ఫైల్ ఫోటో
సాక్షి, చెన్నై : తమిళనాట తీవ్ర కలకలం రేపిన దళిత యువకుడు శంకర్ హత్య కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కౌసల్య అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నందుకు శంకర్ దారుణ హత్యకు గురైన కేసులో ప్రధాన నేరస్తుడు, కౌసల్య తండ్రి చిన్నసామిపై ఉన్న అన్ని అభియోగాలనూ రద్దు చేసి, నిర్దోషిగా తీర్పు చెప్పింది. అతనిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఇప్పటికే చిన్నసామి ఏదైనా జరిమానా చెల్లించి వుంటే ఆ జరిమానా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది. అలాగే కౌసల్య తల్లి అన్నలక్ష్మితోపాటు సోదరుడు పండిదురై, మరో బంధువు ప్రసన్నకుమార్ ను నిర్దోషులుగా ప్రకటించి సంచలనం రేపింది.
మద్రాస్ హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు ఎం సత్యనారాయణన్ ఎం.నిర్మల్ కుమార్ ఈ కేసులో మరో ఐదుగురికి మరణశిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుగా మార్చుతూ సోమవారం తీర్పునిచ్చింది. కౌసల్య తల్లి, మరో ఇద్దరు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. కిరాయి హంతకులు జగదేసన్, మణికందన్ (పళని), సెల్వకుమార్, కాలా తమిళవానన్, మాథన్ అలియాస్ మైఖేల్‌లను మాత్రమే దోషులకు తేల్చిన కోర్టు వీరి మరణశిక్షను కూడా రద్దు చేసింది. ఈ కేసులో 2017, డిసెంబర్‌లో తిరుప్పూర్ జిల్లా సెషన్స్ కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. దీనిపై చిన్నసామి తదితరులు హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది. వీడియో రికార్డింగ్ మీద ఆధారపడిన ప్రాసిక్యూషన్ ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను రుజువు చేయలేక పోయిందని చిన్నసామి న్యాయవాది సుందరేసన్ తెలిపారు. అలాగే స్థానిక దుకాణంలో రికర్డైన సీసీటీవీ విజువల్స్ మార్ఫింగ్ చేసినవని ఆయన వాదించారు.
కాగా తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో 2016 మార్చి13న శంకర్ దారుణ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ షాపింగ్ మాల్ దగ్గర కౌసల్య దంపతులపై దుండుగులు కత్తులతో విరుచుకుపడిన ఘటనలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కౌసల్య కొన ఊపిరితో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీలో రికర్డు అయ్యాయి. అయితే దళితుడిని పెళ్లాడి నందుకే కక్ష గట్టి తన తండ్రి తన భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించాడని ఆరోపించిన కౌసల్య, దీనిపై న్యాయపోరాటం చేస్తోంది. తన తల్లిదండ్రులతోపాటు, ఇతరలకు శిక్ష పడే వరకూ తన పోరు కొనసాగుతుందని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన కౌసల్య తాజా తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అటు పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో 2018లో కౌసల్య కోవైకి చెందిన డప్పు కళాకారుడు శక్తిని ఆదర్శ వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment