మిర్యాలగూడ : పది సంవత్సరాలుగా మిర్యాలగూడ ఎల్‌ఐసీ కార్యాలయంలోనే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎల్‌ఐసీ పాలసీల గురించిన ఆయనకు అన్నీ తెలుసు. తన అవసరాల మేరకు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేయాలని పథకం వేసి సక్సెస్ అయ్యాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. వివరాలు.. మిర్యాలగూడ ఎల్‌ఐసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిషన్ తన భార్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. వాటితో తన భార్య పేరున ఉన్న రూ.2.5 లక్షల పాలసీని రెండు విడుతలుగా ఐదు లక్షల రూపాయలను డ్రా చేశాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన విధులు నిర్వర్తిస్తున్నాడు.
విజిలెన్స్ తనిఖీలతో బయటపడిన వైనం..
నకిలీ డాక్యుమెంట్లతో ఐదు రూ.లక్షలు స్వాహా చేసిన విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్‌ఐసీ విజెలన్స్ అధికారులు, డివిజనల్ అధికారులతో కలిసి సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 14న సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అతడికి కార్యాలయ అధికారులు గానీ, ఏజెంట్లు గానీ సహకరించినట్లు సమాచారం. ఎవరు సహకరించారనే విషయంపై డివిజనల్ అధికారులు విచారణ చేపట్టారు.
గోప్యంగా ఉంచుతున్న అధికారులు..
అక్రమాలకు పాల్పడిన ఎల్‌ఐసీ ఉద్యోగి సస్పెండ్ అయినా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మాత్రం విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఉద్యోగి తన భార్య పేరున డ్రా చేసిన డబ్బులు వివరాలు ఎక్కడా చెప్పడంలేదు. సదరుడాక్యుమెంట్‌లను పరిశీలించిన అధికారి ఎవరనే విషయం కూడా స్థానిక అధికారులకు తెలిసినా వెల్లడించడం లేదు.
సస్పెండ్ చేశాం
ఎల్‌ఐసీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి కిషన్ నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఉన్నతాధికారులు తేల్చారు. ఆయనను వెంటనే ఈ నెల 14న సస్పండ్ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఎల్‌ఐసీ డివిజనల్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.
– ప్రసాద్, మేనేజర్, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment