
అల్లిపురం(విశాఖ దక్షిణం): సమయం మధ్యాహ్నం 1.30గంటలు... ఆర్టీసీ కాంప్లెక్స్ భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నాలుగు రోడ్లు కూడలి వచ్చేపోయే వారితో రద్దీగా ఉంది... అనుకోకుండా పెద్ద శబ్ధం... అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు... తేరుకుని చూసే సరికి ఆర్టీసీ బస్సు ఒకటి సిగ్నల్ లైట్లు స్తంభాన్ని ఢీ కొట్టి నిలిచిపోయింది. సిగ్నల్ లైట్లు పడటంతో ఆగి ఉన్న వాహనచోదకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికుల కథనం ప్రకారం... 222 నంబరు గల ఆర్టీసీ బస్సు (ఏపీ 28 జెడ్ 3178) రైల్వే స్టేషన్ నుంచి తగరపువలస వెళ్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ భారత్ పెట్రోలు బంకు జంక్షన్‌కు చేరుకునేసరికి సిగ్నల్స్ పడడంతో డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించాడు. అయితే బ్రేకులు ఒక్కసారిగా పనిచేయక పోవడంతో సిగ్నల్స్‌లో గల వాహన చోదకులను తప్పించేందుకు డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డుమధ్యలో గల ఫుట్‌పాత్‌పైకి మళ్లించాడు. దీంతో బస్సు ఫుట్‌పాత్‌పై గల స్టీల్ రైలింగ్‌ను ఢీకొని సిగ్నల్ లైట్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం క్రేన్ సాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment