బరంపురం: జాతీయ రహదారిపై అంకులి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఓ ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా మహిళా కూలీలే. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. టాటా కాలనీకి చెందిన పలువురు మహిళా కూలీలు పని కోసం ఆదివారం ఉదయం బరంపురం పట్టణానికి చేరుకున్నారు. పని ముగించుకొని సాయంత్రం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. ఈ సమయంలో నగర చివరలో జాతీయ రహదారిపై అంకులి బైపాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది.
ట్రక్ మాత్రం నిలుపుదల చేయకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణం చేస్తున్న 7 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కూలీల ఆర్తనాదాలతో స్థానికులు, రోడ్డుకు ఇరువైపులా వెళుతున్న వాహనచోదకులు వెంటనే అక్కడకు చేరారు. 108కు, స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ట్రాఫిక్ పోలీసులు, బరంపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులకు సేవలు చేశారు. స్థానిక ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment