duplicate documents
-
డూప్లి 'కేటుగాళ్లు'
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని పాయకాపురంలో గీత అనే మహిళ పేరిట ఆస్తికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఉంది. దీనిని గుర్తించిన కేటుగాళ్లు అదే ప్రాంతంలో నివశిస్తున్న విజయలక్ష్మి పేరును ఆధార్ కార్డులో గీతగా మార్పించి.. రూ.12 లక్షల విలువైన ఇంటిస్థలాన్ని ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భవానీపురంలో మేర కోటేశ్వరరావు అనే వ్యక్తి రిజిస్ట్రార్ కార్యాలయంలో లభ్యం కాని డాక్యుమెంట్లను గుర్తించి.. వాటిని వేరే వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. సదరు ఆస్తులను తన కొడుకు శ్రీనివాసులు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. కొందరు లేఖరుల సాయంతో దర్జాగా సాగిపోతున్న దందాలు విశాఖపట్నంలో లాగిన తీగతో విజయవాడలో వెలుగులోకి వచ్చాయి. ఇలా బయటపడింది.. విశాఖపట్నానికి చెందిన ఎన్.వెంకటేశ్వరావు అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కోసం దరఖాస్తు చేయగా.. తన స్థలాన్ని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి రాజు చైతన్య అనే వ్యక్తికి విజయవాడలోని గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం డొంక కదిలింది. ఈ ఫిర్యాదుతో మేల్కొన్న సబ్ రిజిస్ట్రార్లు తెలివిగా వ్యవహరించి నిందితుడిని పిలిపించి, రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. తిరిగి అతనిపైనే గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నకిలీ డాక్యుమెంట్లను ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సహకరిస్తున్న వ్యక్తులెవరనేది కూపీ లాగుతున్నారు. కాగా, ప్రస్తుతం గుణదలకు చెందిన రాజుచైతన్య పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి ముగ్గురు వ్యక్తులతో కూడిన బృందం సహకరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. దొంగ రిజిస్ట్రేషన్లు ఇలా.. ప్రధానంగా ఆధార్ కార్డులో పేరు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆధార్ కార్డుల మార్పిడి ఇందిరాగాం«ధీ స్టేడియం సమీపంలో సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒరిజనల్ రికార్డుల మాదిరి డాక్యుమెంట్లు సృష్టించడంలో నిష్ణాతులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిణామాలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో కొందరు కేటుగాళ్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ కొన్ని ఆస్తులకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ లేకపోతే సంబంధిత సిబ్బంది ‘నాట్ ఫౌండ్’ అని సమాచారమిస్తారు. దీంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మేర కోటేశ్వరావు అనే వ్యక్తితో కూడిన బృందం ఆరితేరినట్టు గుర్తించారు. కోటేశ్వరరావు విజయవాడలోని దేవీపేటలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. ఈ తరహాలో ఇప్పటికే నున్న, గాంధీనగర్, మైలవరం, గుణదల, పటమట, మైలవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. నున్న ప్రాంతంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఫేక్ డాక్యుమెంట్ల తయారీకి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరికి ప్రధానంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది, దస్తావేజు లేఖరులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, కొందరు సబ్రిజిస్ట్రార్లు సైతం సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకులకు 3,316 కోట్ల ఎగవేత
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది), కార్పొరేషన్ బ్యాంక్‌ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో.. ఇప్పుడు బకాయిల మొత్తం ఏకంగా రూ. 3,316 కోట్లకు చేరింది. దీనితో కన్సార్షియం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి వీఎంసీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపాయి. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలోనే తమకు బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్ నుంచి రూ.262 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత రుణాలు చెల్లిస్తామని డైరెక్టర్లు నమ్మబలికారు. అయితే వీఎంసీకి బీఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన మొత్తం రూ.33 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ క్రమంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 20వ తేదీన వి.హిమబిందు, వి.సతీష్, వి.మాధవి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పత్రాలు, 40 ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్‌ల్లో నిక్షిప్తమైన డిజిటల్ డేటాతో పాటు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీఎంసీ సంస్థ కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఆడిట్ నివేదికల్లో బయటపడిందని ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి టెండర్లు దక్కించుకోవడంలో పీఐఎస్‌ఎల్ అనే సంస్థకు ఎలాంటి పాత్ర లేకపోయినా మూడు శాతం కమీషన్‌ను వీఎంసీఎల్ చెల్లించినట్లు తేలిందని వివరించింది. పీవోఎంఎల్ కోర్టులో హాజరు హిమబిందు రూ.692 కోట్ల మేరకు డమ్మీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లు (ఎల్వోసీ) సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. విదేశాల్లో త మ బంధువులు నడిపిస్తున్న సంస్థలకు పెద్ద మొత్తంలో నిధు లు మళ్లించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించ లేదని, విదేశీ లావాదేవీల గురించి అవాస్తవాలు చెబుతున్న నేపథ్యం లో ఆమెను అరెస్టు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కోర్టు లో హాజరుపర్చినట్లు ఈడీ తెలిపింది. కోర్టు ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించినట్లు వివరించింది. -
రూ.311 కోట్లకు బురిడీ
భీమవరం: బ్యాంకులకు నకిలీపత్రాలు చూపించి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు స్వాహా చేసే సంఘటనలే మనం చూస్తున్నాం. ఈ జాడ్యం నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఐడీబీఐ బ్యాంకును ఎంచుకుని చేపలు, రొయ్యల చెరువుల సాగు పేరుతో రూ.311 కోట్లు నకిలీ పత్రాల ద్వారా కొట్టేశారు కొందరు మోసగాళ్లు. 2018 మార్చిలో 16 మందిపై కేసు నమోదైంది. రుణాలు చెల్లించకపోగా వారి చిరునామాలే దొరక్కపోవడంతో బురిడీ బాగోతం వెలుగుచూసింది. భీమవరం ఐడీబీఐ బ్యాంకు బ్రాంచి ద్వారా రాజమండ్రి ఐడీబీఐ కార్యాలయం కూడా ఈ రుణాల మంజూరులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారికి అప్పటి బ్యాంకు అధికారులు కొంతమంది సహకారం అందించినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు సందర్భంలో విషయాలు వెల్లడించకపోయినా భీమవరం లోని ఒక ఫ్యాన్సీ షాపు యజమాని ఈ రుణాల మంజూరుకు అప్పట్లో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఉన్నతాధికా రులు ఆరా తీయడం ప్రారంభించారు. దీనికి అన్ని అర్హతలున్నా రుణం లభించని స్థానికులు కొందరు అక్రమ రుణాల విషయం ఉన్నతాధికారులకు చేరవేసినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారిలో భీమవరం, కాకినాడ, హైదరాబాద్, ఆకివీడు, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందినవారుండడం విశేషం. కేసు బిగుస్తుందని తెలిసిన కొంతమంది రాజకీయ ప్రముఖులతో బేరసారాలు చేయించి కొంత మొత్తం చెల్లించగా ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఉచ్చు బిగించి బాకీదారుల ఆస్తుల స్వాధీనానికి, అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. నకిలీ పత్రాలు చూపించిన భూముల వివరాలను సీబీఐ అధికారులు జీఐఎస్ ట్రాకింగ్ ద్వారా కూపీ లాగితే మొత్తం భూములు కొల్లేరు ప్రాంతానికి చెందినవిగా గుర్తించినట్లు తెలిసింది. -
‘క్రిమినల్ చర్యలు ఎంతవరకు వచ్చాయి?’
సాక్షి, హైదరాబాద్: గుడి మల్కాపూర్‌లోని సర్వే నంబర్ 284/6లోని భూమికి కొన్ని నకిలీ పత్రాల ఆధారంగా ఎన్వోసీ జారీ చేసిన వ్యవహారంలో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఎంతవరకు వచ్చాయో తెలపాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై క్రిమినల్ చర్యలు ఎంతవరకు వచ్చాయో కూడా చెప్పాలంది. దీనికి సంబంధించి ఓ స్థాయీ నివేదికను తమ ముందుంచాలని న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ కేశవరావుల ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. గుడిమల్కాపూర్‌లో తాను కొన్న 5,262 చదరపు గజాల స్థలానికి ఇతరుల పేరుతో ఎన్వోసీ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ శాంతి అగర్వాల్ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ఎన్వోసీ జారీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదని తేల్చారు. ఎన్వోసీ జారీ కమిటీ చైర్మన్‌గా ఉన్న నవీన్ మిట్టల్, సభ్యులైన జాయింట్ కలెక్టర్ దుర్గాదాస్ తదితరులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. నకిలీ పత్రాలు ఇచ్చిన సయ్యద్ అబ్దుల్ రబ్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం విచారణ జరిపింది. -
స్కూలు స్థలం... సొంత‘లాభం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించే వాళ్లను తరచూ చూస్తుంటాం. అయితే రెండు కంపెనీలకు చెందిన వారు మాత్రం ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టి రూ.4 కోట్లు ‘లాభం’ పొందారు. ఆ స్థలంపై నకిలీ పత్రాలను సృష్టించి వాటి ఆధారంగా మహారాష్ట్ర బ్యాంకు కు టోకరా వేశారు. ఈ రెండు సంస్థలూ ఒకే ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని దర్జాగా తనఖా పెట్టడం విశేషం. వాయిదాల చెల్లింపులు నిలచిపోవడంతో విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు రెవెన్యూ, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఉన్న గోల్కొండ క్రాస్‌రోడ్స్ చిరునామాతో బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. దీనికి పి.నారాయణ మేనేజింగ్ డైరెక్టర్, రాయపూడి రమాదేవి డైరెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం రుణం కోసం ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకును ఆశ్రయించారు. దీనికోసం హామీగా బీకే గూడలోని సర్వే నెం.155లో 500 గజాల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్లు, అది తమ కంపెనీకి చెందినదేనని.. చూపే రిజిస్ట్రేషన్ సేల్‌డీడ్‌ను (నెం.435/2013) చూపించారు. దీని ఆధారంగా ఆ ఆస్తిని తనఖా పెడుతూ 2013 ఫిబ్రవరిలో రూ. 2 కోట్ల రుణం తీసుకున్నారు. మరో వ్యవహారం కూడా... బేకీస్ ఫుడ్స్ బాటలోనే... అన్నా ఇకో లాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇలాంటి వ్యవహారమే నడిపింది. ఈ సంస్థ శానిటరీ నాప్కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ తదితరాలు తయారు చేసి అమ్ముతుంది. వీటితో పాటు నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్, ఉమెన్ ఎన్పవర్మెంట్, చిల్డ్రన్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అనేక స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంది. దీని డైరెక్టర్లు జి.శ్రీకర్, వై.వెంకటేశ్‌లు రుణం పొందాలని భావించారు. వీరూ ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకు శాఖనే ఆశ్రయించారు. ఎస్ఆర్నగర్ బీకేగూడలో 500 గజా ల స్థలంలో ఉన్న ఇల్లు తమదేనంటూ అందుకు చెంది న డాక్యుమెంట్స్ (నెం.437/13) దాఖలు చేశారు. దీన్ని తనఖా పెట్టి ప్యానల్ అడ్వకేట్‌తో న్యాయ సలహా కోసం బ్యాంకునకు అందించారు. దీంతో బ్యాంకు వారికీ 2013లో ఫిబ్రవరిలోనే రూ.2 కోట్లు మంజూరు చేసింది. రూ.4 కోట్ల రుణం పొందిన రెండు సంస్థలూ వాయిదాలు చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేసే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారు తమ బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ల వివరాలతో అమీర్‌పేట తహసీల్దార్‌కు లేఖ రాశారు. ఆ ఆస్తులకు చెందిన పూర్తి రికార్డులు కోరుతూ డీమార్క్ చేయాలని అభ్యర్థించారు. ఈ రెండు కంపెనీలు బ్యాంకునకు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆయా సర్వే నంబర్లలోని స్థలాలు రహమాన్ మంజిల్ ప్రభుత్వ పాఠశాలతో పాటు, సయ్యద్ పటేల్ భాషాలకు చెందిన స్థలాలుగా రికార్డులో ఉన్నాయని బ్యాంకుకు తెలిపారు. దీంతో నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేశారని గుర్తించిన బ్యాంకు జోనల్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నకిలీ పత్రాలతో బ్యాంకులకు రూ.40 కోట్లకు టోకరా!
హైదరాబాద్ : భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి రూ.కోట్లలో రుణాలు తీసుకుని టోకరా వేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్‌పేటకు చెందిన పీఐయాదవ్‌తోపాటు అబ్దుల్లాపూర్‌మెట్, పరిసర గ్రామాల్లోని పలువురితో కలసి అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 190లోని భూమికి గాను నకిలీ పత్రాలను (డాక్యుమెంట్ నెంబర్ : 2554/2006) సృష్టించాడు. వాటితో వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.40 కోట్ల మేర రుణాలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంఎస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట కూడా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎంఎస్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో అతను జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు తెలిసింది. ఇలా నకిలీ పత్రాలు సృష్టించి ఉమ్మడి రాష్ట్రంలో పలు బ్యాంకుల నుంచి సుమారు రూ. 200కోట్లకు పైగా రుణాలు తీసుకుని బురిడీ కొట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
సింధు మీనన్‌పై చీటింగ్ కేసు
సాక్షి, బెంగళూరు: ‘చందమామ’ ఫేం, హీరోయిన్ సింధు మీనన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్ సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రయ్య యాదవ్ అరెస్టు
జగద్గిరిగుట్ట: బాచుపల్లి గ్రామంలోని 32 ఏకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో ప్రధాన సూత్రధారి పోతరాజు రామచంద్రుడు అలియాస్ చంద్రయ్య యాదవ్(53)ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎస్హెచ్ఓ బాలక్రిష్ణారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ చౌదరి దామోదర్‌రావు అనే వ్యక్తి ఈ నెల 14న సర్వే నంబర్ 140,141లోని తన భూమి 32.33 ఎకరాలు అక్రమించుకోవడానికి కొందరు నకిలీ పత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకుగాను అక్రమార్కులు బుక్ –1,వ్యాలూమ్–440లో 7 మార్టిగేజ్ డ్యాక్యూమెంట్ డిడ్స్ తొలగించి వాటి స్థానంలో 6 తప్పుడు సేల్ డీడ్ పత్రాలు ఉంచారు. ఇందుకుగాను ప్రధాన నిందుతుడు చంద్రయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్‌లు తయారీ మెషిన్‌ను కొనుగోలు చేసి దాని ఆధారంగా ఎస్ఆర్ఓ ఆఫీస్ స్టాంప్‌లు తయారు చేసినట్లు తెలిపారు. నకిలీ డీడ్లు షాపూర్‌నగర్‌లోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద టైప్ చేయించి దానికి సేల్ డీడ్ డ్రాఫ్ట్‌లను తన ల్యాప్‌టాప్‌లో స్వయంగా తయారు చేశాడు. ఎస్ఆర్ఓ కార్యాలయ సిబ్బంది సాయిబాబా, మురళీలకు రూ. 5 లక్షలు లంచం ఇచ్చి బుక్–1,వ్యాలూమ్ 440లోని ఒరిజినల్ మార్టిగేజ్ డాక్యుమెంట్లను తొలగించి వాటి స్థానంలో 6 నకిలీ పత్రాలు చేర్చాడు. భూమి యాజమాని చనిపోయినట్లుగా తెలుసుకుని మృతుడు కృష్ణమూర్తి తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన పద్దిరెడ్డికి విక్రయించినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. అయితే పద్దిరెడ్డి సైతం చనిపోయిన తరువాతే ఈ వ్యవహారం నడపడం గమనార్హం. దీనికితోడు గాజులరామారం, సూరారం తదితర ప్రాంతాల్లో సైతం మరో ఐదు నకిలీ పత్రాలు సృష్టించాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నట్లు తెలుసుకున్న చంద్రయ్య యాదవ్ తన వద్ద ఉన్న బుక్–1, వ్యాలూమ్440 నుంచి తొలగించిన ఒరిజినల్ మార్టిగేజ్ పత్రాలు , నకీలీ సేల్ డీడ్లు ,రబ్బర్ స్టాంప్‌లను తీసుకెళ్లి కిష్టాయిపల్లి గ్రామం పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిలో తగుల బెట్టాడు. చంద్రయ్య యాదవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ల్యాప్ టాప్, ప్రింటర్, రబ్బర్ స్టాప్ మేకింగ్ మిషన్, ఖాళీ రబ్బర్ స్టాప్‌లతో పాటు, 6 మొబైల్ ఫోన్లు, బైక్, కారులను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
భార్య చనిపోయిందని..
మిర్యాలగూడ : పది సంవత్సరాలుగా మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలోనే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎల్ఐసీ పాలసీల గురించిన ఆయనకు అన్నీ తెలుసు. తన అవసరాల మేరకు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేయాలని పథకం వేసి సక్సెస్ అయ్యాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలు.. మిర్యాలగూడ ఎల్ఐసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిషన్ తన భార్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. వాటితో తన భార్య పేరున ఉన్న రూ.2.5 లక్షల పాలసీని రెండు విడుతలుగా ఐదు లక్షల రూపాయలను డ్రా చేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన విధులు నిర్వర్తిస్తున్నాడు. విజిలెన్స్ తనిఖీలతో బయటపడిన వైనం.. నకిలీ డాక్యుమెంట్లతో ఐదు రూ.లక్షలు స్వాహా చేసిన విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ఐసీ విజెలన్స్ అధికారులు, డివిజనల్ అధికారులతో కలిసి సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 14న సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అతడికి కార్యాలయ అధికారులు గానీ, ఏజెంట్లు గానీ సహకరించినట్లు సమాచారం. ఎవరు సహకరించారనే విషయంపై డివిజనల్ అధికారులు విచారణ చేపట్టారు. గోప్యంగా ఉంచుతున్న అధికారులు.. అక్రమాలకు పాల్పడిన ఎల్ఐసీ ఉద్యోగి సస్పెండ్ అయినా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఉద్యోగి తన భార్య పేరున డ్రా చేసిన డబ్బులు వివరాలు ఎక్కడా చెప్పడంలేదు. సదరుడాక్యుమెంట్‌లను పరిశీలించిన అధికారి ఎవరనే విషయం కూడా స్థానిక అధికారులకు తెలిసినా వెల్లడించడం లేదు. సస్పెండ్ చేశాం ఎల్ఐసీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి కిషన్ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఉన్నతాధికారులు తేల్చారు. ఆయనను వెంటనే ఈ నెల 14న సస్పండ్ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ఐసీ డివిజనల్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. – ప్రసాద్, మేనేజర్, మిర్యాలగూడ -
ఎల్ఆర్ఎస్ అక్రమార్కులకు నోటీసులు
సాక్షి కథనంపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు స్పందన సాక్షి, హైదరాబాద్: తెల్లాపూర్‌లోని సర్వే నంబర్ 323 నుంచి 332, 336 నుంచి 340లోని హెచ్ఎండీఏకు చెందిన భూమి పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ పొందిన వారికి నోటీసులు జారీ చేశామని సంస్థ కమిషనర్ టి.చిరంజీవులు మంగళవారం తెలిపారు. ‘ఎల్ఆర్ఎస్తో ఎసరు’ పేరుతో సాక్షిలో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘అక్రమంగా ఎల్ఆర్ఎస్ క్లియర్ పొందిన దాదాపు 30 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఇంకా మరెంత మందికి పొరపాటున ఎల్ఆర్ఎస్ క్లియర్ చేశామా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. నిజమని తేలితే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడికి నోటీసులిస్తాం. ఆ తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాం’ అని చిరంజీవులు సాక్షికి తెలిపారు. -
మహామాయ
►గరిమెనపెంట భూబాగోతంలో మరో కోణం ►కొత్త రికార్డుల్లో పాత ఎంట్రీలు ►వారసుల నుంచి కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు ►అటవీ భూమిని కాజేసేందుకు నాలుగేళ్లుగా యత్నాలు నెల్లూరు : రికార్డులతోపాటు సర్వే నంబర్లనూ మార్చేశారు. అటవీ భూముల్ని గ్రామకంఠంగా చూపించారు. ఏకంగా 545 ఎకరాలను స్వాహా చేశారు. కానీ.. చివరకు అడ్డంగా దొరికిపోయారు. రాపూరు మండలం గరిమెనపెంట శివారులోని అటవీ భూముల కబ్జా వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూముల కబ్జాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా కొత్త రికార్డులు సృష్టించిన అధికార పార్టీ పెద్దలు అక్కడే దొరికిపోయారు. పక్కా స్కెచ్‌తో.. భూముల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించిన అధికార పార్టీ పెద్దలు మొదట అటవీ శాఖ అధికారుల ద్వారానే వ్యవహారం చక్కదిద్దేందుకు యత్నించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అటవీ శాఖ అధికారిపై చిత్తూరు జిల్లాకు చెందిన ప్రస్తుత మాజీమంత్రితోపాటు అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. సదరు అధికారి ఇందుకు ససేమిరా అనటంతో రూటు మార్చారు. రెవెన్యూ శాఖ వ్యవహారాల్లో తలపండిన మేధావుల్ని, ప్రస్తుత, రిటైర్డ్ తహసీల్దార్లను రంగంలోకి దించారు. రెవెన్యూ అధికారులకు భూ కబ్జా ఫైల్‌ను పంపించారు. స్థానిక ప్రజాప్రతినిధితోపాటు అప్పటి మంత్రితో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డుల గోల్‌మాల్‌కు శ్రీకారం చుట్టారు. అలా మొదలుపెట్టి అడుగడుగునా రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. తొలుత గ్రామ అడంగళ్ పుస్తకంలో ఖాతా నంబర్లు, వివరాలు నమోదు చేశారు. 1968లో 550 ఎకరాలను పట్టాలుగా ఇచ్చినట్టు రికార్డులు సృష్టించే క్రమంలో అడంగళ్‌లో వారి వారసుల పేర్లు, సర్వే నంబర్లు, భూమి వివరాలను తారుమారు చేశారు. అది కూడా పాత అడంగల్ కావటంతో ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. అడంగల్‌లోని వివరాలన్నీ పాతవే అయినా అడంగల్ పుస్తకాన్ని ప్రభుత్వ ముద్రణాలయంలో 1985లో ముద్రించారు. నిజానికి అందులో 1985 నుంచి మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. అంతకుముందు 20 ఏళ్ల రికార్డులు నమోదు చేయటం సాధ్యం కాదు. అయినా.. రెవెన్యూ అధి కారులు రాజకీయ ఒత్తిళ్లతో పాత వివరాలను కొత్త పుస్తకంలో నమోదు చేసి విచారణలో బుక్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఇద్దరు తహసీల్దార్ల పాత్ర ఉన్నట్టు తేల్చినా.. ఇప్పటివరకు ఒకరిపై మాత్ర మే చర్యలు తీసుకోవటం గమనార్హం. విజిలెన్స్ విచారణలోనూ బట్టబయలు అధికార పార్టీ నేతలు సాగించిన భూబాగోతంపై రెవెన్యూ శాఖతో పాటు విజిలెన్స్ విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది. గరిమెనపెంట అటవీ భూమి వందలాది ఏళ్లక్రితం అప్పటి జమీందార్లు, రాజులు అక్కడి బ్రాహ్మణులకు కేటాయించిన భూదాన మాన్యాలని దర్యాప్తులో తేలింది. 1980 తర్వాత అమల్లోకి వచ్చిన అటవీ, ఇనాం చట్టాల ద్వారా ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి అధికారిక రికార్డులు లేవు. ఈ క్రమంలో సర్వే నంబర్ 75ను సబ్ డివిజన్ చేసి 75/1గా, 75/2గా మార్చారు. 75/1లో 14 ఎకరాల భూమికి పట్టాను కేటా యించారు. 75/2 సర్వే నంబర్ భూమి మొత్తం అటవీ శాఖ పరిధిలోకి రావటంతో దానిని రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా మార్చారు. అంతకుముందే 180 ఎకరాల భూమిని కమ్యూనిటీ జాయింట్ ఫిర్మాంగ్ సొసైటీకి కేటాయించారు. రికార్డుల్లో నమోదు కాకుండా మిగిలిన 550 ఎకరాల భూమిని స్వాహా చేయటానికి అధికార పార్టీ నేతలు ప్రణాళిక రచించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి గతంలో బ్రాహ్మణులకు కేటాయించిన భూమి కావటంతో శనగవరపు అనే ఇంటిపేరుతో ఉన్న కొందరి వివరాలను వారసుల పేరిట.. వారికి తెలియకుండానే రికార్డుల్లో నమోదు చేయించారు. మొదటగా 505 ఎకరాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. రెండో దశలో 45 ఎకరాలను రికార్డుల్లోకి ఎక్కించారు. తద్వారా ఈ అటవీ భూమిని ప్రైవేటు భూమిగా మార్చే యత్నం చేశారు. ఆ భూముల్ని బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు చూపించి రిజిస్ట్రేషన్ చేయించారు. -
పాత్రధారులే.. సూత్రధారులు
స్థలం రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో కొత్త ట్విస్ట్ స్థలం బండారు వెంకటరమణదని తెలిసీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు నాలుగోవాటా యజమాని నుంచి మొత్తం రిజిస్ట్రేష¯ŒSకు సంతకాలు తనకు తెలియదన్న నాలుగోవాటా యజమాని ఆదికేశవులనాయుడు పోలీసులకు రాతపూర్వకంగా విషయం వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం సూరాబత్తులవీధిలోని 356 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వ్యవహారంలో సూత్రదారులే పాత్రదారులని వెల్లడైంది. ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసీ కూడా దాన్ని ఎలాగైనా కాజేయాలన్న కుట్రతో నిందితులు వ్యవహారించారా?, 1/4 స్థలం యజమానికి తెలియకుండా మొత్తం ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తన వాటా ఆస్తిని విక్రయించాలని తాము భావించామని, అయితే మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు తెలియదని నాలుగో వాటా యజమాని బి.ఆదికేశవులనాయుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలో ఉంటున్న ఆదికేశవులనాయుడు వద్దకు వెళ్లిన పోలీసులకు మొత్తం ఆస్తిని రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటున్నట్లు తమకు వారు చెప్పలేదని ఆదికేశవులనాయుడు పేర్కొన్నారు. డాక్యుమెంట్లు తెలుగులో రాయించారని, తమకు తెలుగు చదవడం రాదని ఆదికేశవులనాయుడు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు రాతపూర్వకంగా పోలీసులకు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేష¯ŒS సూరాబత్తుల వీధిలోని స్థలం బండారు వెంకటరమణ కుటుంబానికి చెందిందని తెలిసి నిందితులు కుట్రపూరితంగా రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారా? అనే అనుమానాలకు పోలీసులకు వెంకటరమణ చేసిన ఫిర్యాదులో ఉన్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తోంది. బాధితుడి ఫిర్యాదులో రాజమండ్రికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీ, ధవళేశ్వరానికి చెందిన దంగుడుబియ్యం నారాయణతో కలసి రావులపాలెంకు చెందిన సత్తార్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని పేర్కొన్నారు. ఇందులో లంకా వెంకట అప్పారావు స్థలం ఉన్న ప్రాంతంలోనే వ్యాపారిగా ఉంటున్నారు. ఇతనికి, కె.బ్రహ్మాజీ, దంగుడుబియ్యం నారాయణకు ఈ స్థలం బండారు వెంకటరమణ కుటుంబానిదేన్న విషయం తెలుసు. అయితే స్థలానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు నాలుగోవాటా యజమాని వద్ద ఉండడంతో మొత్తం ఆస్తిని కాజేయాలనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దానిని మళ్లీ దంగుడుబియ్యం నారాయణ, లంకా వెంకట అప్పారావు, ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, తలసెట్ల నాగరాజు, పోలాకి పరమేశ్వరరావు, మద్దు శ్రీనివాస్, మట్టా నరసింహరాజు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వారు రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వారిలో కూడా ఉండడంతో ఈ వ్యవహారంలో అందరూ భాగస్వాములైనట్లు స్పష్టమైంది. -
కొన్నది లేదు.. అమ్మిందీ లేదు..!
ఆదెమ్మదిబ్బ స్థలంలో భూ బకాసురుల లీల! రూ.100 కోట్ల స్థలం కబ్జా చేసినా పట్టించుకోని వైనం పత్రాలు చూపించకపోయినా అధికారుల ప్రేక్షకపాత్ర రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున రూ.100 కోట్ల స్థలం యథేచ్ఛగా ఆక్రమించారు భూ బకాసురులు. నగదు ఇచ్చి పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. ఇదేమిటని అడిగిన అధికారులకు, నాయకులకు ‘నేను ఈ స్థలం కొన్నాను’ అని చెబుతున్నారు. ఎప్పుడు కొన్నారు? ఎంత స్థలం కొన్నారు? ఆ డాక్యుమెంట్లు చూపించాలని అధికారులు, వివిధ పార్టీల ద్వితియ శ్రేణి నేతలు అడిగితే.. ‘సాయంత్రం తెస్తాను.. రేపు తెచ్చి చూపిస్తా’నంటూ స్థలం కొనట్టు చెబుతున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు చెబుతున్నారు. దాంతో అధికారులు, పార్టీల నేతలు వెళ్లిపోతున్నారు. 50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, స్థలం కొనుగోలు చేసి ఉంటే ఈ పక్కకు రాబోమని నేతలు అంటున్నారు. ఇదీ ఇప్పటి వరకు జరిగిన రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మ దిబ్బ స్థలం వ్యవహారం. – సాక్షి, రాజమహేంద్రవరం డాక్యుమెంట్లు ఏవీ? నగరంలోని 36, 38 డివిజన్ల మధ్య ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న 110 మంది పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. 13వ తేదీన అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య తన సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గుడిసెలు తొలగింపజేస్తున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. తాను 4 వేల గజాలు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని ఈశ్వరుడు తహసీల్దార్‌కు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని తహసీల్దార్ కోరగా, ఈశ్వరుడు ఇక్కడ లేవని చెప్పారు. అయితే సాయంత్రం కార్యాలయానికి తీసుకువచ్చి చూపించాలని తహసీల్దార్ ఆదేశించారు. ఇందుకు సమ్మతించిన ఈశ్వరుడు ఆ రోజు సాయంత్రం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదు. సరే మరుసటి రోజు తెస్తారని ఎదురుచూసిన తహసీల్దార్‌కు సమయం వృథా అయ్యిందే తప్ప డాక్యుమెంట్లు రాలేదు. ఒకటి కాదు, రెండు కాదు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ స్థలం కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు తహసీల్దార్‌కు చేరలేదు. యథేచ్ఛగా ఇళ్ల తొలగింపు డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడంతో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు వెళ్లిపోయారు. డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న పేదల గుడిసెలు, రేకుల షెడ్లను ఆక్రమణదారులు యథేచ్ఛగా తొలగిస్తున్నారు. పేదలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారు. ఖాళీ చేయబోమని చెబుతున్న వారి ఇళ్లను కూడా కలిపి చుట్టూ ముళ్ల కంచె వేశారు. రాకపోకలకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సొంత వాంబే ఇళ్లు ఉన్నవారు చెప్పిందే తడవుగా ఇచ్చింది తీసుకుని ఖాళీ చేశారు. ఇళ్లు లేని పేదలు వారు ఖాళీ చేశారు కదా, పెద్దలతో వివాదం ఎందుకని వెళ్లిపోయారు. ఇక అక్కడ 10 రేకుల షెడ్లు ఉన్నాయి. అవి పేద బ్రాహ్మణలకు చెందినవి. ఖాళీ చేయాలని వారికి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఓపక్క ఇళ్లు తొలగిస్తుండడంతో, 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని పేరు చెప్పడానికి భయపడుతున్న బ్రాహ్మణ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల నేతలకూ టోకరా.. ఎన్నో ఏళ్ల నుంచి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని తెలుసుకున్న సీపీఎం నేతలు ఈ నెల 13న, బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, గరిమెళ్ల చిట్టిబాబు తదితరులు ఈ నెల 15న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మురుసటి రోజు నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మసా రామజోగి, జిల్లా కార్యవర్గ సభ్యుడు లంక సత్యనారాయణ తదితరులు స్థలాన్ని పరిశీలించి, పేదలు, పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. అప్పుడు కూడా ఈశ్వరుడు తాను ఈ స్థలం కొన్నానంటూ వారికి చెప్పారు. ఆ డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా, అధికారులకు చెప్పినట్టే సాయంత్రం తెచ్చి చూపిస్తాననడంతో నేతలు వెనుదిరిగారు. అయితే ఇక్కడకు కూడా అధికారులతో పాటు నేతలకూడా స్థలం కొన్నాననంన్న వ్యక్తి టోకరా వేశారు. డాక్యుమెంట్లు చూపించకపోగా, నేతలు ఫో¯ŒS చేసినా తీయడం మానేశారు. ఐదు రోజులవుతున్నా ఈశ్వరుడు డాక్యుమెంట్లు చూపించకపోవడం గమనార్హం. ప్రశ్నలు అనేకం.. సమాధానాలు? స్థలం కొన్నానని చెబుతూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారు. డాక్యుమెంట్లు ఇప్పటి వరకూ చూపించకున్నా.. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఎందుకు మిన్నుకుండిపోయారు? ఆ స్థల యజమానులు ఎవరు? ఎన్నో ఏళ్లుగా పేదలుంటున్నా వారిని ఎందుకు ఖాళీ చేయించలేదు? ఇన్ని రోజులు అమ్మని స్థలాన్ని ఇప్పడెందుకు విక్రయించారు? అసలు ఎవరికి అమ్మారు? సర్వే నంబర్ ఎంత? ఎంత స్థలం కొన్నారు? ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేష¯ŒS జరిగింది? సాక్షులు ఎవరు? పెద్దనోట్ల రద్దు, నగదు విత్‌డ్రాపై ఆంక్షలున్న సమయంలో అంత డబ్బు కొనుగోలుదారులకు ఎక్కడ నుంచి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం నగర ప్రజలను తొలిచేస్తున్నాయి. -
రూ. 100 కోట్ల విలువైన భూ కబ్జా
దిబ్బపై వాలుతున్న భూ రాబందులు అరవై ఏళ్లుగా జీవనం సాగిస్తున్న పేదలపై దౌర్జన్యం నకిలీ డాక్యుమెంట్లతో కొంగొత్త వేషాలు ఇళ్లు ఖాళీ చేయిస్తున్న కబ్జాదారులు 8 లబోదిబోమంటున్న బాధితులు రాజమహేంద్రవరంలోని ఆదెమ్మ దిబ్బపై భూ రాబందులు వాలాయి. దాదాపు రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు తెరదీస్తున్నారు. ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని అరవై ఏళ్లుగా నివాసముంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. అక్కడ నాయకులుగా చెలామణి అవుతున్న వ్యక్తులను గుప్పెట్లో పెట్టుకుని ఈ దందాను సాగిస్తున్నారు. పేదలను నోరెత్తనీయకుండా చేస్తున్నారు. నగర నడిబొడ్డున గత ఇరవై రోజులుగా ఈ తంతు నడిపిస్తున్న కబ్జాదారులు ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంబాల చెరువుకు 50 మీటర్ల దూరంలో పేపర్ మిల్లు రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో పాగా వేసేందుకు పక్కా వ్యూహం రచించి పావులు కదుపుతున్నారు. 110 మంది పేదలను నిరాశ్రయులను చేస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగర నడిబొడ్డులో 36, 38 డివిజన్ల మధ్య ఆదెమ్మ దిబ్బ ప్రాంతం ఉంది. భూములు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతం చాలా విలువైనదిగా మారింది. అంతేకాకుండా కంబాల చెరువు నుంచి పేపర్మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారి, వెనుక స్వతంత్ర ఆస్పత్రి, మరో పక్క వాంబే గృహాలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్యం ఇక్కడ వ్యవసాయం జరిగేదని అక్కడి వారు చెబతున్నారు. తదనంతరకాలంలో మురుగునీటి చెరువుగా మారిపోంది.60 ఏళ్ల కిందట రాజమహేంద్రవరంలోని పేదలు ఈ చెరువును పూడ్చుకుంటూ చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. మరి కొందరు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. తాత,ముత్తాతల నుంచి ఇక్కడే జీవిస్తున్నారు. నాలుగు తరాల నుంచి ఇక్కడే బతుకుతున్నామని చెబుతున్నారు. ఇళ్లమధ్య నగరపాలక సంస్థ సిమెంటు రోడ్డు కూడా నిర్మించడమే కాకుండా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించింది. సర్వే నంబర్ 170లోని 3.54 ఎకరాల భూమిలో 110 మంది పేదలు నివసిస్తున్నారు. సిమెంటు రోడ్డుకు ఓ వైపు 36వ వార్డు పరిధిలో 56 ఇళ్లు, మరోవైపు 38వ డివిజ¯ŒS పరిధిలో 54 ఇళ్లున్నాయి. ఈ భూమి ఎవరిది? ఈ భూమిపై పలువాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ కరణంగా పనిచేసిన సత్యవోలు పాపారావు తన భూమిగా చెప్పకునేవారని ప్రచారం జరుగుతోంది. స్థానింకగా ఉంటున్నవారు తమదండ్రులు ఈ పొలంలో వ్యవసాయం చేసేవారని, పంటను పాపారావు, తాము చెరిసగం తీసుకునేవారమని పేర్కొంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భూములని, ఆయన కరణంగా పనిచేయడంతో చాలా భూములు ఆయనవనే డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయనే వాదన మరికొందరు వినిపిస్తున్నారు. ఆయన మృతి చెందిన తర్వాత దాదాపు 40 ఏళ్లుగా ‘ఈ స్థలం మాదని’ ఎవ్వరూ రాలేదని అక్కడి పేదలు చెబుతున్నారు. తనదేనంటూ... ఈ మధ్యకాలంలో కొలమూరుకు చెందిన ఓ వ్యక్తి వచ్చి ‘పాపారావు అన్న కుమారుడి వద్ద ఈ స్థలం కొన్నా’నంటూ స్థలం ఖాళీ చేయాలని పేదలను బెదిరిస్తున్నాడు. తాను ఈ స్థలం కొన్నానని, ఖాళీ చేయకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించడమే కాకుండా తొలగించే పనిలో కబ్జాదారులున్నారు. పేదలను భయపెట్టి తమ మనుషులతో ఇళ్లు పీకేయిస్తున్నారు.. ఇప్పటికే 38వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న 54 ఇళ్లను తొలగించారు. సోమవారంలోపు 36వ డివిజ¯ŒSలో ఉన్న 56 కుంటుంబాల వారు ఖాళీ చేయాలని లేకపోతే తానే పీకేయిస్తానని బెదిరిస్తున్నారని అక్కడి వారు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఇక్కడ గజం స్థలం విలువ దాదాపు రూ.50 నుంచి రూ.60 వేలు ఉంటుంది. ఈ లెక్కన ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లుకు పైగానే ఉంది. రూ.50 వేలు ఇస్తాం ఖాళీ చేయాలంటున్నారు మా తల్లిదండ్రుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. నేను ఇక్కడే పుట్టాను. చిన్నబడ్డీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం. ఇప్పటికిప్పడు ఎవరో వచ్చి ఈ స్థలం మేము కొన్నాం ఖాళీ చేయాలంటున్నారు. రూ.50వేలు ఇస్తారు ఖాళీ చేయక తప్పదంటూ మా డివిజ¯ŒS కార్పొరేటర్ తంగెళ్ల బాబి నా వద్దకు పదిసార్లు వచ్చారు. బడ్డీకొట్టుకు నగర పాలక సంస్థ పన్ను వేస్తోంది. కరెంటు బిల్లు కడుతున్నాం. దీనిపై మేము కోర్టుకు వెళుతున్నాం. – తురాయి సూర్యనారాయణరావు, ఆదెమ్మదిబ్బ వాసి ఈ వయస్సులో ఎక్కడిపోవాలయ్యా? 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇళ్లలో పాచిపనులు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ గూడు కూడా పోతే మాకు దిక్కెంటి? నా కుమారుడికి మతిస్థిమితం లేదు. కోడలు చనిపోయింది. ఏడేళ్ల నా మనవడితో ఎక్కడికిపోవాలి. ఎవరో ఈ స్థలం కొన్నారని మా గుడిసెలు తొలగిస్తున్నారు. మాకు డబ్బులు ఇస్తామంటున్నారు. – మీసాల సత్యవతి, ఆదెమ్మదిబ్బ వాసి. -
నకిలీ పత్రాల తయారీ ముఠా అరెస్ట్
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): నకిలీ పత్రాలను తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కడప అర్బన్‌లో మంగళవారం జరిగింది. వివరాలు..ర వీంద్ర నగర్‌కు చెందిన సయ్యద్ జైనుల్లా అబిబుల్ పట్టణంలో ట్రావెల్ వర ల్డ్ షాపును నడుపుతున్నాడు. ఈ క్రమంలో పాస్‌పోర్టును పోగోట్టుకున్న బచ్చావలే షౌకత్‌అలీ అబిబులాను సంప్రదించి కొత్త పాస్‌పోర్టును ఇప్పించాలని కోరాడు. అందుకు గాను రూ. 4000 నగదును ముట్టజెప్పాడు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో షౌకత్‌అలీ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అతన్ని అదపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. పోలీసులు వెంటనే అబిబుల్ను, అతనికి సహాకరిస్తున్న షేక్ మహమ్మద్ గౌస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరితో సంబంధం ఉన్న సాయిపేటకు చెందిన ఏబీ ప్రింటర్స్ షాప్ నిర్వాహకుడు ఖాజా మోహినుద్దీన్ను అరెస్ట్ చేశారు. వీరందరు పాస్‌పోర్టు పరిశీలనకు కావాల్సిన నకిలీ పత్రాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా వీరు డెత్, బర్త్, విద్యాపరమైన, పోలీస్ వెరీఫీకేషన్ పత్రాల నకల్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు తనిఖీల్లో తేలింది. -
నకిలీల దర్జా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో నకిలీ దందాలు దర్జా వెలగబెడుతున్నాయి. అసలు వ్యక్తులు మాత్రం వెలవెలబోతున్నారు. నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగళ్లు జిల్లాలో విచ్చలవిడిగా చెలామణీలో ఉన్నట్లు ఇప్పటికే ‘సాక్షి’ పలుమార్లు అధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. వీటిపై ఒకపక్క అధికారుల విచారణ కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు నకిలీ దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకులను బురిడీ కొట్టించి ఎటువంటి అర్హతలు లేనివారు సైతం లక్షలాది రూపాయల రుణాలు ఎగరేసుకుపోతుంటే.. సొంత భూమి ఉండి, ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అసలు రైతన్నలు మాత్రం రుణాలు, ఇతరత్రా రాయితీలు అందుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ వ్యవహారంలో దళారులతోపాటు రెవెన్యూ, బ్యాంకుల సిబ్బంది కూడా కీలక పాత్రధారులేననడం అతిశయోక్తి కాదు. జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు, టైటిల్డీడ్లు వేల సంఖ్యలోనే ఉండగా, మొదటిసారి రెండేళ్ల క్రితం అధికారులు గుర్తించారు. అప్పట్లో ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోందే తప్ప నకిలీ పుస్తకాల తయారుదారులనే గుర్తించలేకపోయా రు. పైగా నకిలీ పాస్ పుస్తకాలు ఉన్నందున లావేరు మండలంలోని పాస్‌పుస్తకాలన్నీ రద్దుచేసి రైతులకు కొత్తవి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇది కూడా రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఎక్కడపడితే అక్కడ రైతులు కాని రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకులను బహిరంగ దోపిడీ చేస్తున్నారు. లక్షల్లో రుణాలు తీసుకుంటున్నారు. ఇటువంటివారు వాటిని తిరిగి చెల్లిస్తున్న దాఖలాలు కూడా తక్కువే. పైగా రుణమాఫీ సమయంలో వీరి రుణాలు రద్దయ్యాయి. తిరిగి వీరే మళ్లీ కొత్త రుణాలు తీసుకుంటున్నారు. ఆమదాలవలస మండలం కట్యాచార్యులపేటకు చెందిన సనపల చలపతిరావు గత ఏడాది బ్యాంకులను మోసం చేసి నకిలీ పాస్‌పుస్తకాలతో రుణం పొందాడు. ఈ ఏడాది కూడా రుణం పొందేందుకు ఆంధ్రా బ్యాంకులో దరఖాస్తు చేయగా అధికారులు క్షేత్ర పరిశీలన చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితమే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ నకిలీ పాస్ పుస్తకాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని లావేరు మండలంలోనే ఇవి మొదటిసారి వెలుగుచూశాయి. ఈ మండలంలోని పోతయ్యవలస గ్రామంలో సుమారు వంద నకిలీ పాస్‌పుస్తకాలు ఉన్నాయి. గతంలో ఈ గ్రామం నుంచి నకిలీ పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకున్న వారు రుణమాఫీ సౌకర్యాన్ని కూడా పొందారు. ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన రైతుల జాబితాల్లోనూ చేరి బీమా సొమ్ము సైతం అందుకున్నారు. ఇదే మండలం బుడమూరు గ్రామ పాలసేకరణ కేంద్రం వద్ద ఒక వ్యక్తి 30 మందికి ఫొటోలు తీసి నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి అదపాక ఆంధ్రా బ్యాంకులో రుణాలు పొందాడు. ఇంతవరకు ఇతనిపై చర్యలు లేవు. ఆ తరువాత జి. సిగడాం, రణస్థలం మండలాల్లోనూ గుర్తించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలంలో నకిలీలు బయటపడిన ఉదంతాలు ఉన్నాయి. మరోవైపు మీసేవలో నకిలీ అడంగళ్ కాపీలు రావడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బూర్జ మండలంలోని కొల్లివలస గ్రామంలో మొదట అధికారులు గుర్తించారు. ఆ తరువాత రాజాంలో వెలుగు చూశాయి. ఇటీవల ఆమదాల వలసలోనూ మీసేవలో నకిలీ అడంగళ్ కాపీలు బయటకు వచ్చాయి. అంటే నకిలీపాస్ పుస్తకాలతో పాటు నకిలీ అడంగళ్ కాపీలు కూడా విచ్చలవిడిగా తయారువుతున్నాయి. పాస్ పుస్తకాల రద్దుతో అసలు రైతుల అవస్థలు లావేరు మండలంలో నకిలీ పాస్‌పుస్తకాలు ఉన్నాయనే ఫిర్యాదులు రావడంతో మండలంలోని రైతులందరి పాస్ పుస్తకాలు చెల్లవని ప్రకటించి రద్దు చేశారు. సరైన డాక్యుమెంట్లతో పాస్ పుస్తకాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే తాత తండ్రుల నుంచి వారసత్వంగా తమకు రిజిస్టర్డ్ భూములు ఉన్నాయని, వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరడంతో అప్పట్లో అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల ఆవేదన విన్న తరువాత కొత్త పాస్‌పుస్తకాల కోసం 6ఎ క్లెయిమ్ దాఖలు చేయాలని రైతులను కోరారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పాస్‌పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ మూడు నెలలపాటు కొనసాగింది. అయినా అర్హులైన వారందరికీ పాస్‌పుస్తకాలు ఇవ్వలేకపోయారు. అప్పటి జేసీ చొరవతో టాస్క్‌ఫోర్స్ అర్హులైన రైతులను గుర్తించి కొత్త పుస్తకాలు ఇచ్చేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ ఆరు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వారిచ్చిన నివేదికల ఆధారంగా ఇప్పటి వరకు 450 మందికి పుస్తకాలు ఇచ్చారు. ఇంకా 350 మందికి ఇవ్వాల్సి ఉంది. అయితే జిరాయితీ భూములున్న రైతుల వద్ద ఆధారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి రైతులకు అనుభవదారు సర్టిఫికెట్ మాత్రమే ఇస్తున్నామని వారు చెబుతున్నారు. అసలు రికార్డులు గల్లంతు ఈ మండలంలో పూర్వపు రికార్డులు గల్లంతు కావడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అనేక మంది రైతుల వద్ద సరైన డాక్యుమెంట్లు లేవు. రెవెన్యూ శాఖ వద్ద రికార్డులు లేవు. ఇదే రైతులకు శాపంగా మారింది. సమగ్ర సర్వే చేసి గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం కొత్త రికార్డులు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి దొంగల వేటలో అధికారులు రెవెన్యూ శాఖకు తెలియకుండా పాస్‌పుస్తకాలు బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కోణంలోనే ఆ శాఖ విచారణ కొనసాగిస్తోంది. పాస్‌పుస్తకాలు అసలు ఈ జిల్లాకు సంబంధించినవా, వేరే జిల్లాల నుంచి తెచ్చుకున్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. ప్రధానంగా వీఆర్వోల వద్ద నుంచే పాస్‌పుస్తకాలు వెళుతున్నాయనే అనుమానం ఉంది. పాస్ పుస్తకాలు ఎలా బయటకు వెళుతున్నాయనేది తేలితే దొంగ సంతకాలు ఎవరు చేస్తున్నారనేది కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే సరైన కోణంలో దర్యాప్తు సాగడం లేదనే విమర్శలున్నాయి. విచారణ జరుగుతోంది: ఆర్డీవో గణేష్‌కుమార్ నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ అడంగల్ కాపీల విషయమై విచారణ జరుగుతోందని శ్రీకాకుళం ఆర్డీవో జి గణేష్‌కుమార్ తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. లావేరు మండలంలో పాస్‌పుస్తకాలు తీసుకోవాల్సిన వారు సరైన భూమి హక్కు పత్రాలు చూపించి పొందవచ్చని చెప్పారు. అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. -
ఆర్డీఓ, తహశీల్దార్ల ‘ఫోర్జరీ’లతో పట్టాపాస్ పుస్తకాలు
శివ్వంపేట, న్యూస్‌లైన్: రెవెన్యూ అధికారులు, రాజకీయ బడాబాబుల అండదండలతో నకి‘లీలలు’ జోరుగా సాగుతున్నాయి. భూమికి సంబంధించిన పట్టాపాస్ పుస్తకాలు నకిలీవి తయారుకావడంతో ప్రభుత్వం నుంచి అందె లబ్ధి పక్కదారి పడుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడుతోంది. అయినా ఉన్నతాధికారుల దృష్టి ఈ సమస్యపై పడకపోవడం బాధాకరం. రుణాల కోసం బ్యాంక్‌కు ఇటీవల వచ్చిన పలు పట్టాదార్ పాస్‌పుస్తకాలు నకిలీవని అనుమానం రావడంతో తహశీల్దార్ కార్యాలయానికి పరిశీలన కోసం బ్యాంకు సిబ్బంది పం పించారు. దీంతో అసలు బాగోతం బయటకు వచ్చింది. గత కొంతకాలంగా రెవెన్యూ, రాజకీయ నాయకుల అండతో నకిలీ బాగోతం నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, పట్టాభూములకు సంబంధించి పలు గ్రామాల్లో నకిలీ పట్టాదార్ పుస్తకాలు వెలుగులోకి వస్తుండడంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనలు ఇవేమి కొత్తకాదు. గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నకి‘లీలలు’ పెరిగిపోయాయి. రికార్డులకన్న ఎక్కువ భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉన్న భూమి కంటె పలు గ్రామాల్లో రైతుల వద్ద అధికంగా ఉన్నట్లు సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇందులో నకిలీవి చలామణి అవుతుండడంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పలువురు రెవె న్యూ, రాజకీయ నాయకుల అండతోనె నకిలీ భాగోతం యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. శివ్వంపేట మండలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావడంతో భూముల ధరలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇదేఅదనుగా భావించి నకిలీ ధృవీకరణ పత్రాలకు తెరలేసింది. 2010-11 సంవత్సరంలో శివ్వంపేట ఇండియన్ బ్యాంకు, నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంకుల్లో రుణాల కోసం పలువురు రైతులు దరఖాస్తు చేసుకోగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు రెవెన్యూ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగలేదు. సంవత్సరం క్రితం పెద్దశంకరంపేట మండలంలో వందలాది నకిలీ పట్టాదార్‌పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో లక్షలాది రూపాయల నిధులు కాజేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. రెవెన్యూ ఆఫీస్‌కు నకిలీ పుస్తకాలు మండలంలోని పాంబండ, చెండి, రత్నాపూర్ గ్రామాలకు సంబంధించి నకిలీ పట్టాపాస్ పుస్తకాలు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చా యి. పాంబండకు చెందిన పలువురు రైతులు శబాష్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీఐసీఐ బ్యాంకులో రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు బ్యాంకు సిబ్బంది పత్రాల ధృవీకరణ కోసం తహశీల్దార్ కార్యాలయానికి పంపించగా ఫోర్జరీ సంతకాలతో ఉన్న నకిలీ పుస్తకాల విషయం రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. దీంతోపాటు జులై నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెవెన్యూ సిబ్బంది బిజీగా ఉన్నారు. జులై 27వ తేదీ ఉప తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పహాణీనిసైతం తయారు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తహశీల్దార్ కిష్టారెడ్డి ‘న్యూస్‌లైన్’తో అన్నారు. అందుకు సంబంధించి పట్టాపాస్‌పుస్తకాలు తమ ఆధీనంలో ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించడంతోపాటు నకిలీ పుస్తకాల తయారీ, ఫోర్జరీ సంతకాల గురించి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ విషయంపై ఎస్ఐ నాగేశ్వర్రావు స్పందిస్తూ నకిలీపట్టాదార్పాస్ పుస్తకాల గురించి ఫిర్యాదు అందిందని అందుకు సంబంధించిన వ్యక్తులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నామని తెలిపారు. త్వరలో నకిలీ రాకెట్ ముఠా గుట్టురట్టు చేస్తామని చెప్పారు.