శివ్వంపేట, న్యూస్‌లైన్: రెవెన్యూ అధికారులు, రాజకీయ బడాబాబుల అండదండలతో నకి‘లీలలు’ జోరుగా సాగుతున్నాయి. భూమికి సంబంధించిన పట్టాపాస్ పుస్తకాలు నకిలీవి తయారుకావడంతో ప్రభుత్వం నుంచి అందె లబ్ధి పక్కదారి పడుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడుతోంది. అయినా ఉన్నతాధికారుల దృష్టి ఈ సమస్యపై పడకపోవడం బాధాకరం. రుణాల కోసం బ్యాంక్‌కు ఇటీవల వచ్చిన పలు పట్టాదార్ పాస్‌పుస్తకాలు నకిలీవని అనుమానం రావడంతో తహశీల్దార్ కార్యాలయానికి పరిశీలన కోసం బ్యాంకు సిబ్బంది పం పించారు. దీంతో అసలు బాగోతం బయటకు వచ్చింది. గత కొంతకాలంగా రెవెన్యూ, రాజకీయ నాయకుల అండతో నకిలీ బాగోతం నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, పట్టాభూములకు సంబంధించి పలు గ్రామాల్లో నకిలీ పట్టాదార్ పుస్తకాలు వెలుగులోకి వస్తుండడంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనలు ఇవేమి కొత్తకాదు. గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నకి‘లీలలు’ పెరిగిపోయాయి.
రికార్డులకన్న ఎక్కువ భూమి
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉన్న భూమి కంటె పలు గ్రామాల్లో రైతుల వద్ద అధికంగా ఉన్నట్లు సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇందులో నకిలీవి చలామణి అవుతుండడంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పలువురు రెవె న్యూ, రాజకీయ నాయకుల అండతోనె నకిలీ భాగోతం యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. శివ్వంపేట మండలం హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావడంతో భూముల ధరలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇదేఅదనుగా భావించి నకిలీ ధృవీకరణ పత్రాలకు తెరలేసింది. 2010-11 సంవత్సరంలో శివ్వంపేట ఇండియన్ బ్యాంకు, నర్సాపూర్ ఎస్‌బీఐ బ్యాంకుల్లో రుణాల కోసం పలువురు రైతులు దరఖాస్తు చేసుకోగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు రెవెన్యూ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగలేదు. సంవత్సరం క్రితం పెద్దశంకరంపేట మండలంలో వందలాది నకిలీ పట్టాదార్‌పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో లక్షలాది రూపాయల నిధులు కాజేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
రెవెన్యూ ఆఫీస్‌కు నకిలీ పుస్తకాలు
మండలంలోని పాంబండ, చెండి, రత్నాపూర్ గ్రామాలకు సంబంధించి నకిలీ పట్టాపాస్ పుస్తకాలు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చా యి. పాంబండకు చెందిన పలువురు రైతులు శబాష్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీఐసీఐ బ్యాంకులో రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు బ్యాంకు సిబ్బంది పత్రాల ధృవీకరణ కోసం తహశీల్దార్ కార్యాలయానికి పంపించగా ఫోర్జరీ సంతకాలతో ఉన్న నకిలీ పుస్తకాల విషయం రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. దీంతోపాటు జులై నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెవెన్యూ సిబ్బంది బిజీగా ఉన్నారు. జులై 27వ తేదీ ఉప తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పహాణీనిసైతం తయారు చేశారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తహశీల్దార్ కిష్టారెడ్డి ‘న్యూస్‌లైన్’తో అన్నారు. అందుకు సంబంధించి పట్టాపాస్‌పుస్తకాలు తమ ఆధీనంలో ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించడంతోపాటు నకిలీ పుస్తకాల తయారీ, ఫోర్జరీ సంతకాల గురించి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ విషయంపై ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు స్పందిస్తూ నకిలీపట్టాదార్‌పాస్ పుస్తకాల గురించి ఫిర్యాదు అందిందని అందుకు సంబంధించిన వ్యక్తులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నామని తెలిపారు. త్వరలో నకిలీ రాకెట్ ముఠా గుట్టురట్టు చేస్తామని చెప్పారు.
ఆర్డీఓ, తహశీల్దార్ల ‘ఫోర్జరీ’లతో పట్టాపాస్ పుస్తకాలు
Published Mon, Sep 2 2013 12:36 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM
Advertisement
Advertisement