ఇంజినీర్లే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తడం, భూసేకరణలో తీవ్ర జాప్యం, అధికార పార్టీ నాయకులు ముడుపులకు కక్కుర్తిపడటం వెరసి వందలాది మంది రైతులకు శాపంగా మారింది. బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం కమలకూరు వద్ద 1500 ఎకరాల్లో వరి పంట ఎండిపోతుండటంతో గాలికొదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. 11.93 కోట్ల రూపాయల పనులు పర్యవేక్షణ లేకపోవడంతో ఎందుకూ కొరగాకుండా పోయాయి. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, అధికార పార్టీ నేతల జేబులు నింపేందుకే పనికొచ్చాయి. ప్రస్తుతం కట్ట తెగిన పనులను మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు విడుదల చేయాలన్నా నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది.
అణువణువునా నిర్లక్ష్యమే!
సగిలేరు ఆనకట్ట ప్రారంభం నుంచే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. భూసేకరణలో రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేశారు. కాంట్రాక్టు పొందిన ప్రధాన కాంట్రాక్టర్ పనులు చేయకుండా సబ్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతోనే సమస్య మొదలైంది. మొదట చేసిన సబ్ కాంట్రాక్టర్ పనులను కొంతవరకు బాగానే చేశారు. భూసేకరణ జాప్యం అవుతుండటంతో పనులను చేయలేక చేతులేత్తేశారు. దీంతో రెండవసారి ఓ ఇంజినీరే బినామీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. భూసేకరణ పనులు పూర్తి కాకుండానే కాంక్రీటు గోడను పూర్తి స్థాయిలో కట్టారు. ప్రారంభంలోనే కట్ట పని చేయకుండా చుట్టూ కట్ట వేశారు. ఇదే తెగడానికి ప్రధాన కారణమైంది. ై
రెతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం మేరకు కట్టలు పూర్తయిన తర్వాత కాంక్రీట్ గోడలు కట్టి ఉంటే ఇంత ఉపద్రవం వచ్చేది కాదని పేర్కొంటున్నారు. రెండు అడుగుల మేర కాంక్రీట్ గోడను కట్టకుండా వదిలి వేసివున్నా నీరు దానిగుండా వెళ్లేవని పలువురు చెబుతున్నారు. త్వరితగతిన బిల్లులు చేసుకోవాలనే కక్కుర్తితోనే భూసేకరణతో నిమిత్తం లేకుండా, ప్రారంభంలోనే కట్ట పూర్తి కాకున్నా కాంక్రీటు పనులు పూర్తి చేయడంతోపాటు చుట్టూ కట్టలను సైతం నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మించిన కట్టలు కూడా కొన్నిచోట్ల తెగిపోయాయి. అంటే వీటి నాణ్యత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పనులు చేశారిలా..
2009 అక్టోబరులో రూ. 6.30 కోట్లతో సగిలేరు ఆనకట్టకు టెండర్లను ఖరారు చేశారు. ఏడాది కాలపరిమితిలో పనులు నిర్మించాలని గడువు విధించారు. అయితే చుట్టూ కట్టలు పెంచడంతోపాటు భూసేకరణ పనుల కోసం దాని అంచనాలను మళ్లీ రూ.11.93 కోట్లకు పెంచారు. రెండేళ్ల ముందే 101 ఎకరాల భూసేకరణ కోసం రెవెన్యూశాఖకు ఇరిగేషన్ వారు రూ.2.12 కోట్లు చెల్లించారు. అయినప్పటికీ భూసేకరణ గురించి వారు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర జాప్యం జరిగింది. భూసేకరణ పూర్తయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. దీనికితోడు పనులు పూర్తి కాకుండానే రాజకీయ నాయకుల జోక్యంతో నీటిని నిలపడం కూడా మరో కారణం. ఇప్పటికే 90 శాతానికి పైగా నిధులు ఖర్చయ్యాయి. మిగిలింది అరకొర మాత్రమే. ఇన్ని కోట్లు ఖర్చయినా కట్ట తెగిపోవడంతో వ ృథానే అయింది. మళ్లీ దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేయాలంటే కొత్తగా అంచనాలు రూపొందించి నిధుల కోసం ఎదురు చూడాల్సిందే.
లబోదిబోమంటున్న రైతన్నలు
రాజకీయ నాయకుల మాటలతోపాటు సగిలేరు ఆనకట్ట వద్ద ఉన్న నీటిని నమ్ముకుని నాలుగు గ్రామాల ప్రజలు 1500 ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేశారు. ఇప్పుడు కట్ట తెగడంతో వరి పంటకు నీరందడం లేదు. పంట ఎండిపోతోంది. ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులు తక్షణమే చేరుకుని కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని, వరిపంట ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
- సాక్షి, కడప/అట్లూరు, న్యూస్‌లైన్
రైతులను ఆదుకునే యత్నం
వరి పంట సాగు చేసిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలో అన్ని మార్గాలను వెతుకుతాం. భూసేకరణలో జాప్యం, గతంలో జరిగిన కొన్ని పొరపాట్లతో ఈ దుస్థితి నెలకొంది. మొత్తం పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు నీరిచ్చే ప్రయత్నాలుచేస్తాం.
- రమేష్, ఎస్‌ఈ, ఇరిగేషన్
‘‘ఫోటోలోని రైతు మన్యంవారిపల్లెకు చెందిన కత్తెరపల్లె రామసుబ్బారెడ్డి. ఈయన కమలకూరు వద్ద నిర్మించిన సగిలేరు ఆనకట్టను నమ్ముకుని నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు.రూ.50 వేల పెట్టుబడి పెట్టాడు. రాజకీయ నాయకుల జోక్యం, నాసిరకం పనుల పుణ్యమా అని కట్ట తెగిపోయింది. నీళ్లు వృథాగా పోయాయి. ప్రస్తుతం వరి పంటకు నీళ్లు లేవు. ఎండిపోతోంది. పైరును గాలికి వదిలేయాల్సి వస్తోంది. దీన్ని నమ్ముకోకుండా ఆరుతడి పంటలు వేసుకుని ఉంటే పెట్టుబడి మిగలడంతోపాటు కొంత సొమ్ము వచ్చేది. ఇప్పుడు అన్ని విధాలా నష్టపోయాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.’’అంటున్నాడు.
‘‘ఇతను కమలకూరుకు చెందిన రైతు సిద్ధారెడ్డి. రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు. కట్ట తెగినప్పుడు వరి పంట మునిగి ఆందోళన చెందాడు. ఇప్పుడేమో నీళ్లు లేక పంట ఎండుతుంటే చూసి కన్నీటి పర్యంతమవుతున్నాడు’’.
స్వాహాలో సరి(గి)లేరు
Published Thu, Nov 21 2013 2:19 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement