సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించే వాళ్లను తరచూ చూస్తుంటాం. అయితే రెండు కంపెనీలకు చెందిన వారు మాత్రం ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టి రూ.4 కోట్లు ‘లాభం’ పొందారు. ఆ స్థలంపై నకిలీ పత్రాలను సృష్టించి వాటి ఆధారంగా మహారాష్ట్ర బ్యాంకు కు టోకరా వేశారు. ఈ రెండు సంస్థలూ ఒకే ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని దర్జాగా తనఖా పెట్టడం విశేషం. వాయిదాల చెల్లింపులు నిలచిపోవడంతో విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు రెవెన్యూ, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
దీనిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఉన్న గోల్కొండ క్రాస్‌రోడ్స్ చిరునామాతో బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. దీనికి పి.నారాయణ మేనేజింగ్ డైరెక్టర్, రాయపూడి రమాదేవి డైరెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం రుణం కోసం ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకును ఆశ్రయించారు. దీనికోసం హామీగా బీకే గూడలోని సర్వే నెం.155లో 500 గజాల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్లు, అది తమ కంపెనీకి చెందినదేనని.. చూపే రిజిస్ట్రేషన్ సేల్‌డీడ్‌ను (నెం.435/2013) చూపించారు. దీని ఆధారంగా ఆ ఆస్తిని తనఖా పెడుతూ 2013 ఫిబ్రవరిలో రూ. 2 కోట్ల రుణం తీసుకున్నారు.
మరో వ్యవహారం కూడా...
బేకీస్ ఫుడ్స్ బాటలోనే... అన్నా ఇకో లాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇలాంటి వ్యవహారమే నడిపింది. ఈ సంస్థ శానిటరీ నాప్‌కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ తదితరాలు తయారు చేసి అమ్ముతుంది. వీటితో పాటు నేచురల్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, క్రైసెస్ మేనేజ్‌మెంట్, ఉమెన్ ఎన్‌పవర్‌మెంట్, చిల్డ్రన్ డెవలప్‌మెంట్ తదితర కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అనేక స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంది. దీని డైరెక్టర్లు జి.శ్రీకర్, వై.వెంకటేశ్‌లు రుణం పొందాలని భావించారు. వీరూ ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకు శాఖనే ఆశ్రయించారు. ఎస్‌ఆర్‌నగర్ బీకేగూడలో 500 గజా ల స్థలంలో ఉన్న ఇల్లు తమదేనంటూ అందుకు చెంది న డాక్యుమెంట్స్ (నెం.437/13) దాఖలు చేశారు. దీన్ని తనఖా పెట్టి ప్యానల్ అడ్వకేట్‌తో న్యాయ సలహా కోసం బ్యాంకునకు అందించారు. దీంతో బ్యాంకు వారికీ 2013లో ఫిబ్రవరిలోనే రూ.2 కోట్లు మంజూరు చేసింది.
రూ.4 కోట్ల రుణం పొందిన రెండు సంస్థలూ వాయిదాలు చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేసే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారు తమ బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ల వివరాలతో అమీర్‌పేట తహసీల్దార్‌కు లేఖ రాశారు. ఆ ఆస్తులకు చెందిన పూర్తి రికార్డులు కోరుతూ డీమార్క్ చేయాలని అభ్యర్థించారు. ఈ రెండు కంపెనీలు బ్యాంకునకు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆయా సర్వే నంబర్లలోని స్థలాలు రహమాన్ మంజిల్ ప్రభుత్వ పాఠశాలతో పాటు, సయ్యద్ పటేల్ భాషాలకు చెందిన స్థలాలుగా రికార్డులో ఉన్నాయని బ్యాంకుకు తెలిపారు. దీంతో నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేశారని గుర్తించిన బ్యాంకు జోనల్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment