రైలు ద్వారా అక్రమంగా మెటల్, ఇసుక తరలింపు దృశ్యం
రాయగడ : అక్రమంగా తరలిస్తున్న ఇసుక, మెటల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కల్యాణ సిగుపూర్ తహసీల్దార్ మేరీ నాయక్ తెలిపారు. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రైల్వే ద్వారా గత కొన్ని నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రాకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు.
రాయగడ–కొరాపుట్ రైల్వేలైన్ మధ్య ఉన్న బాలుమస్కా రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా సుమారు 3 వ్యాగన్ల ఇసుక, ఒక వ్యాగన్ మెటల్ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న కల్యాణసింగుపురం తహసీల్దార్ దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ సమారు రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపినట్లు అధికారులు తెలిపారు. కొల్నార రెవెన్యూ పరిధిలోని దుందిరిఘాటీ, కల్యాణసింగుపురం ప్రాంతంలో ఉన్న నాగావళి నది ఒడ్డు నుంచి ఇసుక బల్లుమాస్క రైల్వేస్టేషన్‌కు ప్లాస్టిక్ సంచుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. బల్లుమాస్క నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఇసుక బస్తాలతో పాటు మెటల్‌ను కూడా తరలిస్తున్నారు.
అధికారుల అండతోనే అక్రమ రవాణా
నదీ పరీవాహక ప్రాంతం నుంచి ఇంత భారీ స్థాయిలో ఇసు క, మెటల్ అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదంతా అధికారులు, ప్రభుత్వ నేతలతో కలిసి చేస్తున్న వ్యవహారమని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇసుక క్వారీకి రెవెన్యూ విభాగం అనుమతులు మంజూరు చేసిన అనంతరం రవాణాకు అనుమతులు వస్తాయని అప్పుడే రైల్వే అధికారులు తరలించేందుకు సుముఖత వ్యక్తం చేస్తారని అలాంటప్పుడు ఎవరు తప్పు చేసినట్లు అని స్థానికులు నిలదీస్తున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి రైల్వే అధికారుల వరకు ఈ ఇసుక మాఫి యాతో సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న ఇసుక, మెటల్ బల్లుమాస్క రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు సుమారు రూ.2.50లక్షల జరిమానా విధించి విడిచిపెట్టారన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌కు అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment