ముందస్తు జాగ్రత్తలతో నేరాలకు చెక్
- కమిషనర్ మహేందర్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: చోరీలు, దోపిడీలు జరగకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోండి...అయినా నేరం జరిగితే, కేసును వెంటనే ఛేదించి బాధితుడికి న్యాయం చేయండి అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి క్రైమ్ విభాగం అధికారులకు సూచించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో నగర క్రైమ్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం ఆశలు నెరవేర్చాలి...
నగరంలో జరుగుతున్న కొత్త రకం చోరీలు, దోపిడీలు, మోసాల గురించి కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలనూ అడిగి తెలుసుకున్నారు. నేరం జరిగాక ఉరుకులు పరుగులు పెట్టడంకంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే నేరాల సంఖ్యను తగ్గించవచ్చని కమిషనర్ అన్నారు. తరచు నేరాలకు పాల్పడే కరుడుగట్టిన వారి వివరాలను క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ సందీప్‌శ్యాండిల్యా కమిషనర్‌కు వివరించారు.
100కు పైగా నేరాలు చేసిన వారి జాబితాను కూడా ఈ సందర్భంగా కమిషనర్ పరిశీలించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నగర పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేయాలని, పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలను అడియాశలు చేయకుండా ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కమిషనర్ అన్నారు. నేరగాళ్ల గురించి సమాచారం తెలిసిన వెంటనే ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని కేసును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
సమన్వయంతో పని చేయాలి..
సైబరాబాద్‌లో జరుగుతున్న నేరాలపై కూడా ఇక్కడి అధికారులు దృష్టి పెట్టాలని, రెండు కమిషనరేట్లు పక్కపక్కనే ఉండటంతో నేరగాళ్లు అక్కడ నేరం చేసి ఇక్కడ.., ఇక్కడ నేరం చేసి అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారని కమిషనర్ అన్నారు. సైబరాబాద్ క్రైమ్ పోలీసులను కూడా సమన్వయం చేసుకుని కేసుల దర్యాప్తును వేగవంతం చే సుకోవాలని సూచించారు. క్రైమ్ సిబ్బందికి కావాల్సిన వాహనాలు కూడా త్వరలో సమకూరుస్తామన్నారు. పాత నేరస్తులపై దృష్టి సారించాలని, జైలు నుంచి విడుదలైన వారిపై నిఘా ఉండాలన్నారు.
చోరీ సొత్తు రికవరీలో ఎదురవుతున్న సమస్యలను కొంత మంది డీఐలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ సొత్తు కొన్నవారిని పట్ల ఉపేక్షించకుండా కేసులు నమోదు చేసి జైలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్‌లు సందీప్‌శాండిల్యా, అంజని కుమార్,జాయింట్ సీపీ మల్లారెడ్డి, సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ సుప్రజతో పాటు అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు (డీఐ), సబ్‌ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.