రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం  | Rs 7 Crore Counterfeit Notes Were Seized in Khammam | Sakshi
Sakshi News home page

రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం 

Published Sun, Nov 3 2019 8:07 AM | Last Updated on Sun, Nov 3 2019 8:09 AM

Rs 7 Crore Counterfeit Notes Were Seized in Khammam - Sakshi

పట్టుకున్న నకిలీ డబ్బులను పరిశీలిస్తున్న పోలీస్‌ అధికారులు

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడమే లక్ష్యం. పేరుకు కోళ్లు, పాల వ్యాపారం చేస్తున్నా.. లోపల మాత్రం నకిలీ నోట్లు చలామణి చేయడం. అసలు నోట్లు రూ.2లక్షలు ఇస్తే.. ఐదు రెట్లు నకిలీవి ఇస్తానని నమ్మించడం. ఆ తర్వాత నకిలీ నోట్లు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడడం. దీనినే నిత్యకృత్యంగా మార్చుకుంది ఆ ముఠా. సత్తుపల్లి పోలీసులు పన్నిన వలకు చిక్కిన ముఠా నుంచి రూ.7కోట్ల విలువైన నకిలీ నోట్లతోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.  ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ దొంగ నోట్ల ముఠా వివరాలను వెల్లడించారు.

సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్‌ మదార్‌ పాలు, కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. 20 ఏళ్లుగా నకిలీ నోట్లు చలామణి చేయడం ప్రవృత్తిగా పెట్టుకుని.. అసలు నోట్లు రూ.2లక్షలు ఇస్తే.. 5 రెట్లు నకిలీ నోట్లు ఇస్తానని మధ్యవర్తుల ద్వారా అమాయక ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తీరా వారి వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ నోట్లు ఇవ్వకుండా.. ఎదురు తిరిగిన వారిని కత్తులు, చాకులతో బెదిరించేవాడు. భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మేనల్లుడు నౌషద్, తోట హన్మంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మోడెం సాయమ్మలతో కలిసి మోసాలు చేస్తూ రూ.లక్షలు సంపాదించాడు. వీరిలో మదార్, రమీజ్‌ మరికొందరిపై ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

రూ.2వేల నోట్లే లక్ష్యంగా.. 
కేంద్రం త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో భారీగా రూ.2వేల నకిలీ నోట్లను తెచ్చి మదార్‌ నిల్వ చేశాడు. తన వద్ద రూ.100కోట్లకు పైగా రూ.2వేల నోట్ల కట్టలు ఉన్నాయని, వీటిని వైట్‌ మనీగా మార్చాలని ప్రచారం చేసేవాడు. ఎవరైనా రూ.80కోట్లు ఇస్తే.. రూ.100కోట్లు ఇస్తానని.. తీసుకున్న వారికి రూ.20కోట్లు మిగులుతాయని ఆశ చూపించేవాడు. ఇలా అమాయకులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు రాబట్టేవాడు.  

ఇంట్లోనే నోట్ల తయారీ.. 
నకిలీ కరెన్సీ ముఠా ఇంట్లోనే నకిలీ నోట్లను తయారు చేసి చలామణి చేసేది. వీరికి అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాతో కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రంలోని ముఠాలతో కూడా వీరికి సంబంధాలు ఉండేవి. ముఠా నాయకుడు మదార్‌పై ఖమ్మంతోపాటు సత్తుపల్లి, దమ్మపేట, కొత్తగూడెం పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
 
రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో మోసం.. 
ఈ ముఠా రద్దయిన నోట్లతో అనేక మోసాలకు పాల్పడేది. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను ఇంకా మార్చుకునే అవకాశం ఉందని అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు కాజేసింది.  

నకిలీ బంగారు బిస్కెట్ల పేరుతో..  
నకిలీ నోట్లే కాకుండా బంగారు బిస్కెట్ల పేరుతో అనేక మందిని ముఠా నాయకుడు మోసం చేశాడు. దుబాయ్, సౌదీ అరేబియాలో తనకు బంధువులు ఉన్నారని, వారి ద్వారా షిప్‌లలో బంగారం బిస్కెట్లు తెప్పిస్తానని నమ్మబలికేవాడు. ఇలా చాలా మందిని తన మాటల ద్వారా బుట్టలో పడేసేవాడు. అక్కడి నుంచి తెప్పించిన బంగారు బిస్కెట్లను తక్కువ ధరకు ఇస్తానని చెప్పి బిస్కెట్లకు బంగారు పూత పూసి.. నకిలీ గోల్డ్‌ బిస్కెట్లు చూపించి అనేక మంది వద్ద రూ.లక్షలు ఆర్జించాడు.  

ప్లాస్టిక్‌ కాగితపు కరెన్సీతో.. 
ప్లాస్టిక్‌ కాగితపు కరెన్సీని ఉపయోగించి అనేక మందిని మోసం చేశాడు. తాను ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారా వచ్చే కస్టమర్లకు తన వద్ద ఎక్కువ మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని నమ్మించేవాడు. ఒక అట్ట పెట్టెను తయారు చేసి పిల్లలు ఆడుకునే, సినిమాల్లో ఉపయోగించే ప్లాస్టిక్‌ కాగితపు కరెన్సీ నోట్లు అంటించి పెద్ద మొత్తంలో ఉన్నాయని చూపించేవాడు. అంతేకాక టెక్నిక్‌గా వీడియో తీసి.. తాను మోసం చేయబోయే వ్యక్తులు మరింత నమ్మేందుకు వీడియో చూపించేవాడు. తన వద్ద ఉన్న నోట్లు చూడాలని ముందుగా టోకెన్‌ అమౌంట్‌ రూ.5లక్షలు చెల్లించాలంటూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని వివిధ రకాలుగా మోసాలకు పాల్పడేవాడు.
 
పైన నోట్లు.. లోపల తెల్ల పేపర్లు.. 
పైన అసలు నోట్లు.. లోపల తెల్ల పేపర్లు పెట్టి కట్టలుగా కట్టి అనేక మందిని మోసం చేశాడు. తన వద్ద ఉన్న ఒరిజినల్‌ కరెన్సీ నోట్లకు అయోడిన్‌ పూసి అట్ట పెట్టెల్లో పెట్టి.. పైన ఒరిజినల్‌ నోటు పెట్టి మధ్యలో తెల్ల పేపర్లు పెట్టి కట్టలుగా తయారు చేసేవాడు. నోట్ల కట్టల నుంచి అయోడిన్‌లో ముంచిన ఒరిజినల్‌ నోటును తీసి దానిని హైపో ద్రావణంలో ముంచి కస్టమర్లకు చూపించేవాడు. మిగతా నోట్ల కట్టలన్నీ అలాగే ఉంటాయని నమ్మించి వారిని మోసం చేసి లక్షల్లో డబ్బులు సంపాదించాడని సీపీ వివరించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీలు మురళీధర్, పూజ, మాధవరావు, సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్, వైరా ఏసీపీ సత్యనారాయణ, సత్తుపల్లి టౌన్‌ సీఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వివరాలు వెల్లడిస్తున్న ఖమ్మం సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement