‘శాడిస్ట్‌ ’ వీడియో కాల్స్‌ వెనక ఉన్న అసలు స్టోరీ | Sadist Bhaskar Real Story Reveals Hyderabad Police | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై పెడదారి!

Published Tue, Feb 18 2020 8:57 AM | Last Updated on Tue, Feb 18 2020 8:57 AM

Sadist Bhaskar Real Story Reveals Hyderabad Police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్స్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసిన జనగామ జిల్లా వాసి కె.భాస్కర్‌ విచారణలో  విస్తుపోయే వాస్తవాలను వెల్లడించాడు. ‘శాడిస్ట్‌ అపరిచితుడైన’ ఇతగాడిని గత వారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన ఇతడిని న్యాయస్థానం అనుమతితో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అతగాడు శాడిస్ట్‌లా తయారు కావడానికి ప్రేమవిఫలమే కారణమని వెల్లడైంది.  పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. 

ఉద్యోగం రాకపోవడంతో..
జనగామ జిల్లా లింగాలఘణపురం సమీపంలోని నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్‌ ఎంకాం చదువుతుండగా ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇది విఫలం కావడంతో పాటు ఆమె తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో భాస్కర్‌పై లింగాలఘణపురం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. 2007లో నమోదైన ఈ కేసులో పోలీసులు చార్జిషీట్‌ సైతం దాఖలు చేయడంతో 2010లో నేరం నిరూపితమైంది. దీంతో న్యాయస్థానం భాస్కర్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఎంకాం పూర్తి చేసినా ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో కొన్నాళ్లపాటు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిగా పని చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్‌ కంపెనీల్లోనూ విధులు నిర్వర్తించినా చివరకు స్వస్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. 

వేధింపుల పర్వానికి శ్రీకారం..  
ఈ పరిణామంతో యువతులు, మహిళలపై కక్షకట్టిన భాస్కర్‌ వారిని వేధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను పొందుపరిచే పోర్టల్‌  ‘తెలంగాణ స్టేట్‌ ఆన్‌లైన్‌ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం’ నుంచి వివరాలు సంగ్రహించి వేధింపులు ప్రారంభించాడు. తన గ్రామానికి చెందిన అనేక మంది ప్రభుత్వ పథకాలు పొందడానికి భాస్కర్‌ సహకరించాడు. ఈ నేపథ్యంలోనే కింది స్థాయి అధికారులపై పలుమార్లు కలెక్టర్‌ సహా అనేక మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇతడి సోదరికి రావాల్సిన కల్యాణలక్ష్మి సొమ్మును అందుకోలేకపోయాడు. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం తన తల్లిదండ్రులకు కేవలం ఆరు నెలల వ్యవధిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. వీరి వైద్యానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చుపెట్టాడు. ఈ డబ్బు కోసం తనకు ఉన్న ఐదెకరాల పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఈ రుణానికి ప్రతి నెలా కట్టాల్సిన వాయిదాలు సైతం చెల్లించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం బ్యాంకు వాళ్లు పొలం వేలం వేయడానికి సిద్ధమవుతూ నోటీసులు జారీ చేశారు.

ఇంటిలో ఒంటరిగా..
బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన తల్లి తన సోదరి ఇంట్లో ఉంటుండటంతో ప్రస్తుతం భాస్కర్‌ తన స్వగ్రామంలో ఒంటరిగా నివసించేవాడు. వండి పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో రోజుకు ఒకపూటే భోజనం చేసేవాడు. ఈ పరిణామాలతో పూర్తిస్థాయి శాడిస్ట్‌గా మారిపోయిన భాస్కర్‌ తనకు దొరికిన సిమ్‌కార్డును రీచార్జి చేసి, ‘అవసరమైనప్పుడు’ తన సెల్‌ఫోన్‌లోనే వేసి వినియోగిస్తూ యువతులు, మహిళల్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆ ప్రభుత్వ పోర్టల్‌ నుంచి సేకరించిన నెంబర్లలో ఏదో ఒకదానికి కాల్‌ చేసేవాడు. అవతలి వారిలో అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో అభ్యంతరకర, అసభ్య సందేశాలు పంపడం, అశ్లీల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తుండేవాడు. వేళకాని వేళల్లో నగ్నంగా ఉండి యువతులు, మహిళలకు వాట్సాప్‌ ద్వారా వీడియో కాల్స్‌ చేసే భాస్కర్‌... వారూ అలా మారాలని బలవంతం పెట్టేవాడు. ఇతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు, ఎస్సై మహిపాల్‌ సాంకేతిక ఆధారాలను బట్టి భాస్కర్‌ నిందితుడిగా గుర్తించి గత మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి భాస్కర్‌కు 16న పెళ్లి చూపులు జరగాల్సి ఉంది. ఈలోపే అతడు అరెస్టు కావడంతో బ్రేక్‌ పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement