బాలిక కిడ్నాప్‌తో కలకలం | Seven Year Old Child Was Kidnapped In Kakinada city | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌తో కలకలం

Published Sun, Nov 24 2019 8:51 AM | Last Updated on Sun, Nov 24 2019 11:40 AM

Seven Year Old Child Was Kidnapped In Kakinada city - Sakshi

శాంతికుమారిని స్టేషన్‌కు తీసుకొస్తున్న పోలీసులు

సాక్షి, కాకినాడ క్రైం: జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం స్కూల్‌ నుంచి కిడ్నాప్‌కు గురైన దీప్తిశ్రీని సవతి తల్లి కిడ్నాప్‌ చేసి హత్య చేసిందని దీప్తి నాయనమ్మ ఆరోపిస్తోంది. గతంలో కూడా దీప్తికి వాతలు పెట్టడం లాంటివి చేసిందని దీప్తి నానమ్మ చెప్తోంది. దీంతో సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీప్తిశ్రీని గొంతునులిమి హత్యచేసి ఉప్పుటేరు కాల్వలో పడేశానని కాసేపు, సంజయ్‌ నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ వద్ద పడేసానని పోలీసుల విచారణలో రకరకాలుగా సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు గాలింపును కొనసాగిస్తున్నారు. శుక్రవారం నుంచి దీప్తి ఆచూకీ లభించకపోవడంతో నాయనమ్మ, మేనత్త చిన్ని, బేబి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

వివరాల్లోకెళ్తే.. జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌ వద్ద నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ ఘటన నగరంలో కలకలం రేపింది. తూరంగి పంచాయతీ పగడాలపేటకు చెందిన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసానిని శుక్రవారం పాఠశాల నుంచి నేరుగా కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు చిన్న నానమ్మ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి చేరకపోవడంతో తండ్రి సూరాడ సత్యశ్యామ్‌ కుమార్‌ ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో కాకినాడ వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. పగడాలపేటలో ఉంటున్న ఆమె నాన్నమ్మ సూరాడ బేబీ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారుడి మొదటి భార్య సత్యవేణి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిందని, రెండో భార్యగా కాకినాడ సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని ఇచ్చి పెళ్లి చేశారు.

మనుమరాలిని కోడలు శాంతికుమారి, ఆమె చెల్లెలు జ్యోతి కిడ్నాప్‌ చేసి ఉంటరని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటూ సీసీ కెమెరాలు బాగు చేసే పని చేసేవాడని, రెండో కోడలికి ఏడాది క్రితం బాబు పుట్టాడని చెప్పింది. ఆ సమయంలో దీప్తిశ్రీకి నెలకు రూ.2 వేలు చొప్పున బ్యాంకులో వేయాలని అడిగితే కోడలు అభ్యంతరం చెప్పిందన్నారు. రాజమహేంద్రవరంలో ఉంటున్నప్పుడు ఏడాది క్రితం ఈ చిన్నారిని అట్లకాడతో చెయ్యి, కాలు, మూతిపై కాల్చివేసిందని తెలిపారు. తన మనమరాలి అడ్డుతొలగించుకునేందుకే కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించింది. మనుమ రాలిని తండ్రి  పాఠశాలకు తీసుకెళ్లేవాడని  తెలిపింది. 

సీసీ ఫుటేజ్‌ల్లో..  
పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ పాఠశాలకు వచ్చి ఆమెని కొద్ది దూరం తీసుకువెళ్లి బైక్‌పై వ్యక్తితో వెళ్లినట్లు నమోదైందని ఒన్‌టౌన్‌ సీఐ రామోహన్‌రెడ్డి తెలిపారు. బాలిక మిస్సింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి చిన్నారి సవతి తల్లి శాంతికుమారి, ఆమె బంధువులను స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. కాకినాడ – సామర్లకోట రోడ్డులోని పంట, మురుగు కాలువల్లో  వెతికిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును ఆదివారం  భేదిస్తామని, కిడ్నాప్‌ చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఆనంద్‌ వివరణ  
రెండు రోజుల క్రితం ఈ బాలిక అమ్మ ఒడి లబ్ధి కోసం దరఖాస్తు పెట్టేందుకు ఆధార్, రేషన్‌ కార్డుల కోసం తనను నానమ్మ ఇంటికి పాప తీసుకెళ్లిందని పేరెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఆనంద్‌ తెలిపారు. ఉపాధ్యాయులు చెబితే తప్ప తనతో వచ్చేందుకు బాలిక అంగీకరించలేదన్నారు. నానమ్మ ఏ వివరాలు లేవని చెప్పిందన్నారు. ఈ చిన్నారి తెలివైదని, ఆమెను కిడ్నాప్‌ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, పాప ను క్షేమంగా నానమ్మ వద్దకు చేర్చాలని ఆయన కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement