
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి, బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా ఓ చర్చా వేదికలో మాట్లాడిన తనను హతమారుస్తామని కొందరు బిష్ణోయ్ వర్గీయులు బెదిరించారని బాలీవుడ్ సూపర్‌స్టార్ సహ నటి కునికా సదానంద్ చెప్పారు. తనను బెదిరించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సల్మాన్‌తో హమ్ సాథ్ సాథ్ హై మూవీలో నటించిన కునికా తెలిపారు. సల్మాన్‌కు మద్దతుగా నిలిచినందుకు బిష్ణోయ్ వర్గీయులు కొందరు తనను హతమారుస్తామని ఫోన్‌లో బెదిరించారని, అసభ్య మెసేజ్‌లు పంపారని కునికా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రత కల్పించినట్టు సమాచారం. టీవీ చర్చల సందర్భంగా తాను సల్మాన్‌ను శిక్షించే బదులు బిష్ణోయ్ కమ్యూనిటీ అతడిని ఉపయోగించుకోవాలని, బెయిల్‌ను వ్యతిరేకించరాదని తాను సూచించానన్నారు.
కృష్ణజింకలకు ఆహారం సమకూర్చడం, వనాలను దత్తత తీసుకోవడం వంటి కార్యకలాపాలను సల్మాన్ చేపట్టేలా చూడాలని చెప్పానన్నారు. మరో చర్చలో బిష్ణోయ్‌లు సైతం జింకలను వేటాడతారని చెప్పానన్నారు. అయితే టీవీ చర్చలో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని సంతోష్ బిష్ణోయ్ అనే వ్యక్తి తనకు కాల్ చేసి బెదిరించాడని తెలిపారు. బెదిరింపు ఫోన్‌కాల్స్ ఆగలేదని, ఫేస్‌బుక్‌లోనూ తనను వెంటాడారని, తనపై కేసు పెడతామని బెదిరించారని చెప్పుకొచ్చారు. అయితే తన ప్రకటనకు క్షమాపణలు కోరుతూ తాను ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశానని తెలిపారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సల్మాన్‌కు ఇటీవల బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment