
హైదరాబాద్: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు... ఓ స్నేహితురాలి ఫంక్షన్‌కు వెళ్తున్నానని ప్రియురాలు చెప్పింది. వెళ్లొద్దంటూ ప్రియుడు ఆమెతో ఫోన్ చాటింగ్‌లో వాదులాటకు దిగాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంబీఏ విద్యార్థిని వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంపల్లి శివశివానీ కళాశాల క్యాంపస్ హాస్టల్లో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తె హనీషా చౌదరి (23) కొంపల్లి శివశివానీలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల ఆవరణలో ఉండే హాస్టల్‌లో ఉంటోంది.
మేడ్చల్‌లో ఉండే తోటి విద్యార్థి దక్షిష్ పటేల్, హనీషా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 10.30కు ప్రారంభమైన వీరి చాటింగ్ అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగింది. వందకు పైగా మెసేజ్‌లు ఒకరికొకరు పంపుకున్నారు. రాత్రి 1.30 సమయంలో వీడియో కాల్ చేసిన హనీషా.. ‘నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్... నేనంటే నీకు ఇష్టం లేదు కదా’అంటూ మాట్లాడుతూ చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కంగుతిన్న దక్షిష్ విషయాన్ని హాస్టల్‌లో ఉంటున్న మరో విద్యార్థినికి ఫోన్ చేసి చెప్పాడు. అతను మేడ్చల్ నుంచి బయలుదేరి వచ్చేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. తలుపులు బద్దలుకొట్టి చూడగా హనీషా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హనీషాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ ఎస్సై గంగాధర్ తెలిపారు. హనీషా ఫోన్‌ను సీజ్ చేశారు. హనీషా మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు అనంతపురం తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment