి చేతులకే హ్యాండ్ క్రీమ్ ఎందుకు.. ఇలాంటి సున్నితమైన అంశాలతో మన మదిని తట్టిలేపే కవితలను పరిచయం చేస్తారు ఝిలం ఛటరాజ్. ఇంటా బయట రకరకాల శబ్దాల నుంచి దూరంగా ఎలాంటి అలజడులు లేని, తమకే ప్రత్యేకమైన ఒక స్పేస్‌ని ఎవరికి వారు సృష్టించుకోవాలని తన ‘నాయిస్ క్యాన్సిలేషన్’ కవితా సంకలనం ద్వారా చెబుతారు ఈ కవయిత్రి.
పశ్చిమ బెంగాల్‌లో పుట్టి, పెరిగి, హైదరాబాద్‌లోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులను నిర్వర్తిస్తున్న ఝిలం ఛటరాజ్ కవయిత్రిగా తన భావాలను ఇలా వెలిబుచ్చారు. ‘‘ఎప్పుడూ డిజిటల్ నోటిఫికేషన్స్‌పై దృష్టి పెట్టడం కంటే రోజువారీ వాస్తవికతలపై కచ్చితమైన అవగాహనను ఏర్పరచుకోవడం అవసరం.
వంటింట్లో నుంచి వచ్చే అమ్మ చేతి వంట ఘుమఘుమలు, ఎండలో ఆరేసిన అమ్మ చీర, ఉగాది పచ్చడిలా ఉత్సాహ భరితమైన వివాహం, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్‌ల సొగసు, తాటిచెట్ల చుట్టూ అల్లుకున్న జీవితాలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రకాల భావోద్వేగాలు రోజువారీ గమనింపులోనే అక్షరాలు పరిమళమై మనల్ని ఆలింగనం చేస్తాయి. నా విషయంలో అదే జరిగింది. కలకత్తాలో పీజీ వరకు చదువుకున్నాను. ఎం.ఫిల్ పాండిచ్చేరి లో చేశాను. ఆంగ్లసాహిత్యంలో పీహెచ్‌డి కోసం హైదరాబాద్ వచ్చాను.
అమ్మానాన్నలకు మా అన్న, నేను సంతానం. అమ్మ టీచర్. నాన్న సాధారణ ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ చదువు, బెంగాల్ కవిత్వం నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉన్నాయి. అమ్మ నుంచి దూరంగా ఒంటరిగా హైదరాబాద్‌లో హాస్టల్ జీవితం నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. కొత్త రాష్ట్రం, కొత్త వాతావరణంలో ఇమడటానికి కొన్నాళ్లు పట్టింది. గమనింపు పెరిగింది. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఉద్యోగినిగా చేరడం, ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకోవడంతో హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాను. పుస్తక సమీక్షలు, కవితలు నా ప్రత్యేక అభిరుచులుగా మారిపోయాయి.
ఆధ్యాత్మిక రూపం
మూడేళ్ల క్రితం లాక్‌డౌన్ కన్నా ముందు ఓ రోజు హెడ్‌ఫోన్ సెట్ కొనాలనుకున్నప్పుడు మా అన్నయ్య నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కూడిన కొన్ని బ్రాండ్‌ల గురించి చెప్పాడు. ఆ హెడ్‌ఫోన్‌ని చెవులకు పెట్టుకుంటే మనకు బయటి శబ్దాలేవీ వినిపించవు. మన గుండె చప్పుడు కూడా స్పష్టంగా వినిపిస్తుంటుంది. అప్పుడే నాకు ఆధ్యాత్మికతకు ఇదో సూచికలా అనిపించింది.
‘నా జీవితంలో నా చుట్టూ చాలా శబ్దం ఉంది. కానీ, నిజంగా నేను కోరుకున్నదాన్ని వినగలనా’ అని ఆలోచించాను. అప్పుడు కవిత్వంలో నన్ను నేను వెతుక్కోవడం మొదలుపెట్టాను. అదే, ‘నాయిస్ క్యాన్సిలేషన్’ అయ్యింది. నా ప్రతి కవితనూ పెట్టుబడిదారీ విధానం, పర్యావరణ నష్టం, ఆన్‌లైన్ తరగతులను రద్దు చేయడం వైపుగా దృష్టి సారించాను.
మెరుగైన సమయం
కరోనా లాక్‌డౌన్ రోజులు నాకో కొత్త జీవితాన్ని ఇచ్చాయి. నా అభిరుచులను కొనసాగించేలా చేశాయి. రాసిన పద్యాలను మరింత ప్రభావ వంతంగా మార్చడానికి అవకాశం కల్పించింది. అయితే, ఒక లెక్చరర్‌గా మాత్రం ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న విద్యావిధానంపై ఆందోళన కలిగింది. ఆ ఆలోచనతో రాసిన ‘ఐ రన్ ది మారథాన్ వితౌట్ షూస్’(ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి) కవిత అమెరికన్ జర్నల్స్‌లో ప్రచురించేంతగా వెళ్లింది.
వర్చువల్ టీచింగ్ ఉపాధ్యాయులకు మొదట్లో కొంత ఆసక్తిగానే ఉంది. కానీ, రోజు రోజుకీ ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఒక ఎమోషనల్ డిస్‌కనెక్ట్‌ను అనుభవించాను. చదువు ఒక అనిశ్చితిగా మారిందనే బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
పర్యావరణ కష్టం
నవనాగరికులకంటే ఆదిమజాతుల్లో ఉన్న స్పృహ, వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను మనం కరోనా కాలంలో చూశాం. మనిషి నాగరికతవైపు పరిగెడుతున్న కొద్దీ ప్రకృతికి నష్టం వాటిల్లుతూనే ఉంది. బుద్ధుడు బోధి చెట్టు కిందికి వెళ్లినట్టు కొన్ని గ్రామాల్లో ప్రజలు చెట్లను వెతుక్కుంటూ వెళ్లిన వార్తలను చూశాం. అదే ఆలోచన నా కవితల్లో ఒకటయ్యింది. డిజిటల్ ప్రపంచంలో నోటిఫికేషన్‌ల గురించి ఎప్పటికప్పుడు పాపింగ్ అప్ శబ్దం చెబుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా నుండి తప్పించుకోలేరు. కానీ, సమతూకంలో ఉపయోగించాలి. మన రోజువారీ వాస్తవాలను గ్రహించడంలో సహాయపడే విషయాలకు కనెక్ట్ అవ్వాలి. అదే ‘నాయిస్ క్యాన్సిలేషన్’ ద్వారా చూపాను.
హ్యాండ్‌క్రీమ్
చేతులకు రాసే క్రీమ్ అంటే చాలు మహిళలకు సంబంధించినవే మార్కెట్లో ఉంటాయి. ఆమె చేతులకే క్రీమ్ ఎందుకు అవసరమయ్యిందంటే.. గృహిణిగా రోజంతా నీళ్లతో చేసే పనుల వల్ల ఆమె చేతులు ఎంత గరకుగా మారుతాయో, వాటి వెనకాల ఉన్న కష్టం చెప్పే కవిత్వమే ‘హ్యాండ్ క్రీమ్’ అయ్యింది. మన చేనేతల గొప్పతనం, హస్తకళల వైభవం, లిప్‌స్టిక్ ఎంపికలు .. ఇలా నన్ను కదిలించిన అంశాలు అందరినీ ఆలోచింపజేసేవే.
అలాగే, హాస్య స్ఫూర్తితో కొన్ని, వలసదారుల సమస్యలపై రాసినవి వరల్డ్ జర్నల్స్‌లోనూ చోటు సంపాదించుకున్నాయి. అలాగే, భావాన్ని 22 అక్షరాలలోనే కుదిర్చే ఐదు పంక్తుల కవితలూ ఈ పుస్తకం ద్వారా బాగా పేరు తెచ్చాయి’’ అంటూ తన కవితాప్రయాణం గురించి ఆనందంగా వివరించారు ఝిలం. మొదటి కవితా సంకలనం ‘వెన్ లవర్స్ లీవ్ అండ్ పొయెట్రీ స్టేస్’ తో రచనా లోకంలో అడుగు పెట్టారు ఝిలం ఛటరాజ్.
మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన ‘నాయిస్ క్యాన్సిలేషన్’తో అందరి మన్ననలు అందుకుంటున్నారు. సమాజంలో మంచి చెడులను సున్నితంగా ప్రశ్నించడమే కాకుండా, ఆలోచింపజేస్తారు. ప్రకృతి పట్ల మనుషులుగా మనకున్న బాధ్యతను తెలియజేస్తారు. ఝిలం రచనలు క్వీన్ మాబ్స్ టీ హౌజ్, కొలరాడో రివ్యూ, వరల్డ్ లిటరేచర్ టుడే, ఏషియన్ చా.. వంటి ప్రఖ్యాత జర్నల్స్‌లో ప్రచురితమైనాయి. 2019లో కౌన్సిల్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా నుండి ‘లిటరేచర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్‌మెంట్’ సిటిఐ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు ఝిలం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment