reddy college
-
Jhilam Chattaraj: నాన్న మరణిస్తే కూతురి.. తల వెంట్రుకలు కూడా ఏడుస్తాయి!
Jhilam Chattaraj: అమ్మ చీర ఓ అందమైన కథావల్లరి.. నాన్న మరణిస్తే కూతురి.. తల వెంట్రుకలు కూడా ఏడుస్తాయి.. ఆడవారి చేతులకే హ్యాండ్ క్రీమ్ ఎందుకు.. ఇలాంటి సున్నితమైన అంశాలతో మన మదిని తట్టిలేపే కవితలను పరిచయం చేస్తారు ఝిలం ఛటరాజ్. ఇంటా బయట రకరకాల శబ్దాల నుంచి దూరంగా ఎలాంటి అలజడులు లేని, తమకే ప్రత్యేకమైన ఒక స్పేస్‌ని ఎవరికి వారు సృష్టించుకోవాలని తన ‘నాయిస్ క్యాన్సిలేషన్’ కవితా సంకలనం ద్వారా చెబుతారు ఈ కవయిత్రి. పశ్చిమ బెంగాల్లో పుట్టి, పెరిగి, హైదరాబాద్‌లోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులను నిర్వర్తిస్తున్న ఝిలం ఛటరాజ్ కవయిత్రిగా తన భావాలను ఇలా వెలిబుచ్చారు. ‘‘ఎప్పుడూ డిజిటల్ నోటిఫికేషన్స్‌పై దృష్టి పెట్టడం కంటే రోజువారీ వాస్తవికతలపై కచ్చితమైన అవగాహనను ఏర్పరచుకోవడం అవసరం. వంటింట్లో నుంచి వచ్చే అమ్మ చేతి వంట ఘుమఘుమలు, ఎండలో ఆరేసిన అమ్మ చీర, ఉగాది పచ్చడిలా ఉత్సాహ భరితమైన వివాహం, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ల సొగసు, తాటిచెట్ల చుట్టూ అల్లుకున్న జీవితాలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రకాల భావోద్వేగాలు రోజువారీ గమనింపులోనే అక్షరాలు పరిమళమై మనల్ని ఆలింగనం చేస్తాయి. నా విషయంలో అదే జరిగింది. కలకత్తాలో పీజీ వరకు చదువుకున్నాను. ఎం.ఫిల్ పాండిచ్చేరి లో చేశాను. ఆంగ్లసాహిత్యంలో పీహెచ్‌డి కోసం హైదరాబాద్ వచ్చాను. అమ్మానాన్నలకు మా అన్న, నేను సంతానం. అమ్మ టీచర్. నాన్న సాధారణ ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ చదువు, బెంగాల్ కవిత్వం నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉన్నాయి. అమ్మ నుంచి దూరంగా ఒంటరిగా హైదరాబాద్‌లో హాస్టల్ జీవితం నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. కొత్త రాష్ట్రం, కొత్త వాతావరణంలో ఇమడటానికి కొన్నాళ్లు పట్టింది. గమనింపు పెరిగింది. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఉద్యోగినిగా చేరడం, ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకోవడంతో హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాను. పుస్తక సమీక్షలు, కవితలు నా ప్రత్యేక అభిరుచులుగా మారిపోయాయి. ఆధ్యాత్మిక రూపం మూడేళ్ల క్రితం లాక్డౌన్ కన్నా ముందు ఓ రోజు హెడ్‌ఫోన్ సెట్ కొనాలనుకున్నప్పుడు మా అన్నయ్య నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కూడిన కొన్ని బ్రాండ్ల గురించి చెప్పాడు. ఆ హెడ్‌ఫోన్‌ని చెవులకు పెట్టుకుంటే మనకు బయటి శబ్దాలేవీ వినిపించవు. మన గుండె చప్పుడు కూడా స్పష్టంగా వినిపిస్తుంటుంది. అప్పుడే నాకు ఆధ్యాత్మికతకు ఇదో సూచికలా అనిపించింది. ‘నా జీవితంలో నా చుట్టూ చాలా శబ్దం ఉంది. కానీ, నిజంగా నేను కోరుకున్నదాన్ని వినగలనా’ అని ఆలోచించాను. అప్పుడు కవిత్వంలో నన్ను నేను వెతుక్కోవడం మొదలుపెట్టాను. అదే, ‘నాయిస్ క్యాన్సిలేషన్’ అయ్యింది. నా ప్రతి కవితనూ పెట్టుబడిదారీ విధానం, పర్యావరణ నష్టం, ఆన్లైన్ తరగతులను రద్దు చేయడం వైపుగా దృష్టి సారించాను. మెరుగైన సమయం కరోనా లాక్డౌన్ రోజులు నాకో కొత్త జీవితాన్ని ఇచ్చాయి. నా అభిరుచులను కొనసాగించేలా చేశాయి. రాసిన పద్యాలను మరింత ప్రభావ వంతంగా మార్చడానికి అవకాశం కల్పించింది. అయితే, ఒక లెక్చరర్‌గా మాత్రం ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న విద్యావిధానంపై ఆందోళన కలిగింది. ఆ ఆలోచనతో రాసిన ‘ఐ రన్ ది మారథాన్ వితౌట్ షూస్’(ఆన్లైన్ తరగతులకు సంబంధించి) కవిత అమెరికన్ జర్నల్స్‌లో ప్రచురించేంతగా వెళ్లింది. వర్చువల్ టీచింగ్ ఉపాధ్యాయులకు మొదట్లో కొంత ఆసక్తిగానే ఉంది. కానీ, రోజు రోజుకీ ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఒక ఎమోషనల్ డిస్కనెక్ట్ను అనుభవించాను. చదువు ఒక అనిశ్చితిగా మారిందనే బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. పర్యావరణ కష్టం నవనాగరికులకంటే ఆదిమజాతుల్లో ఉన్న స్పృహ, వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను మనం కరోనా కాలంలో చూశాం. మనిషి నాగరికతవైపు పరిగెడుతున్న కొద్దీ ప్రకృతికి నష్టం వాటిల్లుతూనే ఉంది. బుద్ధుడు బోధి చెట్టు కిందికి వెళ్లినట్టు కొన్ని గ్రామాల్లో ప్రజలు చెట్లను వెతుక్కుంటూ వెళ్లిన వార్తలను చూశాం. అదే ఆలోచన నా కవితల్లో ఒకటయ్యింది. డిజిటల్ ప్రపంచంలో నోటిఫికేషన్ల గురించి ఎప్పటికప్పుడు పాపింగ్ అప్ శబ్దం చెబుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా నుండి తప్పించుకోలేరు. కానీ, సమతూకంలో ఉపయోగించాలి. మన రోజువారీ వాస్తవాలను గ్రహించడంలో సహాయపడే విషయాలకు కనెక్ట్ అవ్వాలి. అదే ‘నాయిస్ క్యాన్సిలేషన్’ ద్వారా చూపాను. హ్యాండ్‌క్రీమ్ చేతులకు రాసే క్రీమ్ అంటే చాలు మహిళలకు సంబంధించినవే మార్కెట్లో ఉంటాయి. ఆమె చేతులకే క్రీమ్ ఎందుకు అవసరమయ్యిందంటే.. గృహిణిగా రోజంతా నీళ్లతో చేసే పనుల వల్ల ఆమె చేతులు ఎంత గరకుగా మారుతాయో, వాటి వెనకాల ఉన్న కష్టం చెప్పే కవిత్వమే ‘హ్యాండ్ క్రీమ్’ అయ్యింది. మన చేనేతల గొప్పతనం, హస్తకళల వైభవం, లిప్‌స్టిక్ ఎంపికలు .. ఇలా నన్ను కదిలించిన అంశాలు అందరినీ ఆలోచింపజేసేవే. అలాగే, హాస్య స్ఫూర్తితో కొన్ని, వలసదారుల సమస్యలపై రాసినవి వరల్డ్ జర్నల్స్‌లోనూ చోటు సంపాదించుకున్నాయి. అలాగే, భావాన్ని 22 అక్షరాలలోనే కుదిర్చే ఐదు పంక్తుల కవితలూ ఈ పుస్తకం ద్వారా బాగా పేరు తెచ్చాయి’’ అంటూ తన కవితాప్రయాణం గురించి ఆనందంగా వివరించారు ఝిలం. మొదటి కవితా సంకలనం ‘వెన్ లవర్స్ లీవ్ అండ్ పొయెట్రీ స్టేస్’ తో రచనా లోకంలో అడుగు పెట్టారు ఝిలం ఛటరాజ్. మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన ‘నాయిస్ క్యాన్సిలేషన్’తో అందరి మన్ననలు అందుకుంటున్నారు. సమాజంలో మంచి చెడులను సున్నితంగా ప్రశ్నించడమే కాకుండా, ఆలోచింపజేస్తారు. ప్రకృతి పట్ల మనుషులుగా మనకున్న బాధ్యతను తెలియజేస్తారు. ఝిలం రచనలు క్వీన్ మాబ్స్ టీ హౌజ్, కొలరాడో రివ్యూ, వరల్డ్ లిటరేచర్ టుడే, ఏషియన్ చా.. వంటి ప్రఖ్యాత జర్నల్స్‌లో ప్రచురితమైనాయి. 2019లో కౌన్సిల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నుండి ‘లిటరేచర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్’ సిటిఐ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు ఝిలం. – నిర్మలారెడ్డి -
సమ్‌థింగ్ స్పెషల్ రెడ్డి కాలేజ్
నిజాం రాజ్యంలో ఉర్దూ మీడియం తప్ప మరో భాషలో చదువుకునేందుకు అవకాశంలేని రోజుల్లో ఉదయించిన తెలుగు చదువుల దివ్వె.. బాలికల పైచదువులు కొడగడుతున్న తరుణంలో ఆవిర్భవించిన విద్యాసంస్థ. వారు బాలురతో సమానంగా విజ్ఞానవంతులై అన్ని రంగాల్లో రాణించాలనే ప్రగాఢమైన ఆకాంక్షతో 64 ఏళ్ల క్రితం బర్కత్‌పురాలో ఆవిర్భవించిన ‘ఆంధ్ర బాలికా పాఠశాల’.. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలగా రూపాంతరం చెందింది. ‘రెడ్డి కళాశాల’గా పేరుపొందిన ఈ ప్రాంగణంలో చదువుకున్న ఎంతోమంది యువతులు దేశవిదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సరస్వతీ దేవాలయం వజ్రోత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి,సిటీబ్యూరో: నిజాం నియంతృత్వ రాజ్యంలో ఉర్దూ మీడియం తప్ప మరో భాషలో చదువుకునేందుకు అవకాశం లేని రోజుల్లో ఉదయించిన తెలుగు చదువుల దివ్వె అది. అమ్మాయిల ఉన్నత చదువుకు ఆస్కారం లేని తరుణంలో ఆవిర్భవించిన విద్యా సంస్థ అది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ బాగా చదువుకొని విజ్ఞానవంతులు కావాలని, అన్ని రంగాల్లో రాణించాలనే మహోన్నతమైన ఆశయంతో దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితమే మాతృభాషలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. మాడపాటి హనుమంతరావు, వడ్లకొండ నర్సింహారావు, అహల్యాబాయి మల్లన్న తదితర ప్రముఖుల కృషితో ఆవిర్భవించిన ‘ఆంధ్ర బాలికా పాఠశాల’ అంచెలంచెలుగా ఎదిగింది. శాఖోపశాఖలుగా విస్తరించింది. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాలగా డిగ్రీ, పీజీలలో అనేక కోర్సులు నిర్వహిస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవే ధ్యేయంగా పనిచేసే అధ్యాపకులు, పాలకమండలి కృషితో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఉన్నత విద్యను అందజేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ కళాశాల ఎంతో అండగా నిలుస్తోంది. సరిగ్గా 64 ఏళ్ల క్రితంఆవిర్భవించిన రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల రెండేళ్ల క్రితమే డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంపై అనేక సదస్సు, చర్చలు, గోష్టులు, వివిధ అంశాల్లో పిల్లలకు పోటీలు నిర్వహించారు. బుధవారం బర్కత్‌పురాలోని కళాశాలలో డైమండ్ జూబ్లీ ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఎందరో మహానుభావులు... నగరంలో బాలికలు, మహిళల విద్య కోసం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ హైదరాబాద్ మహిళా విద్యా సంఘం. ఉర్దూ తప్ప మరో భాషలో చదివేందుకు వీల్లేకుండా అప్పటి నిజాం ఒక ప్రత్యేక ఫర్మానా తెచ్చారు. దీంతో ఆ రోజుల్లో హైదరాబాద్‌లోనే కాకుండా మొత్తం తెలంగాణలో తెలుగు, మరాఠీ, కన్నడం భాషల్లోని సుమారు 5,000 పాఠశాలలను మూసివేశారు. అలాంటి సమయంలో 1928లో బాలికల విద్య కోసం ముందుకొచ్చింది ఈ సంఘం. మాడపాటి నేతృత్వంలో నిజాం నీడలకు దూరంగా కోఠిలోని సుల్తాన్ బజార్లో ‘ఆంధ్ర బాలికా పాఠశాల’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాఠశాల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మాడపాటి హనుమంతరావు పాఠశాలగా అమ్మాయిలకు విద్యనందిస్తోంది. ఆ తరువాత నిజాం నియంతృత్వపు అడ్డంకులను అధిగమించేందుకు అప్పటి నగర పోలీస్ కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డికి 1933లో హైదరాబాద్ మహిళా విద్యా సంఘం సారథ్య బాధ్యతలను అప్పగించారు. మాడపాటితో పాటు బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాప్‌రెడ్డి, వి.నరసింహారావు, అహల్యాబాయి మల్లన్నల కార్యవర్గంలో ఈ కమిటీ పని చేసింది. 1949లో బాలికల పాఠశాల విద్యకే పరిమితం కాకుండా ఉన్నత విద్యను సైతం అందజేయాలని తీర్మానించారు. 1953లో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి కన్నుమూశారు. బూర్గుల సారథ్యంలో కమిటీ పని చేసింది. 1954లో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల ఊపిరి పోసుకుంది. ఆ ఏడాది జనవరి 3న అప్పటి ప్రధాని నెహ్రూ బర్కత్‌పురాలోని కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. 1955 జనవరి 6న సర్వేపల్లి రాధాకృష్ణ ఈ కళాశాలను ప్రారంభించారు. అలాగే 1965లో నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవానికి ఇంది రాగాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మాయిలకు ఉన్నత విద్యనందజేయడమే లక్ష్యంగా 40 మంది జీవితకాల సభ్యులు, 15 మంది పాలకమండలి సభ్యుల బృందంతో కళాశాల ముం దుకు సాగుతోంది. జస్టిస్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత కమిటీకి అధ్యక్షులు కాగా ప్రొఫెసర్ ముత్యంరెడ్డి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ విద్యాసేవలో భాగస్వాములుగా నిలిచారు. కోర్సులివీ... నగరంలో మరే విద్యా సంస్థలోనూ లభించని బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ లాంటి అరుదైన కోర్సులతో పాటు బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం, ఎమ్మెస్సీ, ఎంబీఏ తదితర కోర్సులను అందజేస్తున్నారు. 2,700 మంది అమ్మాయిలు వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలతో పాటు అమ్మాయిల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని, ఫార్మసీ కళాశాలను సైతం ఏర్పాటు చేశారు. నేడే వేడుక.. డైమండ్ జూబ్లీ ముగింపు ఉత్సవాలు బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. అదే లక్ష్యం... ఎంతోమంది మహానుభావులు హైదరాబాద్ మహిళా విద్యా సంఘం బాధ్యతలను చేపట్టారు. కళాశాల నిర్వహణకు సారథ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే లక్ష్యం... పేదరికం, ఇతర కారణాలతో అమ్మాయిలు ఉన్నత చదువులకు దూరం కావద్దు. తమకు నచ్చిన భాషలో చదువుకునే అవకాశం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. – ప్రొఫెసర్ ముత్యంరెడ్డి, కార్యదర్శి -
కాలేజీ విద్యార్థినుల అదృశ్యం
-
ఇద్దరు కాలేజీ విద్యార్థినుల అదృశ్యం
హైదరాబాద్: నారాయణగూడలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు చామంతి (18), దివ్య (20)లు శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కాలేజీ ముగిసిన తర్వాత తమ పిల్లలు ఇంటికి రాలేదని కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అదిరేటి స్టెప్పు మేమేస్తే..
హైదరాబాద్‌సిటీ (కాచిగూడ): ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు తమదైన శైలితో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువుకునే రోజుల్లో రెడ్డి కళాశాలలో చదువుకోవాలనే ఆశ ఉండేదని, కాని అది అప్పుడే నేరవేరలేదని, ఇప్పుడు కళాశాలలో అడుగు పెట్టేసరికి నా కల ఈ విధంగా నేరవేరిందని సంతోషాన్ని వ్యక్త పరిచారు. రెడ్డి కళాశాలకు అవసరమైన సహాయ సహాయసహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, అవసరమైతే సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ పునర్నినిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంతెత్తుకు ఎదిగినా కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికి మర్చిపోవద్దని సూచించారు. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ఫ్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సురేఖారెడ్డి, సెక్రటరీ ప్రోఫెసర్ తిప్పారెడ్డి, డెరైక్టర్ డాక్టర్ డి.రామకృష్ణారెడ్డి, డీన్ ప్రోఫెసర్ ముత్యంరెడ్డి, మంజులత జైన్ తదితరులు పాల్గొన్నారు.