
సర్పంచ్ మల్లేశ్‌ను తీసుకెళ్తున్న పోలీసులు
మంచాల రంగారెడ్డి : మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలో రగడ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గేట్ సమీపంలో ఆదివారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ సమస్య వివాదానికి దారితీసింది. డబుల్ ఇళ్ల కోసం గుర్తించిన స్థలం లింగంపల్లి గ్రామ పంచాయతీ, రెవెన్యూ మాత్రం నోముల గ్రామ పరిధిలోకి వస్తుంది.
ఇక్కడ శిలాఫలకంలో లింగంపల్లి సర్పంచ్ వాసవి పేరుపెట్టారు. కాని నోముల సర్పంచ్ మల్లేశ్ పేరు శిలాఫలకంలో లేదు. దీంతో నోముల సర్పంచ్ మల్లేశ్ ‘నా పేరు ఎందుకు శిలా ఫలకంలో పెట్టలేదని, ఎస్టీ కావడంతో దళితుడిననే కారణంతోనే అవమానించారని’ ఆందోళనకు దిగాడు. అధికారులు పొరపాటు చేశారని తిరిగి పేరు నమోదు చేస్తామనని ఎమ్మెల్యే నచ్చచెప్పారు.
దీంతో ఆగ్రహానికి గురైన మల్లేశ్ ఆర్‌అండ్‌బీ అధికారి బాలు నాయక్‌పై చెయి చేసుకున్నారు. అధికారిపై దాడితో సమస్య వివాదంగా మారింది. వెంటనే పోలీసులు నోముల సర్పంచ్ మల్లేష్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సర్పంచ్ మల్లేష్ మాత్రం తాను దళితుడిని అనే ఒక్క కారణంతోనే అవమానించారని ఆరోపించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జిల్లా రైతు సమన్వయ కమిటి కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment