
జైపూర్(చెన్నూర్): ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. మండల కేంద్రంలోని ఎల్లమ్మగుడి సమీపంలో మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు (అద్దె బస్సు) శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఎల్లమ్మగుడి సమీపంలోకి రాగానే.. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును వేగంతో ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిపైఒకరు పడిపోయారు.
బస్సు అద్దాలు, సీట్లు, ఇనుపరాడ్లు బలంగా తాకడంతో ప్రయాణికుల తలలు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్‌తో సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పప్రతికి తరలించి చికిత్స అందించారు. స్వల్పంగా గాయపడ్డ వారిని జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించి మంచిర్యాలకు రెఫర్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, నిద్రమత్తుతో బస్సు నడిపాడని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ మాత్రం బ్రేక్‌ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నాడు. వరుసగా చోటు చేసుకుంటున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment