సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని పాయకాపురంలో గీత అనే మహిళ పేరిట ఆస్తికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఉంది. దీనిని గుర్తించిన కేటుగాళ్లు అదే ప్రాంతంలో నివశిస్తున్న విజయలక్ష్మి పేరును ఆధార్ కార్డులో గీతగా మార్పించి.. రూ.12 లక్షల విలువైన ఇంటిస్థలాన్ని ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భవానీపురంలో మేర కోటేశ్వరరావు అనే వ్యక్తి రిజిస్ట్రార్ కార్యాలయంలో లభ్యం కాని డాక్యుమెంట్లను గుర్తించి.. వాటిని వేరే వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. సదరు ఆస్తులను తన కొడుకు శ్రీనివాసులు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. కొందరు లేఖరుల సాయంతో దర్జాగా సాగిపోతున్న దందాలు విశాఖపట్నంలో లాగిన తీగతో విజయవాడలో వెలుగులోకి వచ్చాయి.
ఇలా బయటపడింది..
విశాఖపట్నానికి చెందిన ఎన్.వెంకటేశ్వరావు అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కోసం దరఖాస్తు చేయగా.. తన స్థలాన్ని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి రాజు చైతన్య అనే వ్యక్తికి విజయవాడలోని గాంధీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం డొంక కదిలింది. ఈ ఫిర్యాదుతో మేల్కొన్న సబ్ రిజిస్ట్రార్లు తెలివిగా వ్యవహరించి నిందితుడిని పిలిపించి, రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు.
తిరిగి అతనిపైనే గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నకిలీ డాక్యుమెంట్లను ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సహకరిస్తున్న వ్యక్తులెవరనేది కూపీ లాగుతున్నారు. కాగా, ప్రస్తుతం గుణదలకు చెందిన రాజుచైతన్య పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి ముగ్గురు వ్యక్తులతో కూడిన బృందం సహకరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు.
దొంగ రిజిస్ట్రేషన్లు ఇలా..
ప్రధానంగా ఆధార్ కార్డులో పేరు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆధార్ కార్డుల మార్పిడి ఇందిరాగాం«ధీ స్టేడియం సమీపంలో సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒరిజనల్ రికార్డుల మాదిరి డాక్యుమెంట్లు సృష్టించడంలో నిష్ణాతులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిణామాలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో కొందరు కేటుగాళ్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ కొన్ని ఆస్తులకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు.
ఆ డాక్యుమెంట్ లేకపోతే సంబంధిత సిబ్బంది ‘నాట్ ఫౌండ్’ అని సమాచారమిస్తారు. దీంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మేర కోటేశ్వరావు అనే వ్యక్తితో కూడిన బృందం ఆరితేరినట్టు గుర్తించారు. కోటేశ్వరరావు విజయవాడలోని దేవీపేటలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు.
ఈ తరహాలో ఇప్పటికే నున్న, గాంధీనగర్, మైలవరం, గుణదల, పటమట, మైలవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. నున్న ప్రాంతంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఫేక్ డాక్యుమెంట్ల తయారీకి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరికి ప్రధానంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది, దస్తావేజు లేఖరులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, కొందరు సబ్‌రిజిస్ట్రార్‌లు సైతం సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment