నిందితుడు ముబారక్
పహాడీషరీఫ్: తానో డాన్‌నని, తన పేరు చెబితే అందరూ బెదిరిపోవాలని సామాన్యులపై దాడులకు తెగబడుతున్న ఓ రౌడీషీటర్‌ను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ ఠాణాలో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, ఇన్‌స్పెక్టర్ వి.సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. షాహిన్‌నగర్‌కు చెందిన ముబారక్ బిన్ అబ్దుల్లా బిన్ సాల్మిన్ సిగర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచే తననొక డాన్‌గా ప్రకటించుకుని అందరూ తనను చూస్తే భయపడాలని భావించేవాడు. ఇందులో భాగంగా కత్తితో తిరుగుతూ పహాడీషరీఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట, చాంద్రాగుట్ట ప్రాంతాల్లో సామాన్యులపై దాడి చేసేవాడు. ఇతనిపై ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి.
ఇందులో హత్య, హత్యాయత్నం, దాడులు, దోపిడీ కేసులు ఉన్నాయి. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచారు. ఓ హత్యాయత్నం కేసులో 2018 మే నెలలో పహాడీషరీఫ్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బయటికి వచ్చిన ముబారక్ తన వైఖరి మార్చుకోకపోగా నాలుగు నెలల్లోనే ఇద్దరిపై దాడి, ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మారణాయుధంతో తిరుగుతున్న అతడిని బాలాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అదనపు ఇన్‌స్పెక్టర్ సుధీర్ కృష్ణ, ఎస్సైలు జి.మధు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment