
సాక్షి, అనంతపురం : జిల్లాలో ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద కారు, టెంపో ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రొద్దం మండలం తిమ్మాపురం నుంచి అనంతపురంలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారమందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వైఎస్ జగన్ సంతాపం
సత్తారుపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.