
బాధిత బాలుడు పడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ నాగశివారెడ్డి
సాక్షి, చీమకుర్తి: కామంతో కళ్లు మూసుకుపోయిన 16 ఏళ్ల మైనర్.. మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన వాంఛ తీర్చుకున్న తర్వాత విషయం బయటకు తెలుస్తుందని భయపడిన కామాంధుడు బాలుడి తలపై అక్కడే ఉన్న బండరాయితో బాదాడు. స్పృహ తప్పిన తర్వాత బాలుడు మృతి చెంది ఉంటాడని భావించి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చీమకుర్తిలోని బైపాస్‌లో జరిగింది. బాలుడి తల్లి, కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలుడి తల్లి తన కుమారుడు కనిపించట లేదని బంధువులతో కలిసి వెతుకుతుంటే లైంగిక దాడికి పాల్పడిన యువకుడు కూడా వారితో కలిసి ఏమీ తెలియనట్లు నటించాడు. బైపాస్‌లోని ముళ్ల పొదల సమీపంలో వెతుకుతున్నట్లు నటించి చివరకు నేరుగా బాలుడు పడి ఉన్న ప్రాంతాన్ని తానే కనుగొన్నట్లు నేరానికి పాల్పడిన మైనర్ యువకుడు బాలుడి తల్లి, బంధువులకు చూపించాడు.
అప్పటికే ముళ్ల పొదల్లో తలకు వెనుక వైపు బలమైన గాయాలై ముఖం మీద ఎర్రగా కంది, ధరించిన నిక్కర్ తొలగించిన పరిస్థితిని చూసి తల్లి కలవరపడింది. బాలుడు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే 108లో రిమ్స్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ముళ్ల పొదల్లో బాలుడు ఉన్నాడనే విషయం నీకు ఎలా తెలుసని బంధువులు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నిలదీసి అడగటంతో చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించారు. బాధిత బాలుడి తండ్రి దుప్పట్లు, కుర్చీలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. చీమకుర్తిలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సమీపంలో ఉన్న చర్చికి తల్లి తన ముగ్గురు కుమారులను తీసుకొని ప్రార్థనకు వెళ్లింది. భర్త వ్యాపారం కోసం తిరుపతి వెళ్లాడు.
చర్చికి వెళ్లిన తల్లి
చర్చిలో ప్రార్థన సమయంలో మూడో కుమారుడు చర్చి నుంచి బయటకు వచ్చాడు. ఆడుకుంటుంటాడనుకొని తల్లి చర్చిలో ప్రార్థనలో నిమగ్నమైంది. ఇంతలో ఘోరం జరిగింది. ఇలా ఎందుకు చేశావని ఇతరులు నిందితుడిని అడిగితే పిల్లోడు ముద్దుగా ఉన్నాడని తన పైశాచికత్వాన్ని బయట పెట్టుకున్నాడు. బాలుడి తల్లి నుంచి పోలీసులు ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. పోక్సా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.నాగశివారెడ్డి తెలిపారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ చీమకుర్తి పోలీసుస్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment