మోసపోయి.. మోసం చేసి.. | Scams across the country in the name of multi level marketing | Sakshi
Sakshi News home page

మోసపోయి.. మోసం చేసి..

Published Thu, Sep 12 2019 3:38 AM | Last Updated on Thu, Sep 12 2019 5:23 AM

Scams across the country in the name of multi level marketing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ‘క్యూనెట్‌’సంస్థ మాదిరిగానే అక్రమాలకు పాల్పడిన మరో సంస్థ ‘సెర్ఫా’బాగోతం బట్టబయలైంది. క్యూనెట్‌ సంస్థలో చేరి నష్టపోయిన బాధితుడే సెర్ఫా సంస్థ యజమానిగా అవతారమెత్తి దేశవ్యాప్తంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. నగరంలోని మియాపూర్‌ వాసి ఫిర్యాదుతో సైబరాబాద్‌ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు బుధవారం వలపన్ని నిందితుడ్ని పట్టుకున్నారు.  

నాడు మోసాలకు బాధితుడు.. నేడు సూత్రధారి 
శ్రీకాకుళం పొందూరు మండలం తానెం గ్రామానికి చెందిన బక్కి శ్రీనివాసరెడ్డి బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగరీత్యా 2012లో హైదరాబాద్‌ వచ్చాడు. ఈక్రమంలో క్యూనెట్‌ సంస్థలో చేరి రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. దీంతో 2018లో క్యూనెట్‌ సంస్థ తరహాలోనే విశాఖపట్టణంలో సెర్ఫా మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఆఫీస్‌ ప్రారంభించి మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మొదలెట్టాడు. దీని బ్రాంచ్‌ ఆఫీసును నగరంలోని కూకట్‌పల్లిలో ప్రారంభించిన బక్కి శ్రీనివాస్‌రెడ్డి అనతి కాలంలోనే లక్షలు సంపాదించవచ్చంటూ తన మాయమాటలతో విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులను ఆకర్షించాడు. తన కంపెనీలో చేరే వినియోగదారులు డీడీ ద్వారా కంపెనీ బ్యాంక్‌ ఖాతాకు డబ్బులు చెల్లించాలని, ఆ తర్వాత యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ ఇస్తామని నమ్మపలికాడు.

రూ.12,000 చెల్లించి సభ్యుడిగా చేరితే రూ.1,000, మరో ఇద్దరిని చేర్పిస్తే రూ.4,000 కమీషన్‌ వస్తుం దని ఆశచూపాడు. సంస్థలో చేరిన వారికి వెకేషన్‌ టూర్‌ ప్యాకేజీలు, నాసిరకమైన వాచ్‌లు, నాణ్యతలేని హెల్త్, డైటరీ, బ్యూటీ ఉత్పత్తులు ఇచ్చేవారు. వాస్తవానికి హోల్‌సేల్‌ మార్కెట్‌లో లభించిన ధరకు పదింతలు రేట్లు చెప్పి వీటిని వారి చేతికి అంటగట్టేవారు. కమీషన్‌ వస్తుందన్న ఆశతో ఈ కంపెనీలో చేరిన సభ్యులు మరికొంతమందిని ఈ సంస్థలో చేర్పించారు. ఇలా తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తో పాటు లక్షద్వీప్‌ అండ్‌ అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనూ ఈ కంపెనీలో ఐదువేల మంది వరకు సభ్యులుగా చేరారు.  

నగరవాసి ఫిర్యాదుతో.. 
అప్పటివరకు సెర్ఫా సంస్థ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోవడంతో ఏ ఇబ్బందిలేకుండా పోయింది. అయితే ఈ కంపెనీలో సభ్యురాలిగా చేరిన నగరంలోని మియాపూర్‌వాసి కన్నెకంటి తులసి సంస్థ మోసాలపై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెర్ఫా డొంకంతా కదిలింది. సైబరాబాద్‌ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు రంగంలోకి దిగి సంస్థ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని వలపన్ని కూకట్‌పల్లిలోని అతడి కార్యాలయంలోనే అరెస్టు చేశారు. కార్యాలయాన్ని సీజ్‌ చేయడంతో పాటుగా కంప్యూటర్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధమున్న ఇతర నిందితుల్ని కూడా అరెస్టు చేయాల్సి ఉందని సైబరాబాద్‌ పోలీసుల కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement