
హైదరాబాద్ : భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి రూ.కోట్లలో రుణాలు తీసుకుని టోకరా వేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్‌పేటకు చెందిన పీఐయాదవ్‌తోపాటు అబ్దుల్లాపూర్‌మెట్, పరిసర గ్రామాల్లోని పలువురితో కలసి అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 190లోని భూమికి గాను నకిలీ పత్రాలను (డాక్యుమెంట్ నెంబర్ : 2554/2006) సృష్టించాడు.
వాటితో వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.40 కోట్ల మేర రుణాలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంఎస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట కూడా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎంఎస్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో అతను జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు తెలిసింది. ఇలా నకిలీ పత్రాలు సృష్టించి ఉమ్మడి రాష్ట్రంలో పలు బ్యాంకుల నుంచి సుమారు రూ. 200కోట్లకు పైగా రుణాలు తీసుకుని బురిడీ కొట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment