రాజకీయ ‘ప్రభంజనం’ | prbhanjanam movie is a political drama | Sakshi
Sakshi News home page

రాజకీయ ‘ప్రభంజనం’

Published Sun, Oct 6 2013 12:10 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

రాజకీయ ‘ప్రభంజనం’ - Sakshi

రాజకీయ ‘ప్రభంజనం’

 ఆరు పదుల స్వతంత్ర భారతం స్థితిగతులపై నలుగురు ఇంజినీర్లు చేసే పరిశోధనలో ఊహకందని విషయం బయటపడుతుంది. దేశం వెనకబాటుతనానికి ప్రధాన కారణం... ఎవరికీ అంతుచిక్కని ఓ అంశమని తెలుసుకున్న ఆ ఆరుగురు తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటి? మన రాజ్యాంగంలోని లొసుగుల్ని, బలహీనతల్ని ఆసరాగా తీసుకొని దేశ క్షామానికి కారకులవుతున్న రాజకీయ నాయకులపై ఎలాంటి అస్త్రాలను ఉపయోగించారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ఫేం అజ్మల్, సందేష్, శ్రీఐరా, నక్షా శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
 
 ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జేడీ లక్ష్మినారాయణ కెమెరా స్విచాన్ చేయగా, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ క్లాప్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘ఓటర్లను ఎడ్యుకేట్ చేయడం, హెజిటేట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం... మా సినిమా లక్ష్యం ఇదే. సమసమాజ స్థాపనకోసం నలుగురు వ్యక్తులు సాగించిన సమరమే మా సినిమా కథ. సిరివెన్నెల సాహిత్యం, ఆర్పీపట్నాయక్ స్వరాలు ఈ కథకు ఆభరణాలు. జనానికి ఉపయోగపడే సినిమా అవుతుంది’’ అని చెప్పారు.
 
 ‘‘సమాజం స్థితిగతులపై ‘బ్రోకర్’ సినిమాలో కొంత చూపించాను. కానీ చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి భాస్కరరావు. ఆయన కథ చెప్పాక ఉద్వేగానికి లోనై ఈ సినిమాకు స్వరాలందించడానికి అంగీకరించాను’’ అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ప్రతి భారతీయుడూ చూడాల్సిన సినిమా ఇదని అజ్మల్ పేర్కొన్నారు. అవకాశమిచ్చిన దర్శక నిర్మాతకు సందేష్ కృతజ్ఞత తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: మోహన్, రామారావు, నిర్మాణం: చైతన్య ఆర్ట్ క్రియేషన్స్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement