భోగాపురం వెళ్లే మార్గంలో పోలీస్‌ల పహారా
సాక్షిప్రతినిధి విజయనగరం : మావోయిస్టుల ప్రభావం, తీర ప్రాంత రక్షణ వంటి ప్రధాన అంశాలతో పాటు అనేక విషయాలపై చర్చించేందుకు ఏడు రాష్ట్రాల డీజీపీలు ఒకే చోట కలుస్తున్నారు. జిల్లాలోని భోగాపురం సన్‌రేస్ రిసార్ట్స్‌లో మంగళవారం వారి అంతర్గత సమావేశానికి పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. ఇతర రాష్ట్రాల డీజీపీలు ఎవ్వరూ రావడం లేదని మన రాష్ట్ర డీజీపీ సాంబశివరావు మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారని జిల్లా ఎస్పీ పాలరాజు అంటున్నారు. అయితే వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా ఇతర డీజీపీల పర్యటన విషయాన్ని అధికారులు బయట పెట్టడం లేదని తెలుస్తోంది. గతేడాది కూడా ఇదే ప్రాంతంలో ఇలాగే డీజీపీల సమావేశం జరిగింది. మావోయిస్టులను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే గడచిన ఏడాదిలో ఆంధ్రా–ఒడిశా(ఏఓబీ)లో మావోయిస్టు ఉద్యమంపై పోలీస్ బలగాలు ఉక్కుపాదం మోపాయి. మావోయిస్టు ముఖ్య నేతలను మట్టుబెట్టాయి.
విశాఖ, మల్కనగిరి సరిహద్దుల్లో 30 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసి మావోయిస్టుల అగ్రనేత ఆర్‌కె కు చావును రుచిచూపించారు. లొంగుబాట్లను సైతం ప్రోత్సహించి ఉద్యమాన్ని బలహీనపరిచారు. అయితే మావోయిస్టులు కూడా అంతేస్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు. పోలీస్ బలగాలను మందుపాతరలు పెట్టి హతమార్చారు. ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ స్థావరాలను మార్చుతూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం జరగనున్న సమావేశంలో మావోయిస్టు ఉద్యమంపై ఉన్నతాధికారులు తీవ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఏజెన్సీలో జరుగుతున్న గంజాయి సాగు అక్రమ రవాణాపైనా సమావేశంలో చర్చించనున్నారు. విశాఖతో పాటు తీర ప్రాంత భద్రత పైన ఉగ్రవాదుల చొరబాట్లు , ముప్పు వంటి అంశాలపైనా... మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా, అంతర్‌రాష్ట్ర స్మగ్లింగ్, అంతర్ రాష్ట్రనేరస్థులు, సైబర్ క్రైం వంటి ముఖ్య నేరాలపై ఉన్నతాధికారులు చర్చించనున్నట్లు తెలిసింది. ప్రముఖుల భద్రత పైన ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జాతీయ రహదారిపై భారీ బందోబస్తు
భోగాపురం మండలం సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల డీజీపీలు సమావేశం కానుండటంతో స్థానిక జాతీయ రహదారిపై పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఉన్నత అధికారులు సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆ దారిగుండా వెళ్ళే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే మార్గాల్లో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటుచేసారు. డెంకాడ మండలం గొలగాం సమీపంలో శ్రీశాంతి రిసార్ట్స్‌లో కూడా కొంతమంది సిబ్బంది రాత్రి బసచేస్తున్న సందర్భంగా ఆ దారిలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. వంతెనలు, కల్వర్టులు వద్ద బాంబ్ స్క్వాడ్ సోదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment