MS reddy
-
మనో బలం మన సొంతం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తేసిన తరువాతే ఎందరిపై ఏయే రూపాల్లో మానసిక ఒత్తిళ్లు పనిచేశాయి?, ఏ మేరకు వారిపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం పడిందనే దానిపై స్పష్టత వస్తుందని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, ఆయా అంశాలపై వివిధ వర్గాల వారు స్పందిస్తున్న తీరు, చూపుతున్న ధైర్యం వంటివి పరిశీలిస్తే ప్రజలపై పెద్దగా మానసిక రుగ్మతల ప్రభావం లేనట్టేనని అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న మానసిక సమస్యలు ఎదురైనా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు సాధారణ చికిత్స అందిస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా లాక్డౌన్ సమయంలో తలెత్తే మానసిక, ఇతర సమస్యలపై ‘సాక్షి’తో డాక్టర్ ఎంఎస్‌రెడ్డి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే... పేదలపైనే ఎక్కువ ప్రభావం లాక్డౌన్ సమయంలో మానసిక సమస్యల తీరు రకరకాలుగా ఉండొచ్చు. సైకోసిస్, స్కిజోఫోనియా, బైపోలార్ డిజార్డర్స్ వంటివి పెరగకపోవచ్చు. అడ్జస్ట్మెంట్, యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సాధారణ జబ్బులు పెరగొచ్చు. స్థితిమంతులు, ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారిపై కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితుల ప్రభావం పెద్దగా పడకున్నా, కిందివర్గాలు, నిరుపేదలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచం ముందుకు సరికొత్త రూపంలో రావడంతో దానినెలా ఎదుర్కోవాలో తెలియక, కేవలం అంచనాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌తో ముందుకెళ్లాల్సిందే. మానసిక ప్రశాంతతే మందు సాధారణంగా ఆహారం, ఆశ్రయం, ఉపాధివంటి వాటితో ముడిపడిన అంశాలకు సంబంధించి సమస్యలు ఏర్పడితే అయోమయం, గందరగోళం వంటివి కలుగుతాయి. ఇప్పటివరకు వీటి విషయంలో ఎలాంటి సమస్యల్లేకుండా ఉండి, లాక్డౌన్ వేళ కొత్తగా తలెత్తిన పరిస్థితుల ప్రభావం పడితే ఆదుర్దా చెందడంతో పాటు భవిష్యత్‌పై అనుమానాలు, సందేహాలు నెలకొంటాయి. ఇటువంటి సంక్షోభ సమయంలోనే విచారం, ఒత్తిడి, భయం, కోపం వంటివి కలుగుతుంటాయి. అయితే మానసిక ప్రశాంతతను సాధిస్తూ ఒత్తిళ్లు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ఆప్తులైన వారితో భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి. ‘జాగ్రత్త’మంచిదే! కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా, దగ్గు, జలుబు వచ్చినా.. అవి కరోనా లక్షణాలేమోనని సందేహించే పరిస్థితి.. కరోనాకు చికిత్సలేదని, మందులు, వ్యాక్సిన్లు లేవనే భయంతో పాటు తమకు పాజిటివ్ వచ్చి, 28రోజుల హాస్పిటల్ క్వారంటైన్‌కు పంపిస్తే ఎలా అనే ఆందోళన, ఆదుర్దా ఏర్పడటం సహజమే. అతి శుభ్రతతో పాటు అన్నింట్లో అతి జాగ్రత్తలు తీసుకునే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) లక్షణాలున్న వారు ఇటువంటి పరిస్థితుల్లో మరింత అతిగా స్పందించే అవకాశాలున్నాయి. అయితే వీరితో పాటు ఇతరులు కూడా పదేపదే చేతులు కడుక్కుంటూ శుభ్రత పాటించడం, ఆరోగ్యపరంగా, ఇతరత్రా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచి పరిణామమే. ఆర్థికంగా ప్రభావం ఎక్కువే.. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఆర్థికరంగంపై ఎక్కువగా ఉండొచ్చు. స్వస్థలాలకెళ్లిన వలస కార్మికులు తిరిగి రావడానికి కొంతకాలం పడుతుంది. ఈ ప్రభావం నిర్మాణరంగం, దాని అనుబంధ రంగాలపై ఉంటుంది. ఆటోమొబైల్, ఎంటర్టైన్మెంట్ రంగాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. చైనా నుంచి వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులను, ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు రప్పించడంలో సఫలమైతే కరోనా అనంతర పరిణామాలను కొంతమేరకైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ సత్తా మనకుంది.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులతో సహా దేశమంతా ఒక్కటిగా నిలిచి లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించి ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక స్థైర్యం, ధైర్యం, పట్టుదల భారత్‌కు, ప్రజలకు ఉన్నాయని ఇది చాటుతోంది. ఇంట్లో సర్దుబాటు సమస్యలు ఈ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండటంతో సర్దుబాటు సమస్యలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల్లో కోపం, చికాకుతో పాటు నిర్లిప్తత వంటివి ఏర్పడడంతో ఇళ్లలో గొడవలకు ఆస్కారం కలుగుతోంది. పుస్తకాలు చదవడం, సంగీతం, నాట్యం వంటి ఇతర అభిరుచులు, వ్యాపకాలు లేని వారు, స్నేహితులు అంతగా లేని వారిలో ఈ సమస్యలు ఎక్కువ. అలాగే, లాక్డౌన్లో మద్యపాన సేవనం పెరిగింది. సిగరెట్లు, గుట్కాలు అలవాటున్న వారు వాటిని తీసుకోవడం మరింత ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఇటువంటి వారు ప్రయోజనకర వ్యాపకాలను కల్పించుకోవడం ద్వారా వ్యసనాల నుంచి బయటపడవచ్చు. -
ద్రుపదుడి గర్వభంగం
యంయస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో గుమ్మడి ద్రోణాచార్యుడు, శరత్‌బాబు అర్జునుడిగా నటించారు. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘ఏమిటి ఆ ఏకవచన ప్రయోగం? అనుమతి లేకుండా అంతఃపురంలోకి ప్రవేశించినది చాలక సార్వభౌములైన మమ్ము సంస్కారహీనంగా సంభోదిస్తావా?’’ అంటూ ద్రోణుడిపై అహంకరించాడు ద్రుపద మహారాజు. ‘‘తప్పు నీది కాదు. అహం, ఐశ్వర్యం ఉచ్ఛ్వాస నిశ్వాసాల వంటివని తెలిసి కూడా నా బాల్యమిత్రుడివి కదా అభిమానించకపోతావా అని వచ్చాను’’ అన్నాడు ద్రోణుడు. ‘‘ఏమన్నావు, నీవు మాకు మిత్రుడవా?’’ అహంకారంతో మళ్లీ బుస కొట్టాడు ద్రుపదుడు. ‘‘కాదా?!’’ ఆశ్చర్యబోతూ అడిగాడు ద్రోణుడు. ‘‘ఆగర్భ సౌర్వభౌములమైన మేమెక్కడ? పుట్టు దరిద్రుడవైన నీవెక్కడ?’’ విషం చిమ్మాడు ద్రుపదుడు. ‘‘గురుకులంలో పన్నెండేళ్లు ఒకరిలో ఒకరిగా గడిపాం. పవిత్రమైన ఆ స్నేహబంధాన్ని నీవు ఇంత త్వరగా మరచిపోతావనుకోలేదు’’ గాయపడిన మనసుతో, కళ్లనీళ్లతో అన్నాడు ద్రోణుడు. ‘‘ఆపు నీ అధిక ప్రసంగం’’ ఒళ్లు తెలియని అహంకారంతో అరిచాడు ద్రుపదుడు. ఇలా కొత్త సిద్ధాంతం ఒకటి చెప్పాడు... ‘‘ఇద్దరు బాటసారులు సత్రంలో నాలుగు రోజులు కలిసి గడిపినంత మాత్రాన అది స్నేహం అవుతుందా!’’ ‘‘పూర్వాపరాలు ఏకరువు పెట్టక వచ్చిన పనిచెప్పు’’ అని ద్రోణుడిని సూటిగా అడిగాడు. ‘‘నీ సిరిసంపదలు, భోగభాగ్యాలు ఆశించి రాలేదు. స్నేహితుడవన్న భ్రమతో బిడ్డ పాల కోసం ఒక ఆవును అడగడానికి వచ్చాను’’ తాను వచ్చిన పని గురించి చెప్పాడు ద్రోణుడు. ‘‘యాచకుడిగా అర్థిస్తే వెయ్యి ఆవులైనా ఇస్తాను. అలాకాకుండా అర్థంపర్థం లేని మిత్రత్వం కలిపి రెచ్చగొట్టావంటే మెడపట్టి గెంటేయిస్తాను’’... ద్రుపదుడి నోట ఈ అహంకారపు మాటలు విని ద్రోణుడికి కోపం కట్టలు తెచ్చుకుంది. ‘‘కృతఘ్నుడా, నా బిడ్డ ఆకలి బాధకు ఆహుతి అయినా సహిస్తాను కాని ఆత్మభిమానాన్ని చంపుకొని నిన్ను అర్థించను’’ అన్నాడు. ‘‘ఎంత అహంకారం. ఎవరక్కడ? వీడ్ని మెడపట్టి గెంటండి’’ అని అరిచాడు ద్రుపద మహారాజు. ద్రోణుడి గుండెకు కోలుకోలేని గాయం చేశాడు. ఆ గాయాల జ్వాలల్లో నుంచే శపథం చేశాడు ద్రోణుడు. ‘‘అర్థమైంది ఆచార్యా! ఆ ద్రుపదుడు ఎంత దురహంకారో ఇప్పుడు అర్థమైంది. మీరు అనుమతిస్తే వాడి కాళ్లు చేతులు కట్టి ఈడ్చుకొచ్చి మీ కాళ్ల దగ్గర పడేసి గురుదక్షిణ సమర్పించుకుంటాను’’ ఆవేశంతో ఊగిపోయాడు అర్జునుడు. ‘‘అర్జునా ఆవేశపడకు! పగ పడగెత్తిన పాములా బుసకొడుతున్నా... మనం కొంత కాలం వేచి ఉండక తప్పదు. ఆ ద్రుపదుడు సామాన్యుడు కాదు. అస్త్రవిద్యలో నువ్వు నా అంతటి వాడవైతే తప్ప వాడిని జయించడం సాధ్యం కాదు. అచిరకాలంలోనే నిన్ను నాతో సమానంగా తీర్చిదిద్దుతాను. ధనుర్విద్యలో నిన్ను మించినవాడు లోకంలో లేడని నిరూపిస్తాను. అప్పుడు చెల్లింతువుగాని గురుదక్షిణ’’ అంటూ అర్జునుడి ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ద్రోణుడు. యుద్ధరంగంలో ఎదురుబొదురుగా ఉన్నారు ద్రుపదమహారాజు, అర్జునుడు. ‘‘పాండునందనా! అర్భకుడవు. పులి నోట్లో తల దూర్చడం మంచిది కాదు’’ అని అర్జునుడిని హేళన చేశాడు ద్రుపదుడు. అప్పుడు ఘాటుగా స్పందించాడు అర్జునుడు... ‘‘నేను వచ్చినది నీ హితబోధ వినడానికి కాదు. నా గురుదేవుల ప్రతిన చెల్లించడానికి. మాటలు కట్టిపెట్టి మగటిమి చూపించు’’ అని సవాలు విసిరాడు. ‘‘నువ్వు ఎంత కవ్వించినా సుందర సుకుమారమైన నీ ముఖారవిందం మా కదనకుతూహలాన్ని కరుణగా మార్చి వేసింది. నీ మీద శరసంధానం చేయడానికి మనసొప్పడం లేదు’’ అని వెనకడుగు వేసే ప్రయత్నం చేశాడు ద్రుపదుడు. ‘‘రోషముంటే నా బాణధాటికి తట్టుకో’’ అని బాణాన్ని సంధించాడు అర్జునుడు. ద్రుపదుడి కిరీటం నేలరాలింది. అతడిని తాళ్లతో బంధించి గురువు ద్రోణుడి కాళ్ల దగ్గర పడేశాడు అర్జునుడు. ‘‘ఆచార్య! ప్రబలిన గర్వం పాదాక్రాంతం అయింది’’ శపథం నెరవేర్చుకున్న ఉత్సాహంలో అన్నాడు అర్జునుడు. ‘‘అర్జునా! ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది’’ అంతులేని సంతోషంతో అన్నాడు ద్రోణుడు. ఆ తరువాత... ‘‘ఆగర్భసార్వభౌముడైన పాంచాల భూపతికి ఎంత దుర్గతి!’’ అని వెక్కిరించాడు. ‘‘మిత్రమా’’ అన్నాడు పశ్చాత్తాపం నిండిన గొంతుతో ద్రుపదుడు. ‘‘మిత్రమా! ఇదెక్కడి కొత్త మాట! అదీ నీ నోట!! గురుకులంలో ఒకరిలో ఒకరు పన్నెండేళ్లు గడిపిన రోజులు గుర్తుకు వచ్చి అలా అంటున్నారేమో... చూడండి... ఇద్దరు బాటసారులు నాలుగు రోజులు సత్రంలో గడిపినంత మాత్రాన వారు మిత్రులవుతారా? అది స్నేహం అవుతుందా?’’ ద్రోణుడి నోటి నుంచి వ్యంగ్యబాణాలు వస్తూనే ఉన్నాయి. ‘‘ఏమండీ... దోషిని దండించవలసిందే కాని మాటలతో మనసు నొప్పించడం...’’ అంటూ సున్నితంగా అడ్డు తగిలింది ద్రోణుడి భార్య. ‘‘ద్రుపదా! రాజు చేజిక్కిన తరువాత రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసుగా. నేను పాతికేళ్లు నిరీక్షించి నిన్ను కట్టి తెప్పించుకున్నది నీ సింహాసనం మీద ఆపేక్షతో కాదు. పరాభవాగ్ని జ్వాలల తీవ్రత ఎంత దుర్భరమైనదో స్వయంగా అనుభవించి తెలుసుకునే అవకాశం నీకు కల్పిస్తున్నాను. మానవత్వానికి అర్థం తెలుసుకొని ఇకనైనా మనిషిగా బతుకు. వెళ్లు’’ అని ద్రుపదుడికి హితబోధ చేశాడు ద్రోణుడు. ‘‘నా మనసు ఇప్పుడు ప్రశాంతం’’ అన్నాడు ద్రోణుడు. ‘‘నా మనసు అలా లేదు ఆచార్యా! పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది’’ బాధగా అన్నాడు అర్జునుడు. ‘‘అదేమిటి!’’ ఆశ్చర్యపోయాడు ద్రోణుడు. అప్పుడు అర్జునుడు ఇలా బదులిచ్చాడు: ‘‘అకారణంగా ఒక ఆటవికుని చేతిలో నాకు జరిగిన పరాభవం అలాంటిది. అది భరించలేక అప్పటికప్పుడు అస్త్రసన్యాసం చేద్దామనుకున్నాను. కాని ద్రుపదుడిని పట్టి తెచ్చి మీకు అప్పగించాల్సిన బాధ్యత ఉండడంతో అంత సాహసం చేయలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోయింది. ఇక నేను విల్లు పట్టడంలో అర్థం లేదు’’ ‘‘అర్జునా! ఏమిటి ఈ పిరికితనం? ప్రతి చిన్న విషయానికీ మనసు పాడు చేసుకోవడం ధీరోదాత్త లక్షణం కాదు’’ అని శిష్యుడికి బోధ చేశాడు గురువు. అయినప్పటికీ... ‘‘మన్నించండి ఆచార్యా! నిప్పు కణిక చిన్నదైనా పెద్దదైనా దాని పని అది చేసి తీరుతుంది. పరాభవం కూడా అంతే’’ అన్నాడు అర్జునుడు. సమాధానం: ఏకలవ్య -
నకిలీ పత్రాలతో బ్యాంకులకు రూ.40 కోట్లకు టోకరా!
హైదరాబాద్ : భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి రూ.కోట్లలో రుణాలు తీసుకుని టోకరా వేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్‌పేటకు చెందిన పీఐయాదవ్‌తోపాటు అబ్దుల్లాపూర్‌మెట్, పరిసర గ్రామాల్లోని పలువురితో కలసి అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 190లోని భూమికి గాను నకిలీ పత్రాలను (డాక్యుమెంట్ నెంబర్ : 2554/2006) సృష్టించాడు. వాటితో వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.40 కోట్ల మేర రుణాలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంఎస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట కూడా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎంఎస్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో అతను జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు తెలిసింది. ఇలా నకిలీ పత్రాలు సృష్టించి ఉమ్మడి రాష్ట్రంలో పలు బ్యాంకుల నుంచి సుమారు రూ. 200కోట్లకు పైగా రుణాలు తీసుకుని బురిడీ కొట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
‘హాక్ ఐ’..నేరాలకు బై!
సాక్షి, సిటీబ్యూరో: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో నేరాల నియంత్రణ దిశగా పోలీసులు అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘హాక్ ఐ’ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం దీన్ని ప్రారంభించారు. సామాన్యులను పౌర పోలీసులుగా మార్చడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు, పోలీసులకు ఇది ఉపయోగపడే తీరును వివరించారు. ఈ యాప్‌ను నగర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇస్తున్నామని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని పోలీసు వ్యవస్థలోనే ఇది తొలి ప్రయోగమని వెల్లడించారు. ప్రజానుకూల, స్నేహపూర్వక పోలీసింగ్‌కు ‘హాక్ ఐ ’ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి... ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి, ఐఓఎస్ (ఆపిల్) యూజర్లు యాప్ స్టోర్ నుంచి ‘హాక్ ఐ’ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వినియోగదారులకు వారం రోజుల్లోపే ఇది అందుబాటులోకి వస్తుంది. ‘హాక్ ఐ’ హైదరాబాద్ పోలీస్’ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. యాప్ విశిష్టతలు... యాప్‌ను ఓపెన్ చేయగానే కింది ఫీచర్లు కనిపిస్తాయి. రిపోర్ట్ వయొలేషన్ టు పోలీస్ (ఇతరులకు అసౌకర్యం కలిగించే వారి వివరాలు పోలీసుల దృష్టికి తీసుకురావచ్చు.) వుమెన్/గర్ల్స్ ట్రావెల్ మేడ్ సేఫ్ రిజిస్టర్ డీటెయిల్స్ ఆఫ్ సర్వెంట్/వర్కర్/టెనంట్ ఎస్ఓఎస్ (సేవ్ ఆఫ్ మై సోల్) ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్స్ కమ్యూనిటీ పోలీసింగ్ ఎందుకు నమోదు చేయించుకోవాలి? నౌకర్లు, కిరాయిదారులు నేరాలు చేసి తప్పించుకుంటే.. వారి వివరాలను సేకరించడం చాలా కష్టం. కొందరు లెసైన్సు కాపీ చూడకుండానే డ్రైవర్లను నియమించుకుం టుంటారు. వాహనం దొంగిలించడం లేదా ఇతర నేరాలు చేసి పారిపోతే వాళ్ల వివరాలు ఎక్కడా దొరకవు. నేరగాళ్లు/ఉగ్రవాదులు కిరాయికి ఇళ్లు తీసుకున్నా, వారి వివరాలు ఉండవు. ఇలాంటి వాళ్లు కిరాయిదారుల ముసుగులో వచ్చి నేరాలు చేసినట్టు చాలాసార్లు తేలింది. ప్రమాదం జరిగిన తరువాతే వీటి అవసరం తెలుస్తుంది. అందుకే ఉద్యోగులు/కిరాయిదారుల వివరాలు పోలీసులకు తెలియజేస్తే.. వాటిని అన్ని పోలీసు స్టేషన్ల సర్వర్లలో నిక్షిప్తం చేస్తారు. వాళ్ల ఫొటోలు, ఇతర వివరాలు ఉంటాయి కాబట్టి నేరాలు చేసేందుకు జంకుతారు. నేరం జరిగితే సత్వరం స్పందిందేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆరు నెలల సమయం పట్టింది: శ్రీనాథ్‌రెడ్డి ఈ ప్రత్యేక యాప్ తయారు చేసేందుకు ఐటీ సెల్ బృందానికి ఆరు నెలల సమయం పట్టింది. దేశంలోనే ఇది కొత్త తరహా యాప్. ప్రజలకు 24 గంటలూ ఉపయోగపడుతుంది. ఫిర్యాదుదారులు పంపే ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ సర్వర్‌లో డేటాబేస్‌లో రికార్డు అవుతాయి. ప్రతి ఠాణాలోనూ దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచాం. నిందితులకు శిక్ష పడేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. యాప్‌తో అందించే సేవలు మహిళలు ముందుగా తమ ప్రయాణ వివరాలను తెలియజేయడం ద్వారా సురక్షితంగా ప్రయాణించవచ్చు. అపాయకర పరిస్థితి ఎదురైనప్పుడు యాప్‌లోని ‘ఎస్ఓఎస్’ బటన్ నొక్కాలి. దీని ద్వారా ముందుగా రికార్డు చేసిన సందేశం (ప్రి రికార్డెడ్) బాధితురాలి బంధువులు, స్నేహితులు, సంబంధిత పోలీసు అధికారులు, పెట్రోలింగ్ పోలీసులకు చేరుతుంది. ఈ యాప్‌తో పోలీసులకు ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారం ఇవ్వవచ్చు. మీ కళ్ల ముందు జరిగే నేరాల వివరాలు తెలియజేయవచ్చు. పోలీసింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించవచ్చు. వారు చేపట్టే మంచి పనులను అందరికీ తెలియజేయవచ్చు. పోలీసులతప్పులపైనా ఫిర్యాదు చేయవచ్చు. మీ ఇంటి పని మనుషులు/ఉద్యోగులు/కిరాయిదారుడి వివరాలను పోలీసులకు తెలపడం ద్వారా అపాయకర పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్త వహించవచ్చు. ఈ యాప్ కమ్యూనిటీ పోలీసింగ్ అమలుకు ఎంతో ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగర పోలీసుల ఫోన్ నంబర్లన్నీ పొందవచ్చు. ఏదైనా ఫిర్యాదు/రిపోర్టుల స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. -
తప్పించుకు తిరగలేరు!
కొత్త విధానంలో ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు పాత పద్ధతికి స్వస్తి నగరంలో 200 తనిఖీ పాయింట్లు ప్రత్యేక బారికేడ్లు సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు పోలీసు తనిఖీల నుంచి తప్పించుకు తిరగలేరు. దీనికోసం పోలీసులు కొత్త పద్ధతులు పాటించబోతున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న ట్రాఫిక్ పోలీసుల తనిఖీలలో సమూల మార్పులు చేయాలని ఎమ్.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ కాకుండా, వాహనదారులు, పాదచారులకు అసౌకర్యం కలుగకుండా క్రమపద్ధతిలో తనిఖీలు చేయాలని అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ అన్ని ట్రాఫిక్ ఠాణా ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త తనిఖీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన బారికేడ్లు వచ్చేశాయి. ఇదీ ప్రస్తుతపద్ధతి మలక్‌పేట్‌కు చెందిన రవి తన బైక్‌పై కోఠి వైపు దూసుకెళ్తున్నాడు. చాదర్‌ఘాట్ దాటిన తరువాత ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయి చూపించి వాహనాన్ని ఆపమన్నాడు. రవి సడన్‌గా బ్రేక్ వేశాడు. అంతే.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం రవిని ఢీ కొట్టింది...నగరంలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్నిఆపమంటే చోదకులు ఆపకుండా, వేగంగా దూసుకెళ్లి ప్రమాదాల బారినపడిన దాఖలాలూ కోకొల్లలు. కొన్ని సందర్భాలలో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. చెకింగ్ సమయంలో ఉన్నట్టుండి వాహనాన్ని నిలిపే క్రమంలో పోలీసులు, వాహనదారులకు ముష్టియుద్ధాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి ఘటనలకు తావులేకుండా జాగ్రత్త వహించనున్నారు. కొత్త విధానమిదీ... ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులను తనిఖీ చేస్తున్నాం. వాహనదారులు సహకరించాలి’ అని తెలిపే బారికేడ్లు వంద మీటర్ల దూరం నుంచే వాహనదారుడికి కనబడేలా దర్శనమిస్తాయి. వీటి వద్ద ట్రాఫిక్ పోలీసులు మర్యాదగా, గౌరవంగా, చెయ్యి చూపించి వాహనాన్ని ఆపేస్తారు. ఆ సమయంలో ఆ వాహనం వెనుక నుంచి వచ్చే ఇతర వాహనదారులు వేగాన్ని తగ్గించుకుంటారు. దీని వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపమన్నా తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. బారికేడ్లు పెట్టడం వల్ల వాహన వేగం పెంచలేక తనిఖీలకు తప్పనిసరి సహకరించాల్సిందే. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారు తనిఖీలలో పట్టుబడడం ఖాయం. కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది ఎటువంటి ఆదేశాలు లేకున్నా సందుగొందుల్లో తనిఖీలు చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలకు కూడా కొత్త పద్ధతితో బ్రేక్‌పడుతుంది. ఈ బారికేడ్లు లేకుండా తనిఖీలు చేయరాదని కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. 200 ప్రాంతాల్లో... నగర కమిషనరేట్ పరిధిలో 25 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ పరిధిలో భౌగోళికతను దృష్టిలో పెట్టుకుని ఏడు నుంచి పది వరకు తనిఖీ పాయింట్లను గుర్తించారు. ట్రాఫిక్ తనిఖీల కోసం నగరంలో మొత్తం 200 ప్రాంతాలను గుర్తించారు. ప్రతి తనిఖీ పాయింట్ వద్ద బారికేడ్లు ఉంటాయి. -
ముందస్తు జాగ్రత్తలతో నేరాలకు చెక్
కమిషనర్ మహేందర్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: చోరీలు, దోపిడీలు జరగకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోండి...అయినా నేరం జరిగితే, కేసును వెంటనే ఛేదించి బాధితుడికి న్యాయం చేయండి అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి క్రైమ్ విభాగం అధికారులకు సూచించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో నగర క్రైమ్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఆశలు నెరవేర్చాలి... నగరంలో జరుగుతున్న కొత్త రకం చోరీలు, దోపిడీలు, మోసాల గురించి కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలనూ అడిగి తెలుసుకున్నారు. నేరం జరిగాక ఉరుకులు పరుగులు పెట్టడంకంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే నేరాల సంఖ్యను తగ్గించవచ్చని కమిషనర్ అన్నారు. తరచు నేరాలకు పాల్పడే కరుడుగట్టిన వారి వివరాలను క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ సందీప్‌శ్యాండిల్యా కమిషనర్‌కు వివరించారు. 100కు పైగా నేరాలు చేసిన వారి జాబితాను కూడా ఈ సందర్భంగా కమిషనర్ పరిశీలించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నగర పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేయాలని, పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయకుండా ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కమిషనర్ అన్నారు. నేరగాళ్ల గురించి సమాచారం తెలిసిన వెంటనే ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని కేసును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సమన్వయంతో పని చేయాలి.. సైబరాబాద్‌లో జరుగుతున్న నేరాలపై కూడా ఇక్కడి అధికారులు దృష్టి పెట్టాలని, రెండు కమిషనరేట్లు పక్కపక్కనే ఉండటంతో నేరగాళ్లు అక్కడ నేరం చేసి ఇక్కడ.., ఇక్కడ నేరం చేసి అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారని కమిషనర్ అన్నారు. సైబరాబాద్ క్రైమ్ పోలీసులను కూడా సమన్వయం చేసుకుని కేసుల దర్యాప్తును వేగవంతం చే సుకోవాలని సూచించారు. క్రైమ్ సిబ్బందికి కావాల్సిన వాహనాలు కూడా త్వరలో సమకూరుస్తామన్నారు. పాత నేరస్తులపై దృష్టి సారించాలని, జైలు నుంచి విడుదలైన వారిపై నిఘా ఉండాలన్నారు. చోరీ సొత్తు రికవరీలో ఎదురవుతున్న సమస్యలను కొంత మంది డీఐలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ సొత్తు కొన్నవారిని పట్ల ఉపేక్షించకుండా కేసులు నమోదు చేసి జైలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్లు సందీప్‌శాండిల్యా, అంజని కుమార్,జాయింట్ సీపీ మల్లారెడ్డి, సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ సుప్రజతో పాటు అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు (డీఐ), సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
కొనలేం.. కట్టలేం!
చుక్కలు చూపిస్తున్న సిమెంట్ ధరలు నెల రోజుల్లో రూ.100కు పైగా పెరిగిన ధర రవాణా, ఇంధన చార్జీలతో స్టీల్, ఇసుక కూడా.. ఫ్లాట్ల ధరలను పెంచే యోచనలో బిల్డర్లు దీంతో సామాన్యులకు దూరమవుతున్న సొంతిల్లు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా ఉంది నిర్మాణ రంగ పరిస్థితి. ఏడాదికాలంగా స్థిరాస్తి కొనుగోళ్లు లేక, బ్యాంకులు రుణాలు మంజూరు చేయక తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ నిర్మాణ రంగానికి తాజాగా సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరీ ఎక్కువగా నెల రోజులుగా రూ.100కు పైగా పెరిగిన సిమెంట్ ధరలు బిల్డర్లకు మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నిర్మాణ సంస్థలన్నీ ఒక్క తాటిపైకొచ్చి చ.అ. ధరను రూ.200 లకు పైగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. అంటే సొంతంగా గూడు కట్టుకుందామనుకునే సామాన్యుడికి ఓ పక్క నిర్మాణ సామగ్రి ధరలు చుక్కలు చూపిస్తుంటే.. మరోపక్క అపార్ట్మెంట్లలో ఫ్లాట్ తీసుకుందామంటే చ.అ. ధరలు భారంగా మారాయన్నమాట. ఎటొచ్చీ నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల సామాన్యులకే గుదిబండగా మారింది. సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నెల క్రితం.. సిమెంట్ (50 కిలోలు) ధర రూ.240-260గా.. అలాగే టన్ను స్టీలు రూ.44-45 వేలుగా, ట్రాక్టర్ ఇసుక రూ.4,400 లుగా ఉండేది. కానీ, ప్రస్తుతం సిమెంట్ ధర రూ.315 అయ్యింది. కొందరైతే రూ.350కి కూడా అమ్ముతున్నారు. ఇక స్టీలు ధర రూ.46-47 వేలుంటే, ఇసుక రూ.4,500లు పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ వాహనాల ప్రవేశ పన్నులు విధించడం, మరోవైపు రైల్వే సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం, ఇంధన వనరుల ధరలూ ఇదే బాటలో పయనించడం వంటి కారణాలతో నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి. 27 రోజుల్లో రూ.105 భారం: జూన్ 1న సిమెంట్ బస్తా ధర మార్కెట్లో 210 ఉంది. రాష్ట్ర విభజన 2వ తేదీన జరగ్గా 3వ తేదీన బస్తాకు రూ.50 పెంచి రూ.260 చేశారు. 7వ తేదీ నుంచి ఇంకో రూ.25 పెంచి రూ.285కి చేర్చారు. 19వ తేదీన మరో రూ.10 పెంచి రూ.295కు తీసుకెళ్లారు. తాజాగా మరో రూ.20 భారం వేసి బస్తాను రూ.315 విక్రయిస్తున్నారు. అంటే 27 రోజుల్లో సిమెంట్ బస్తాపై రూ.105 పెంచేశారన్నమాట. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ముడిపదార్థాల ధరలు పెరగడం, విద్యుత్, రవాణా చార్జీలూ భారంగా మారడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి. 41 సిమెంట్ కంపెనీలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 41 సిమెంట్ కంపెనీలున్నాయి. ఇవి 34 రకాల బ్రాండ్లతో సిమెంట్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో 20 బ్రాండ్లకు మాత్రం మార్కెట్లో కొంచెం ఎక్కువ గిరాకీ ఉంది. గతంలో రెండు రాష్ట్రాల్లోని కంపెనీలు కలిపి నెలకు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసేవి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడానికి ఉత్పత్తిని 11 లక్షల టన్నులకు తగ్గించినట్టుగా బిల్డర్లు అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా సిమెంట్ తయారీ రాష్ట్రాల్లో ధర తక్కువగా ఉండి పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే సిమెంట్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాయితీ ధరకే సిమెంట్ లభించాలని బిల్డర్లు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో: సమైక్య రాష్ట్రంలో గతేడాది జులైలో సిమెంట్ ధర (50 కిలోలు) రకాన్ని బట్టి రూ.320 దాకా ఉంది. తర్వాతి నెలలో రూ.200-225కు పడిపోయింది. గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో బస్తా సిమెంట్ ధర రూ.360-రూ.370, కర్ణాటకలో రూ.350, కేరళలో రూ.370, ఢిల్లీలో రూ.280-రూ.290, మహారాష్ట్రలో రూ.300, బెంగళూరులో రూ.310-320, ముంబైలో రూ.260-రూ.270 ఉంది. ప్రభుత్వం చేయాల్సినవివే.. 1. మూకుమ్మడిగా పెంచిన సిమెంట్ ధరలపై ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ)కు ఫిర్యాదు చేస్తామని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఏపీ ప్రెసిడెంట్ ఎస్ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అన్ని నిర్మాణ రంగ సంస్థలను ఒకే వేదికపై తీసుకొచ్చి నిర్మాణ పనులను నిలిపివేస్తాం. అయినా ధరలు తగ్గించకపోతే ఫ్లాట్ల ధరలను చ.అ.కు రూ.200 లకు పైగా పెంచుతాం. అంతిమంగా ఈ భారం సామాన్యులపైనే పడుతుంది. 2. సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తాండూర్, ఆదిలాబాద్‌ల్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి. 3. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి వాహనాలకు టోల్, సర్వీస్ టాక్స్ వంటి పన్నుల్లో మినహాయింపులివ్వాలి. 4. సిమెంట్ పరిశ్రమల్లో విడుదలయ్యే ఉష్ణోగ్రతను వృథాగా వదిలేయకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఖర్చు బాగా కలిసొస్తుంది. ఉష్ణోగ్రతను సద్వినియోగం (వేస్ట్‌హీట్ రికవరీ) చేసుకునే ప్రక్రియకు పునరుత్పాదక ఇంధన హోదాను కూడా కల్పించాలి. 5. విద్యుత్తు ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లైయాష్, శ్లాగ్ను ముడిపదార్థంగా వినియోగించి సిమెంట్‌ను తయారు చేయవచ్చు. విద్యుత్ సంస్థల నుంచి సిమెంట్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్‌ను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
అపురూపం... బాల రామాయణం
శ్రీకృష్ణవిజయం, కోడెనాగు, ముత్యాల పల్లకి, ఏకలవ్య, పల్నాటి సింహం... ఈ సినిమాలను బట్టి నిర్మాతగా ఎమ్మెస్ రెడ్డి అభిరుచి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతగా, కవిగా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎమ్మెస్ రెడ్డి. ఆయన మస్తిష్కం నుంచి పుట్టిన ఓ అపురూప దృశ్యకావ్యంగా ‘రామాయణం’(1997) చిత్రాన్ని చెప్పుకోవాలి. పిల్లలతో రామకథను తీసి వెండితెరను పులకింపజేశారాయన. రామజననం నుంచి రావణ సంహారం వరకూ సాగే ఈ కథను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తీరు అభినందనీయం. పిల్లలకు తగ్గట్టు ఆభరణాలను తయారు చేయించడమేకాదు, వారి హైట్‌ని బట్టి అంతఃపురం సెట్లను కూడా వేయించి, చూపరులను అబ్బురపరిచారు ఎమ్మెస్‌రెడ్డి. దాదాపు 30 పాఠశాలల నుంచి మూడు వేల మంది పిల్లల్ని తెచ్చి ఈ సినిమాలో నటింపజేయడం విశేషం. రాముడి పాత్రకు తారకరాముడి మనవడే సరైన వాడిగా భావించి జూనియర్ ఎన్టీఆర్‌ని రామునిగా తీసుకున్నారు దర్శక, నిర్మాతలు గుణశేఖర్, ఎమ్మెస్‌రెడ్డి. ఈ సినిమా చేసేటప్పుడు తారక్ వయసు 13 ఏళ్లు. ‘రామాయణం’ కంటే ముందు... ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్లో శకుంతల తనయుడు భరతునిగా తారక్ నటించినా... ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ విధంగా చూసుకుంటే... తారక్ వెండితెరపై కనిపించిన తొలి సినిమా రామాయణమే. తొలి సినిమాతోనే తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు తారక్. ఇందులో సీతగా స్మితామాధవ్ నటించారు. ఇప్పుడామె ప్రముఖ నర్తకి. ఇక రావణుని పాత్రను కొడాలి స్వాతి అనే అమ్మాయితో చేయించడం విశేషం. దశరథుని నుంచి అంగదుని వరకు ఇందులో ప్రతి పాత్రనూ చిన్న పిల్లలే పోషించారు. దర్శకుడు గుణశేఖర్ యాక్షన్, ఫ్యాక్షన్, ప్రేమకథలే కాదు... పురాణాలను, చరిత్రాత్మకాలను కూడా చక్కగా హ్యాండిల్ చేయగలరని ‘రామాయణం’ సినిమా ఆ రోజుల్లోనే నిరూపించింది. జాతీయస్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికయ్యిందీ సినిమా. వాణిజ్యపరంగా కూడా బాగానే ఆడింది. గత రెండు దశాబ్దాల్లో తెలుగులో వచ్చిన బాలల చిత్రాల్లో ‘రామాయణం’ చిత్రానిది ఓ ప్రత్యేక స్థానం.